నాకు ప్రేరణ, స్ఫూర్తి బాలూ అన్నయ్యే!

ABN , First Publish Date - 2020-09-27T15:37:39+05:30 IST

ఔత్సాహిక గాయనిగా ఆమెకు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఓ ఆరాధ్య దైవం.. తొలినాళ్ళలో..

నాకు ప్రేరణ, స్ఫూర్తి బాలూ అన్నయ్యే!

గాన గంధర్వుడికి శోభారాజ్‌ జ్ఞాపకాల నివాళి


తిరుపతి, ఆంధ్రజ్యోతి: ఔత్సాహిక గాయనిగా ఆమెకు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఓ ఆరాధ్య దైవం.. తొలినాళ్ళలో ఆమె పాల్గొన్న పాటల పోటీలకు ఆయనే న్యాయ నిర్ణేత... సినీ పరిశ్రమకు ఆహ్వానించి మరీ అవకాశాలిచ్చిన గాడ్‌ ఫాదర్‌... సినీ సంగీత ప్రపంచంలో మేరునగమైన అలాంటి గాయక ప్రముఖుడికి ఆమె తొలిసారి అన్నమాచార్యుని సంకీర్తనలను పరిచయం చేశారు... అంతేనా? తొలిసారి ఆయనతో ఆ సంకీర్తనలు పాడించారు... అన్నమయ్య పాటల గురించి తనకు పెద్దగా అవగాహన లేదంటూ భేషజాలకు అతీతంగా వాటి ఆలాపనపై సందేహ నివృత్తి చేసుకున్న బాలూ సంస్కారానికి ముగ్ధులయ్యారామె... కాలక్రమంలో బాలూ అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పిలిచే చెల్లిగా అనుబంధాన్ని పెంచుకున్నారు...అనారోగ్యంతో అమరపురికేగిన గాన గంధర్వుడితో తన యాభై ఏళ్ళ సుదీర్ఘ పరిచయాన్ని తలచుకుంటూ ప్రముఖ గాయని శోభారాజ్‌ మరపురాని జ్ఞాపకాలతో నివాళి అర్పించారు. 


బాలూ గారి నుంచీ బహుమతి అందుకున్నా

చిన్నప్పటి నుంచీ నాకు పాటలంటే చాలా ఇష్టం. 1971లో తిరుపతి పద్మావతీ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌లో వుండగా విజయచిత్ర సినిమా పత్రికలో ఎస్పీ బాలూ గారి గురించి ఆర్టికల్‌ చదివా. అందులో ఆయన విద్యార్థిగా వున్నపుడు తిరుపతి యూనివర్శిటీ పాటల పోటీల్లో పాల్గొని ఫస్ట్‌ ఫ్రైజ్‌ సాధించారని వుంది. అప్పటికే ఏకవీర సినిమాలో బాలూ పాడిన పాట విని ఆయన అభిమానిగా మారా. దాంతో నేను కూడా ఆయనలాగే యూనివర్శిటీ పోటీల్లో నెగ్గాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అందుకే పట్టుబట్టి యూనివర్శిటీ పోటీల్లో పాల్గొని మొదటి బహుమతి తెచ్చుకున్నా.1973లో తిరుపతి పద్మావతీ కాలేజీలోనే డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా నెల్లూరు జిల్లా గూడూరులో కాళిదాస కళా నికేతన్‌ అనే సంస్థ పాటల పోటీలు నిర్వహించింది. దానికి న్యాయ నిర్ణేతగా బాలూ గారు వస్తారని తెలిసింది.


ఆయన కూడా విద్యార్థి దశలో ఆ సంస్థ పోటీల్లో పాల్గొని ఫస్ట్‌ ప్రైజ్‌ తెచ్చుకున్నారని ముందే తెలిసివుండడంతో అమ్మతో దెబ్బలాడి అన్నయ్యను వెంటబెట్టుకుని గూడూరు వెళ్ళా. ఆ పోటీల్లో అమాయకురాలు సినిమాలోని ‘‘పాడెద నీ నామమే గోపాలా’’ అన్న పాట, ప్రేమనగర్‌ సినిమాలోని ‘‘ఎవరో రావాలి’’ అన్న పాటలు పాడా.తొలి స్థానం దక్కించుకుని ఆయన చేతుల మీదుగానే బహుమతి అందుకున్నా.


సినీ పరిశ్రమకు ఆహ్వానించి మరీ అవకాశాలిప్పించారు!

గూడూరు కాళిదాస కళానికేతన్‌ పోటీల్లో పాల్గొన్న సందర్భంగా నేను పాడడం చూసిన బాలూ గారు అక్కడే మా అన్నయ్యను పిలిచి ‘‘ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు వుంది... మద్రాసుకు తీసుకురండి.. సినిమాల్లో అవకాశాలు దొరుకుతాయి..’’ అని చెప్పారు. చెప్పినట్టుగానే కొంతకాలానికి సినిమాల్లో పాడే అవకాశం కూడా ఇప్పించారు. అయితే 1978లో టీటీడీ నన్ను దేవస్థానం ఆస్థాన గాయనిగా నియమించడంతో జీవితమంతా ఆ మార్గంలోనే నడవాలని నిర్ణయించుకున్నా. దాంతో సినిమా పాటల అధ్యాయం అంతటితోనే ఆగిపోయింది.1976లో కృష్ణా జిల్లా దివిసీమ ఉప్పెన సంభవించిన సమయంలో బాధితుల సహాయార్ధం హైదరాబాదులో స్టార్‌ నైట్‌ పేరిట సినీ సంగీత ప్రముఖులతో సంగీత విభావరి నిర్వహించారు.


