యాసంగిలో వరి సాగు చేయొద్దు

ABN , First Publish Date - 2021-12-07T04:45:26+05:30 IST

యాసంగిలో వరి సాగు చేయొద్దని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి జిల్లా రైతాంగానికి సూచించారు.

యాసంగిలో వరి సాగు చేయొద్దు
బీచుపల్లి కొనుగోలు కేంద్రం వద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

- జిల్లా రైతాంగానికి కలెక్టర్‌ క్రాంతి సూచన

- కొండేరు, బీచుపల్లిలలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ఎర్రవల్లి చౌరస్తా, డిసెంబరు 6 : యాసంగిలో వరి సాగు చేయొద్దని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి జిల్లా రైతాంగానికి సూచించారు. వరికి బదులుగా లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెప్పారు. ఇటిక్యాల మండలంలోని కొండేరు, బీచుపల్లి గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆమె పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లాభదాయకమైన పంటలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మినుములు, పెసర్లు, చిరుధాన్యాలతో పాటు ఆయిల్‌పామ్‌ వంటి పంటలపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని చెప్పారు. వాటి విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉంటాయో తెలపాలన్నారు. అనంతరం కొండేరులోని వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. అన్ని గ్రామాల్లో రెండో డోసు పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో చందూనాయక్‌కు సూచిం చారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం, అర్‌ఐ ప్రశాంత్‌గౌడ్‌, సర్పంచులు వీరన్న, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.


తహసీల్దార్‌ కార్యాలయం తనిఖీ 

మానవపాడు : మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల గదిలో జరిగిన అగ్నిప్రమాదంపై అధికారులతో మాట్లాడి కారణాలను తెలుసుకున్నారు. రికార్డులు దగ్ధం కావడం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో అపరిశుభ్రతను గమనించిన అధికారులపై, ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా తెలియదా అంటూ మండి పడ్డారు. అనంతరం పీహెచ్‌సీని పరిశీలించారు. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, అందరికీ వ్యాక్సిన్‌ వేయించాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వరలక్ష్మీ, ఎంపీడీవో రమణారావ్‌, వైద్య సిబ్బంది శశి కిరణ్‌, ఇర్షాద్‌ తదితరులు పాల్గొన్నారు.


జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి

గద్వాల క్రైం : జాతీయ రహదారికి ఇరువైపులా మిగిలిపోయిన స్థలాల్లో కూడా మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు.  జిల్లా కేంద్రంలోని సమావేశపు హాలులో అటవీశాఖ అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏ మొక్కలు నాటాలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ప్రతీ కిలోమీటర్‌, రెండు కిలోమీటర్లకు మొక్కలను మార్చాలని, పచ్చదనంతో పాటు పూల మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, డీపీవో శ్యాంసుందర్‌, అధికారులు పాల్గొన్నారు. 


విద్యార్థులకు అభినందన

మహరాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో నవంబరు 20 నుండి 27 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి టగ్‌-ఆఫ్‌-వార్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు నుంచి యూ/13, యూ/15, యూ/17, యూ/19 సీనియర్స్‌ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచి గోల్డ్‌, సిల్వర్‌, కాంస్య పతకాలను సాధించిన జిల్లా క్రీడాకారులను కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అభినందించారు. వివిధ పతకాలు సాధించిన బుజ్జి, పరశురామ్‌, హరికృష్ణ, చంద్రశేఖర్‌, మంజునాథ్‌, సునీత, సురేందర్‌, పరశురామ్‌, హరిత, నిఖిత, అఖిల, కౌశిక్‌, ఇందులను ఆమె అభినందించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో పీఈటీలు, ఉపాధ్యాయుడు కృష్ణయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-07T04:45:26+05:30 IST