బంజరు నేలలో మొలకెత్తిన బంగారం!

Published: Mon, 17 May 2021 00:11:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బంజరు నేలలో మొలకెత్తిన బంగారం!

నేలను నమ్ముకొంటే రైతుకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మరోసారి రుజువు చేశారు వన్నూరమ్మ. కష్టాలెన్ని ఎదురైనా స్థైర్యం కోల్పోని ఆమె... బీడు భూమిలో బంగారు పంటలు పండించారు. దేశంలోని ఆదర్శ రైతుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. ప్రధాని మోదీతో ముఖాముఖి మాట్లాడే అవకాశాన్ని పొంది, ఆయన ప్రశంసలు అందుకున్నారు. ‘ప్రకృతి వ్యవసాయమే రైతు సమస్యలకు పరిష్కారం’ అని చెబుతున్న ఆమె జీవన ప్రస్థానం ఇది... 


‘‘కుటుంబాన్ని ఎలా పోషించాలనే ప్రశ్నకు నేను వెతుక్కున్న సమాధానం వ్యవసాయం. ఉపాధి కరువైన సమయంలో వ్యవసాయాన్నే జీవనాధారంగా ఎంచుకున్నాను. మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని దురదకుంట గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబం. ఆరేళ్ళ కిందట నా భర్త గోవిందప్ప అనారోగ్యంతో చనిపోవడంతో పరిస్థితులన్నీ తల్లకిందులయ్యాయి. నా నలుగురు పిల్లలకు దారి చూపించే బాధ్యత నా మీద పడింది. 


ఎగతాళి చేశారు...

మా కుటుంబానికి ముప్ఫై ఏళ్ళ కిందట ప్రభుత్వం 4.3 ఎకరాల బంజరు భూమి ఇచ్చింది. ఒకప్పుడు అది పంటలు పండే భూమే. అయితే భవన నిర్మాణాల కోసం రాళ్ళ తవ్వకాల వల్ల బీడుగా మారిపోయింది. అందులో సాగు సాధ్యం కాకపోవడంతో మా పెద్దలు దాన్ని అలాగే వదిలేశారు. భర్త పోయాక కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని గడిపేదాన్ని. మూడేళ్ళ కిందట ప్రకృతి వ్యవసాయం గురించి నాకు మొదటిసారి తెలిసింది. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ లక్ష్మీ నాయక్‌ మా గ్రామానికి వచ్చి, రైతులతో సమీక్ష జరిపారు. రైతులు, భూముల వివరాలు సేకరించారు. సరైన పద్ధతులు పాటిస్తే ఏడాదికి మూడు పంటలు పండించవచ్చని చెప్పారు. ఆయన చొరవతో గ్రామంలో 64రైతు సంఘాలు ఏర్పాటయ్యాయి. ఈ స్ఫూర్తితో నేను కూడా వ్యవసాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఆ మాట చెప్పగానే ఎంతోమంది నన్ను చూసి ఎగతాళిగా మాట్లాడారు. కానీ నేను వెనుకంజ వేయలేదు. మా భూమిలో ఉన్న కంప చెట్లనూ, మొక్కలనూ తొలగించాను. వ్యవసాయ యోగ్యంగా మార్చాను. తొలి పంట మొలకలెత్తగానే నాలో కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. క్రమంగా పంటలను పెంచుతూ వెళ్ళాను. రెండు ఎకరాల్లో చిరు ధాన్యాలు, వేరుశెనగ, కూరగాయలు, ఆకుకూర పంటలు వేశాను. దీనికి 27వేల రూపాయల పెట్టుబడి పెట్టాను. రూ.1.4 లక్షల ఆదాయం వచ్చింది. .మూడేళ్ళలో తొమ్మిది రకాల పంటలను విజయవంతంగా సాగు చెయ్యగలిగాను.  


ఒకరికి ఒకరం సాయపడతాం...

పంటల సాగులో నేను ఎలాంటి రసాయనిక ఎరువులూ, మందులూ ఉపయోగించలేదు. ఆవు పేడ, గోమూత్రం, మట్టి, బెల్లం, పప్పుల పిండితో తయారు చేసిన ఘన జీవామృతాన్నీ, ద్రవరూపంలోని జీవామృతాన్నీ మాత్రమే వాడాను. ప్రకృతి వ్యవసాయం ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఇలా పండిన పంటల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. పౌష్టికాహార వినియోగం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే దీనికి మంచి డిమాండ్‌. పంట దిగుబడి ఎంత ఉన్నప్పటికీ కొనుగోలుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. మార్కెటింగ్‌ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతిలో పంటలు ఎవరు పండిస్తున్నారో తెలుసుకొని ముందుగానే అడ్వాన్సులు ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూముల్లో సారాన్ని కాపాడుకోవచ్చు. మా పొలంలో పండిస్తున్న ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరల వల్ల మా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంది. ఇప్పుడు నా మీద ఆర్థిక భారం తగ్గింది. అప్పులన్నీ తీర్చేశా. ప్రస్తుతం టొమాటో పంటను సాగు చెయ్యడానికి పొలాన్ని సిద్ధం చేస్తున్నాను. 

