Advertisement

ఆ మాజీ మంత్రి బీజేపీలోకి రావడంతో వివేక్‌కు గుబులు పుట్టిందా..!?

Jan 24 2021 @ 19:08PM

బీజేపీలో కొత్త నేత‌ల రాక... సీనియ‌ర్లకు దడ పుట్టిస్తోందా...!  మాజీ మంత్రి ఆగం చంద్రశేఖ‌ర్ రాకను...మాజీ ఎంపీ వివేక్ జీర్ణించుకోలేక పోతున్నారా....! చంద్రశేఖ‌ర్‌ను తీసుకొచ్చిన నేత‌ల‌పై వివేక్ గుస్సా అవుతున్నారా..! అందుకే  జాయినింగ్ ప్రోగ్రాంకి డుమ్మా కొట్టారా..! ఇంత‌కీ వివేక్ అసంతృప్తికి కార‌ణం ఏమిటి...! వాచ్ దిస్ స్టోరీ..!


రగిలిపోతున్నారట.. 

మాజీ మంత్రి ఆగం చంద్రశేఖ‌ర్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో..పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో కొందరు నేతలు స్వాగతిస్తుంటే.. మరికొందరు లోలోపల రగిలిపోతున్నారట. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆగం చంద్రశేఖర్‌.. కమలం పార్టీలో తమ భవిష్యత్‌ ప్రయోజనాలకు గండికొడుతారనే ఆందోళనలో ఉన్నారట. దుబ్బాకలో గెలుపు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బలం పెరగడంతో  ఊపు మీదున్న బీజేపీ....వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఇత‌ర పార్టీల నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రోత్సహిస్తోంది.  ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఆగం చంద్రఖ‌ర్ కాంగ్రెస్‌ను వీడి కమలం గూటికి చేరుకున్నారు. భారీ బహిరంగ సభతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.  బీజేపీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సమక్షంలో కాషాయ కండువా క‌ప్పుకున్నారు. వికారాబాద్‌లో నిర్వహించిన సభకు దాదాపు రాష్ట్ర ముఖ్యనేతలంతా హాజరయ్యారు.

 

చంద్రశేఖర్‌ ఎవరు..!?

పూర్వ రంగారెడ్డి జిల్లా నుంచి రాజ‌కీయ ప్రస్థానం ప్రారంభించిన ఆగం చంద్రశేఖర్‌...టీడీపీ అభ్యర్థిగా వికారాబాద్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత టిఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అల‌యన్స్‌లో భాగంగా నాటి వైఎస్ కేబినెట్‌లో మ‌రోసారి మంత్రి అయ్యారు. ఆ త‌ర్వాత కేసీఆర్‌తో విభేధించి కాంగ్రెస్‌లో చేరారు. గ‌త పార్లమెంట్‌ ఎన్నిక‌ల్లో పెద్దపల్లి నుంచి బ‌రిలో నిలిచి.. టిఆర్ఎస్‌కు గ‌ట్టిపోటీ ఇచ్చారు. ఒక ద‌శ‌లో ఆయన విజ‌యం ఖాయ‌మన్న ప్రచారం జరిగింది. చివ‌రి నిమిషంలో సొంత పార్టీలో కొంద‌రు నేత‌లు దెబ్బకొట్టడంతో ఓట‌మిపాల‌య్యారని చెబుతారు. త‌న ఓట‌మికి కార‌ణ‌మైన నేత‌లపై అధిష్టానానికి చంద్రశేఖర్‌ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఆయన..చివ‌రికి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

వివేక్ నొచ్చుకున్నారా..!?

