చిత్తూరు ఆర్డీవోపై విచారణ

ABN , First Publish Date - 2021-01-22T06:46:25+05:30 IST

వెబ్‌ల్యాండ్‌ నమోదులో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై చిత్తూరు ఆర్డీవోపై విచారణ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

చిత్తూరు ఆర్డీవోపై  విచారణ

మరో ఇద్దరు తహసీల్దార్లతో పాటు ఆర్‌ఐ, వీఆర్వోలపై కూడా విచారణకు ఆదేశం 

వెదురుకుప్పంలో ప్రభుత్వ భూముల గోల్‌మాల్‌ వ్యవహారం


కలికిరి, జనవరి 21: వెదురుకుప్పం మండలంలో ప్రభుత్వ భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయడంలో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై చిత్తూరు ఆర్డీవో సి.రేణుక వ్యవహారాల గురించి విచారణ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెదురుకుప్పం తహసీల్దార్లుగా పనిచేసి రిటైరైన పి. మునిరత్నం, ప్రస్తుతం కలెక్టరేట్‌లో పనిచేస్తున్న పి.భారతిలపై కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వీరితోపాటు ఏఆర్‌ఐ జి.గోపీనాథ్‌, వీఆర్వో కె. మురళీలపై కూడా విచారణ జరపనున్నారు. జేసీ మార్కండేయులును విచారణాధికారిగా,ఆయనకు సహకరించేందుకు డీఆర్వో మురళిని కూడా ప్రెజెంటింగ్‌ అధికారిగా ప్రభుత్వం నియమించింది.వెదురుకుప్పం మండలంలోని వేపేరి గ్రామంలో ప్రభుత్వ భూమిని వెబ్‌ల్యాండ్‌ అడంగళ్‌లో రేణుక మోసపూరితంగా నమోదు చేశారనేది అభియోగం. ఆమెతో పాటు వెదురుకుప్పం తహసీల్దార్లుగా పనిచేసిన మునిరత్నం, భారతిలతోపాటు ఏఆర్‌ఐ గోపీనాథ్‌, ఆళ్ళమడుగు వీఆర్వోలను కూడా బాధ్యులుగా చేర్చాలని 2018 డిసెంబరులో సీసీఎల్‌ఏ ఆదేశించారు. 2018లోనే వీరికి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల పైన ఈ ఐదుగురు 2019లో వివరణలు, సంజాయిషీలు సమర్పించుకున్నారు. అయితే వీరి సంజాయిషీలతో సంతృప్తి చెందని ప్రభుత్వం తాజాగా విచారణకు ఆదేశించింది. మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది.

Updated Date - 2021-01-22T06:46:25+05:30 IST