మెడికల్ సీట్ల భర్తీలో అన్యాయం!

ABN , First Publish Date - 2020-11-18T05:35:56+05:30 IST

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నీట్ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తున్న ఎంబిబిఎస్, బిడిఎస్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు...

మెడికల్ సీట్ల భర్తీలో అన్యాయం!

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నీట్ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తున్న ఎంబిబిఎస్, బిడిఎస్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన మెడికల్ సీట్లలో ఓబిసీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. ఫలితంగా ప్రతీ విద్యాసంవత్సరంలో ఎంబిబిఎస్‌, బీడీఎస్, మెడికల్ పీజీ సీట్లు పెద్ద సంఖ్యలో ఓబీసీలు నష్టపోతున్నారు. 


జాతీయ మెడికల్ కౌన్సిల్ ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయకపోవడానికి కారణంగా 1984లో సుప్రీంకోర్టు ప్రదీప్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మెడికల్ సీట్ల భర్తీలో జాతీయస్థాయి కోటాలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సి), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) వెనుకబడిన తరగతులకు (బిసి) రిజర్వేషన్లు అమలు చేయకూడదని తీర్పు ఇచ్చినట్లు చెబుతున్నారు. తదనంతరం 2007లో అభయ్ నాథ్ వర్సెస్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కేసు తీర్పులో షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు జాతీయ స్థాయిలో కేటాయించిన ఆయా రాష్ట్రాల మెడికల్ సీట్ల భర్తీలో రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించింది. ముఖ్యంగా, 2015 వరకూ ఆలిండియా ప్రీ మెడికల్ టెస్ట్, ఆలిండియా పీజీ మెడికల్ ఎంట్రెన్స్ ద్వారా సీట్లు భర్తీ చేసేవారు. కానీ 2016-17 విద్యా సంవత్సరం నుండి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నీట్, నీట్ పీజీ పరీక్షలలో పాల్గొంటున్నాయి. ఇందులో జాతీయస్థాయి కోటాలో ఓబీసీలకు రిజర్వేషన్లను పెట్టని కారణంగా భారీగా సీట్లు నష్టపోతున్నారు. దీనిపై ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా నేటికీ స్పందించలేదు.  తమిళనాడులో డీఎంకే పార్టీ తమ రాష్ట్ర సీట్లు అయిన 15% ఎంబిబిఎస్/బిడిఎస్, 50% పీజీ సీట్లలో 50% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రాన్ని కోరింది. స్పందన లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం మద్రాస్ హైకోర్టు ధర్మాసనం డీఎంకే పార్టీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పులో జాతీయ స్థాయి సీట్లలో కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి విధానపరమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రాలకు రావాల్సిన బీసీ రిజర్వేషన్లు 2021-22 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని ఆదేశించింది. తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లను 2020-21 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని సుప్రీం కోర్టులో సవాల్ చేశాయి. అయినప్పటికీ సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను యధాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు అమలు పరచాలి. మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పును అమలు పరిచి జాతీయ స్థాయిలోని 15% ఎంబిబిఎస్/బిడిఎస్, 50% మెడికల్ పీజీ సీట్లలో బీసీ రిజర్వేషన్లను 2021-22 విద్యా సంవత్సరం నుండి అమలు చేసి బిసి విద్యార్థులకు న్యాయం చేయాలి.

కోడెపాక కుమార స్వామి

Updated Date - 2020-11-18T05:35:56+05:30 IST