గనులపై విచారణ

ABN , First Publish Date - 2022-01-21T05:53:45+05:30 IST

గనుల శాఖ అనకాపల్లి ఏడీ కార్యాలయం పరిధిలోని క్వారీల లీజుల వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

గనులపై విచారణ

మార్టూరు క్వారీ లీజు వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు సీరియస్‌

థర్డ్‌ పార్టీతో ఎంక్వయిరీకి యోచన

అక్రమాలు రుజువైతే చర్యలు తీసుకోవాలని నిర్ణయం

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


గనుల శాఖ అనకాపల్లి ఏడీ కార్యాలయం పరిధిలోని క్వారీల లీజుల వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. క్వారీలకు అనుమతులు, తదితర అంశాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సింది పోయి...ఆరోపణలు వచ్చేలా ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. అనకాపల్లి మండలం మార్టూరులోని ఒక గ్రావెల్‌ క్వారీ లీజుపై గనుల శాఖ విజిలెన్స్‌ ఏడీ ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో ఒకటి నాలుగు రోజుల క్రితం బయటకు వచ్చింది. దీనికితోడు అదే ప్రాంతంలో గల మెటల్‌ క్వారీ యజమానితో ప్రతాప్‌రెడ్డి కుటుంబీకులకు లావాదేవీలు వున్నాయని స్పష్టం చేస్తూ బ్యాంకు అకౌంట్‌లు కూడా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన ‘గనుల శాఖ అధికారి నిర్వాకం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురించింది. అయితే తమ గొంతను మార్ఫింగ్‌ చేసి మైనింగ్‌ వ్యాపారం చేస్తున్నట్టు ఆడియో టేపులు సృష్టించారని ప్రతాపరెడ్డి ఆరోపించారు. తనపై నమ్మకం లేకపోతే వేరే శాఖకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తాను తప్పు చేసినట్టు నిరూపణ అయితే రాజీనామా చేసి వెళ్లిపోవడానికి సిద్ధంగా వున్నానని పేర్కొన్నారు.


ఉత్తరాంధ్రలో ఆరు ఏడీ కార్యాలయాలు ఉండగా...అనకాపల్లి కార్యాలయం ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంటుంది. తాజాగా కూడా ఇదే కార్యాలయం క్వారీ లీజుపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గనుల శాఖలో సీనియర్‌ అధికారులను విచారణకు పంపిస్తే వారిపై కూడా ఆరోపణలు చేసే అవకాశం ఉందని, అందువల్ల థర్డ్‌ పార్టీతో దర్యాప్తు చేయించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు విజయవాడలోని గనుల శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులు సమాలోచనలు చేసినట్టు తెలిసింది. త్వరలో దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. విచారణలో ఆరోపణలు వాస్తవం అని తేలితే...అందుకు సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతుంది. తరచూ ముఖ్యమంత్రి కార్యాలయం, గనుల శాఖ డైరెక్టర్‌ పేర్లు ప్రస్తావిస్తూ ఇక్కడ కొంతమంది దందా చేస్తున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్టు తెలిసింది.


‘కలెక్షన్‌ కింగ్‌లు’పై విచారణ

గాజువాక జోనల్‌ కమిషనర్‌ ఆదేశం

భవన నిర్మాణదారులను విచారించిన ఏసీపీ

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన


గాజువాక, జనవరి 20: భవన నిర్మాణదారుల నుంచి ఇద్దరు నాయకులు, ఒక టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగి వసూళ్లకు పాల్పడుతున్నట్టు వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని గాజువాక జోనల్‌ కమిషనర్‌ శ్రీధర్‌ గురువారం టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ రమణమూర్తిని ఆదేశించారు. వార్డులో భవన నిర్మాణదారుల నుంచి మునిసిపల్‌ ఉద్యోగి సహకారంతో  వసూళ్లకు పాల్పడుతున్న వైనంపై ‘ఇద్దరూ ఇద్దరే...కలెక్షన్‌ కింగ్‌లు’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జెడ్సీ విచారణకు ఆదేశించడంతో టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ రమణమూర్తి భవన నిర్మాణదారులను కలిసి విచారించారు. ఈ మేరకు రూపొందించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నామని పేర్కొన్నారు. దీని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జోనల్‌ కమిషనర్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-21T05:53:45+05:30 IST