అయితే ఆగం చంద్రశేఖర్‌ చేరిక‌పై మాజీ ఎంపీ వివేక్ కినుక వ‌హించిన‌ట్లు  ప్రచారం జ‌రుగుతోంది. అందుకోసమే ఆయన..చంద్ర శేఖర్ జాయినింగ్ ప్రోగ్రాంకు డుమ్మా కొట్టినట్లు కమలదళంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో వివేక్ మాత్రం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. వివేక్  ఆగ్రహం వెనక ప‌లు కారణాలున్నట్లు తెలుస్తోంది. వివేక్ ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ప్రముఖులో ఒక‌రిగా చ‌లామ‌ణి అవుతున్నారు. పైగా ఎస్సీ సామాజిక వ‌ర్గం నుంచి ఆయ‌న ఒక్కరే ఆ పార్టీలో ఆర్ధికంగా,రాజ‌కీయంగా బ‌ల‌మైన నేత‌గా కొన‌సాగుతున్నారు. కోర్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే రాజ‌కీయాల్లో త‌నకన్నా సీనియ‌ర్,ఎస్సీ సామాజిక వ‌ర్గానికే చెందిన ఆగం చంద్రశేఖర్‌ బీజేపీలో చేరడంతో వివేక్ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్‌తో  భవిష్యత్‌లో త‌న అవ‌కాశాలకు గండి ప‌డుతుంద‌ని ఒకింత ఆందోళన చెందుతున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. డీకే అరుణ‌మ్మ మధ్యవర్తిత్వంతోనే ఇదంతా జ‌రిగింద‌ని స‌న్నిహితుల‌తో వాపోతున్నారట.

మొదట్నుంచి కంచుకోట‌లా..!

పెద్దపల్లి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని మొదటి నుంచి వివేక్ కుటుంబం త‌మ కంచుకోట‌లా భావిస్తోంది. ఆయన తండ్రి దివంగత వెంకటస్వామి ఇక్కడి నుంచే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆయన వారసుడిగా వివేక్ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. మరోసారి ఓడి పోయారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్‌లో చేరి పెద్దపల్లి టికెట్ ఆశించి భంగపడ్డారు. బీజేపీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినా పోటీ చేయలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు.

వివేక్‌‌లో టెన్షన్‌!

అయితే మాజీ మంత్రి  ఆగం చంద్ర శేఖర్ బీజేపీలో చేరడంతో... తనకు ఎదురేలేదని భావించిన వివేక్  ఇబ్బందిగా ఫీలవుతునట్టు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రశేఖర్‌ పెద్దపల్లి నుంచి పోటీ చేశారు. అవకాశం వస్తే మళ్లీ పెద్దపల్లి పార్లమెంట్‌ బరిలో నిలవాలని భావిస్తున్నారట. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు పోలైన ఓట్లను చూస్తే బీజేపీ అధిష్టానం ఆయన పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పైగా పెద్దపల్లి పార్లమెంటు ఫ‌రిధిలో తనకు బ‌ద్ద విరోధులైన కాంగ్రెస్ ముఖ్యనేతలను బీజేపీలో చేర్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతో వివేక్‌ టెన్షన్‌ పడుతున్నారట. 

ఏం జరుగుతుందో..!?

మరోవైపు పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని ఇటు వివేక్ అటు చంద్రశేఖర్ ఆసక్తి చూపిస్తున్నా.. బీజేపీ హైకమాండ్‌ మాత్రం ఇప్పుడే టికెట్లపై ఎవరికీ ఎలాంటి హామీ ఇచ్చే అవకాశం లేదంటున్నారు. మరో ఎస్సీ రిజర్వుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉంది. అక్కడ బీజేపీకి బలమైన నేత లేరు. ఈ క్రమంలో మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్‌కు పెద్దపల్లి టికెట్‌ ఇస్తే.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్‌కు నాగర్ కర్నూల్‌కు పంపొచ్చన్న చర్చ జరుగుతోంది. మధ్యలో వరంగల్ కూడా ఉంది. ఒక వేళ సమీకరణలు మారితే చంద్రశేఖర్‌కు సుపరిచితమైన ఎస్సీ రిజర్వుడు వికారాబాద్, చేవెళ్ల ,సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయంటున్నారు. అలాగే వివేక్‌కు కూడా ఎస్సీ రిజర్వుడు చెన్నూరు, ధర్మపురి ,బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి కేటాయించవచ్చని చెబుతున్నారు. ఏదేమైనా ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్లుగా బీజేపీలో ఇద్దరు కీలకమైన దళిత నేతలు అడ్జస్ట్ కావడం అంత సులువు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.