ప్రజలకు జవాబుదారీగా ఉండాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-19T05:57:55+05:30 IST

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి జవాబుదారీగా ఉండాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సూచించారు.

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి: కలెక్టర్‌
ప్రభుత్వ వైద్యశాలలో రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌

దొర్నిపాడు, మే 18: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి జవాబుదారీగా ఉండాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సూచించారు. మండలంలోని దొర్నిపాడు తహసీల్దార్‌, ఎంపీడీవో, వ్యవసాయశాఖ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో హాజరు పట్టికను పరిశీలించారు. స్పందన ఫిర్యాదులకు సంబంధించి ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్‌ జయప్రసాద్‌కు సూచించారు. ఉపాధి హామీ కూలీల సంఖ్య, ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే పారిశుధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాల ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని ఎంపీడీవో సుబ్రహ్మణ్యంకు సూచించారు. ఇటీవల కురిసిన అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంట నష్టం అంచనా వేసి ప్రతిపాదనను సమర్పించాలని ఏవో కల్యాణ్‌కుమార్‌కు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్లను పరిశీలించారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు అవగాహన కల్పిస్తూ నాణ్యమైన వైద్యం అందించాలని తెలియజేశారు. అలాగే ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా చూడాలని వైద్యాధికారి నాగేంద్రకు సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందిస్తున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. స్పందనలో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలను సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు, పౌష్టికాహారం పంపిణీ తదితర వాటిని పరిశీలించి సంతృప్తికరంగా లేక పోవడంతో సిబ్బందిపై మండిపడ్డారు. తహసీల్దార్‌ జయప్రసాద్‌, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఈవోపీఆర్డీ నాగఅనసూయ, వైద్యాధికారి నాగేంద్ర, వ్యవసాయా ధికారి కల్యాణ్‌కుమార్‌, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-05-19T05:57:55+05:30 IST