Ravindra Jadeja: టీ20 ప్రపంచకప్ కప్ నుంచి కూడా జడేజా అవుట్!

ABN , First Publish Date - 2022-09-04T02:18:19+05:30 IST

మోకాలి గాయం కారణంగా ఆసియా కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరమైన టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా

Ravindra Jadeja: టీ20 ప్రపంచకప్ కప్ నుంచి కూడా జడేజా అవుట్!

న్యూఢిల్లీ: మోకాలి గాయం కారణంగా ఆసియా కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరమైన టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయమైన మోకాలికి వైద్యులు శస్త్రచికిత్స చేయనున్నారు. ఆ తర్వాత అతడు కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అతడు టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2022)కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని చెబుతున్నారు.


33 ఏళ్ల జడేజా ఆసియాకప్‌లో పాకిస్థాన్, హాంకాంగ్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మోకాలి గాయం కారణంగా ఆ తర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానాన్ని అక్సర్ పటేల్ (Axar Patel)తో భర్తీ చేశారు. జడేజా ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నాడు. రవీంద్ర జడేజా దూరం కావడం రోహిత్ సారథ్యంలోని భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బేనని చెబుతున్నారు. 


జడేజా కుడి మోకాలి గాయం తీవ్రమైనదేనని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అతడికి మేజర్ సర్జరీ అవసరమని పేర్కొన్నారు. ఆ తర్వాత అతడికి కొంతకాలంపాటు విశ్రాంతి అవసరమని అన్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు అతడు మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడన్న విషయాన్ని చెప్పలేమన్నారు. ఇది యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ACL) కేసని నిర్ధారణ కాలేదని ఆయన వివరించారు. ఇలాంటి వాటిలో కోలుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుందని అన్నారు. ఏది ఏమైనా కనీసం మూడు నెలల విశ్రాంతి అవసరమని తెలిపారు. 


జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జడేజా ఇదే మోకాలికి గాయమైంది. తాజాగా మళ్లీ అదే కాలికి గాయం కావడంతో గత గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదన్న విషయం అర్థమవుతోంది. ఆసియా కప్‌లో భాగంగా ఇప్పటి వరకు భారత్ ఆడిన రెండు మ్యాచుల్లో ఆరు ఓవర్లు వేసిన జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, అక్షర్ పటేల్ విషయానికొస్తే ఇప్పటి వరకు 25 మ్యాచుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అక్షర్.. 147 పరుగులు చేసి 21 వికెట్లు నేలకూల్చాడు. వెస్టిండీస్ సిరీస్‌లోనూ భారత్‌కు ఆడాడు.  

Updated Date - 2022-09-04T02:18:19+05:30 IST