పద్మావతీ కాలేజీ ప్రిన్సిపాల్‌ సూచనతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నా. అప్పటికే కొన్ని సినిమాలలో పాటలు పాడివుండడంతో కొంత మేరకు గుర్తింపు వున్నా తొలిసారి ఎస్పీ బాలూ గారితో గళం పంచుకున్నది మాత్రం ఆ సందర్భంలోనే. ఆయన చేతుల మీదుగా ఔత్సాహిక గాయనిగా బహుమతులు అందుకున్న నాకు ఆయనతో కలసి పాటలు పాడే అదృష్టం దక్కడంతో పొంగిపోయా.


అన్నమయ్య సంకీర్తనలు తొలిసారి పాడించా

1978 మేలో టీటీడీ గాయనిగా నియమితురాలినయ్యా. అప్పటి వరకూ దేవస్థానం అన్నమాచార్య వర్ధంతి మాత్రమే ఏటా నిర్వహించేది. జయంతి జరిపేవారు కాదు. జయంతి కూడా జరిపితే బాగుంటుందని అప్పటి ఈవో రాజగోపాల రాజు గారిని కోరితే అనుమతి ఇవ్వడంతో అన్నమయ్య జీవిత చరిత్రను సంగీత రూపకంగా రాశా. అన్నమయ్య సంకీర్తనల్లోని వివిధ రసాలు గొంతులో పలికించాలంటే దానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం మాత్రమే న్యాయం చేయగలరని అనిపించింది. 1979లో ఆయన్ను, పి.సుశీల గారిని ఆహ్వానించి రికార్డింగ్‌ చేయించాం. అన్నమాచార్య సంకీర్తనల గురించి విపులంగా తెలుసుకోవడం, ఆలపించడం కూడా బాలూ అన్నయ్యకు అదే తొలిసారి. ఆయనతో మొదటిసారిగా అన్నమయ్య సంకీర్తనలు పాడించిన అదృష్టం నాకు దక్కింది.


అక్కినేనితో స్వర్ణ కంకణం తొడిగించుకున్నాం

ఎస్పీ బాలూ గారికి అక్కినేని నాగేశ్వరరావు జీవన సాఫల్య పురస్కారం, నాకు పద్మశ్రీ అవార్డులు రావడంతో మా ఇద్దరినీ నాగేశ్వరరావు గారు ఇంటికి ఆహ్వానించారు. మా ఇద్దరినీ అభినందించి ఆయన స్వహస్తాలతో మా ఇద్దరికీ స్వర్ణ కంకణాలు తొడిగారు. చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఇలాంటి మధుర జ్ఞాపకాలు ఎన్నో వున్నాయి.


రాఖీ మెసేజే ఆయన చివరి సందేశం

ఎస్పీ బాలు గారితో నాకు, మా కుటుంబానికీ సుదీర్ఘ పరిచయముంది. ఈ యాభై ఏళ్ళ కాలంలో మామధ్య అన్నా చెల్లెళ్ళ అనుబంధం పెనవేసుకుంది. తనో ప్రముఖ గాయకుడన్న అహంగానీ, భేషజం గానీ ఆయనలో కనిపించవు. అందుకే అన్నయ్యా అంటూ అరమరికలు లేకుండా సంభోదించి మాట్లాడేదాన్ని. ఆయన కూడా అమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఏటా క్రమం తప్పకుండా రక్షాబంధన్‌కు రాఖీని కొరియర్‌లో పంపేదాన్ని. ఆయన నుంచీ అదే రూపంలో ఆశీర్వాదాలు అందేవి. ఈ ఏడాది కరోనా ప్రభావంతో కొరియర్‌ పంపలేక వాట్సాప్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్‌ పెట్టాను. దానికి ‘‘సౌభాగ్యవతి భవాని’’ అంటూ ఆయన నుంచీ రిప్లై వచ్చింది. అదే ఆయన నుంచీ నేనందుకున్న చివరి సందేశం. 


అలాంటి సంస్కార గాయకుడు అరుదు!

అన్నమయ్య సంకీర్తనలను పాడిస్తున్న సందర్భంలో తనకు వాటి పట్ల పెద్దగా అవగాహన లేదని బాలూ సూటిగా చెప్పారు. ఎక్కడైనా లోపాలు, తప్పులు కనిపిస్తే  సంకోచం లేకుండా చెప్పమని తరచూ చెబుతూ సందేహాలు నివృత్తి చేసుకునేవారు. అప్పటికే ఆయన చాలా పెద్ద స్థాయి వున్న గాయకుడు. అయినా తన స్థాయి మరచి తప్పులుంటే సూచించాలని చెప్పడమే ఆయన సంస్కారానికి నిదర్శనం. 




Updated Date - 2020-09-27T15:37:39+05:30 IST