వార్డు మెంబర్‌‌గా గెలిచిన వైసీపీ ఎంపీ భార్య.. ఆసక్తికర చర్చ!

ABN , First Publish Date - 2021-02-28T18:15:06+05:30 IST

ఆ జిల్లాలో అది మేజర్‌ పంచాయతీ.. ఆ పంచాయతీని కైవసం చేసుకోవటానికి హేమాహేమీలందరూ సర్వశక్తులొడ్డారు.....

వార్డు మెంబర్‌‌గా గెలిచిన వైసీపీ ఎంపీ భార్య.. ఆసక్తికర చర్చ!

ఆ జిల్లాలో అది మేజర్‌ పంచాయతీ.. ఆ పంచాయతీని కైవసం చేసుకోవటానికి హేమాహేమీలందరూ సర్వశక్తులొడ్డారు. కానీ ఊహించని విధంగా వారి ఆశలు గల్లంతయ్యాయి. అయినా ఆ పంచాయతీలో తమ పట్టు నిలుపుకోవాలకున్నారు. జిల్లాకు చెందిన రాజకీయ ఉద్దండులు మంత్రాంగం నడిపారు. మొత్తానికి వారు అనుకున్నది సాధించారు. ఒక వార్డు మెంబర్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు వారు ఇంతగా ఎందుకు ఆరాటపడ్డారు? ఆ సంగతేమిటో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.


రెండుసార్లు సర్పంచ్‌గా...!

విజయనగరం జిల్లా చీపురుపల్లి పేరు వింటే మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుకువస్తారు. రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన బొత్స నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షించాయి. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ భార్య శ్రీదేవి జిల్లాలోని చీపురుపల్లి మేజరు పంచాయతీలో వార్డు స్థానానికి బరిలో దిగడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ పంచాయతీకి ఆమె రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఈ సారి ఎస్సీ మహిళకు రిజర్వ్‌ కావడంతో సర్పంచ్‌ పదవికి కాకుండా 7వ వార్డు సభ్యురాలిగా పోటీ చేసి గెలిచారు.


చీపురపల్లి కేంద్రంగా రాజకీయం 

అయితే చీపురుపల్లి పంచాయతీ ఎన్నికలు రాజకీయ సమీకరణలకు తెరలేపాయి. టీడీపీకి చెందిన వారిని గాలం వేసి లాగాలనుకొనే చర్యలు సాగకపోయినప్పటికీ.. పంచాయతీని కైవసం చేసుకునేందుకు కాకలు తీరిన నాయకులు రంగంలోకి దిగారు. ఈ పంచాయతీ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించటంతో అసలు రాజకీయ కథను అధికార పార్టీ నేతలు రక్తి కట్టించారు. నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఇక్కడ విజయం పొందిన నేతలందరూ చీపురపల్లి మేజర్ పంచాయతీని కేంద్రంగా చేసుకొనే రాజకీయం నడిపారు. 


బెల్లాన కుటుంబం గీత గీస్తే..

రాజకీయ చతురత కలిగిన వారంతా ఇక్కడ దృష్టి సారించారు. ఈ పంచాయతీపై మూడు దశాబ్ధాలుగా ప్రస్తుత ఎం.పి బెల్లాన చంద్రశేఖర్ కుటుంబం ఏ గీత గీస్తే.. ఆ గీతను ఇక్కడి జనం దాటరనే వాదన ఉంది. ఈ పంచాయతీకి బెల్లాన చంద్రశేఖర్‌ భార్య శ్రీదేవి రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. కానీ గత ఎన్నికల్లో బెల్లాన కుటుంబం రాసిన గీతలను టీడీపీ నేతలు చెరిపేశారు. ఈ క్రమంలోనే చీపురుపల్లి పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయ్యింది. మంత్రి బొత్స, ఎం.పి బెల్లాన ఇద్దరు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో.. వీరికి అండగా ఉన్న నేతలెవరూ ఇక్కడ పోటీ చేయటానికి రిజర్వేషన్ అడ్డొచ్చిందట.


పట్టునిలుపుకున్నామని సంబరాలు!

మొత్తానికి వైసీపీ నేతలు తమ మాట వినేవారిని చీపురుపల్లి సర్పంచ్‌ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. అయితే పంచాయతీ సమావేశంలో తమ సామాజికవర్గానికి చెందినవారు ఎవరూ లేకపోతే ఎలా అని ఆలోచించారట. ఏడో వార్డులో ఎంపీ బెల్లాన సతీమణి శ్రీదేవిని వార్డు మెంబరుగా పోటీ చేయించారు. ఎన్నికల సింబల్‌ వచ్చిన దగ్గర నుంచి గెలుపు పత్రం అందుకునే వరకు బెల్లాన దంపతులు జోరుగా ప్రచారం నిర్వహించారట. అంతేకాదు మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తెరచాటు మంత్రాంగాలు నడిపినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. శ్రీదేవి ఏడో వార్డు మెంబరుగా విజయం సాధించడంతో.. ఆమెకు ఉప సర్పంచ్ పదవిని కేటాయించారు. రిజర్వేషన్‌ ప్రకారం తమ వారు సర్పంచ్‌గా పోటీ చేయకపోతేనేం.. ఉప సర్పంచ్ పదవి దక్కించుకొని చీపురుపల్లి పంచాయతీలో తమ పట్టు నిలుపుకున్నామని ఎంపీ బెల్లాన, బొత్స వర్గీయులు సంబరపడిపోతున్నారట. 



Updated Date - 2021-02-28T18:15:06+05:30 IST