ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2022-07-06T05:18:41+05:30 IST

లింగంపేట మండలంలోని ఫర్టిలైజర్‌, సీడ్స్‌ దుకాణాలను మంగళవారం వ్యవసాయశాఖ, పోలీసుశాఖలకు చెందిన అధికారులు తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఎరువులు, విత్తనాలు విక్రయించాలని వారు సూచించారు.

ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీలు
లింగంపేటలో ఎరువులు, విత్తనాల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు

లింగంపేట, జూలై 5: లింగంపేట మండలంలోని ఫర్టిలైజర్‌, సీడ్స్‌ దుకాణాలను మంగళవారం వ్యవసాయశాఖ, పోలీసుశాఖలకు చెందిన అధికారులు తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఎరువులు, విత్తనాలు విక్రయించాలని వారు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినా, స్టాక్‌ వివరాలు సక్రమంగా లేకపోయినా, రైతులు కొనుగోలు చేసిన ప్రతీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులకు తప్పని సరిగా బిల్లులు ఇవ్వాలని వారు సూచించారు. నిబంధనలు పాటించని వారి లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏడీఏ అపర్ణ, మండల వ్యవసాయ అధికారి అనిల్‌కుమార్‌, ఏఎస్సై రంగారావులతో పాటు ఇతర మండలాలకు చెందిన ఏవోలు ఉన్నారు. 

విత్తన దుకాణాలను తనిఖీ చేసిన స్క్వాడ్‌ బృందం

తాడ్వాయి : మండల కేంద్రంలో మంగళవారం విత్తనాలు, ఎరువుల దుకాణాలను స్క్వాడ్‌ బృందం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ సహాయ సంచాలకులు అపర్ణ మాట్లాడుతూ దుకాణాల్లో ఎక్కడైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులు, పురుగు మందులకు సంబంధించిన రికార్డులు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి వ్యవసాయశాఖ అధికారి శ్రీకాంత్‌, కామారెడ్డి, దోమకొండ వ్యవసాయశాఖ అధికారులు శ్రీనివాస్‌రావు, పవన్‌, ఎస్‌ఐ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలి

మాచారెడ్డి: రైతులకు సరిపోయే ఎరువులను అందుబాటులో ఉంచాలని మాచారెడ్డి ఇన్‌చార్జ్‌ ఎంపీపీ నరసింహారెడ్డి అన్నారు. వానాకాలం రైతులు వేసే పంటలకు ఎరువులను అందించాలని తెలిపారు. సొసైటీ, సబ్‌ సెంటర్లలో ఎరువులను అందుబాటులో ఉంచి రైతులకు అందించాలన్నారు. మండలంలోని మాచారెడ్డి సొసైటీతో పాటు ఎల్పుగొండ, ఫరీద్‌పేట్‌, భవానీపేట్‌, ఎల్లంపేట్‌, సోమర్‌పేట్‌ సెంటర్లలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఏవో రాజలింగం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:18:41+05:30 IST