సరైన మార్గదర్శకత్వం రైతులకు లభిస్తే సానుకూల ఫలితాలు లభిస్తాయి. నా నేతృత్వంలో నడుస్తున్న స్వయంసహాయక బృందంలోని మహిళల నుంచి నాకు ఎంతో ప్రేరణ లభిస్తోంది. మేం ఒకరికి ఒకరం సాయం చేసుకుంటాం. పొదుపు చేసుకుంటాం. రుణాలు తీసుకుంటాం. విత్తనాలను పంచుకుంటాం. ఒకరి పొలంలో మరొకరం పని చేస్తాం. కష్టకాలంలో ఒకరిని ఒకరు ఆదుకుంటూ ఉంటాం. ప్రస్తుతం మా గ్రామాన్ని రసాయన రహిత వ్యవసాయ గ్రామంగా... అంటే బయో గ్రామంగా మార్చడానికి నేనూ, మా గ్రామస్తులూ పని చేస్తున్నాం. 


రైతులకు శిక్షణ ఇస్తున్నా....

సాక్షాత్తూ దేశ ప్రధానితో మాట్లాడే అవకాశం వస్తుందనీ, ఆయన ప్రశంసలు అందుకుంటాననీ కలలోనైనా ఊహించలేదు. సుమారు అయిదు నిమిషాలు ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంలో నా అనుభవాలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు. ‘‘వన్నూరమ్మ మేడమ్‌! మీరు దేశ రైతులకు ఆదర్శం కావడం అభినందనీయం’’ అని మోదీ ప్రశంసించారు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాలో వ్యవసాయాన్ని సుసాధ్యం చేసిన ఆదర్శ రైతు’ అంటూ అందరూ అంటూ ఉంటే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. పట్టుదలతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చు. పేద దళిత కుటుంబంలో పుట్టిన నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అవే నాకు పాఠాలుగా మారాయి. ఇప్పుడు ఐసిఆర్‌పి (ఇంటర్నల్‌ కమ్యూనిటీ రిసోర్స్‌పర్సన్‌)గా పని చేస్తున్నాను. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి వంకతండాలో దాదాపు 170 మంది మహిళా, ఆదివాసీ రైతులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇస్తున్నాను. దీనికి గౌరవవేతనం కూడా లభిస్తోంది. మా అబ్బాయిల్లో ఒకడైన అనిల్‌ వ్యవసాయం చేస్తున్నాడు. ఏది ఏమైనా ప్రకృతి వ్యవసాయం ప్రయోజనాలపై అన్ని గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నదే నా ఆశయం.’’

- శంకర్‌నాయక్‌, కళ్యాణదుర్గం
బంజరు నేలలో మొలకెత్తిన బంగారం!

సహజ వ్యవసాయం వల్లే సాధ్యం!

‘‘శీతల దేశాల్లో తప్పితే మిగిలిన ప్రాంతాలన్నింటిలోను గాలిలో తేమ ఉంటుంది. దీనిని ఆధారంగా చేసుకొని వ్యవసాయం చేయగలిగితే బంజరు భూములలో కూడా మంచి దిగుబడి తేవచ్చు. సహజ వ్యవసాయం పద్ధతిలో మేము ఈ తరహా ప్రయోగాలను 2018 నుంచి అనంతపూర్‌ ప్రాంతంలో చేస్తున్నాం. సాధారణంగా ఈ ప్రాంతంలో బంజరు భూములు ఎక్కువ. నీటి వసతి తక్కువ. అందువల్ల లభ్యమయ్యే అతి తక్కువ నీరు, గాలిలో తేమల ఆధారంగా వ్యవసాయ పద్ధతులను రూపొందించాం. వన్నూరమ్మ కూడా ఈ పద్ధతిలో సేద్యం చేశారు. ఈ పద్ధతిలో ఏడాది పొడుగునా రకరకాల కూరగాయలు పండించటం జరుగుతుంది. దీని వల్ల రైతులకు సంవత్సరం పొడుగునా ఆదాయం ఉంటుంది. రెండోది సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు కావటంతో పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. పంటలు మార్చి మార్చి వేయటం వల్ల నేలకు పోషకాలు అందుతాయి. ఈ రెండింటితో పాటుగా- ఈ పంటలు పండించే ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి ప్రపంచంలోని అనేక మంది శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం లక్షకు పైగా రైతులు ఈ తరహా వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు. 


- టి. విజయ్‌ కుమార్‌, 

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌, రైతు సాధికార సంస్థ


బంజరు నేలలో మొలకెత్తిన బంగారం!

తెలుగు రైతులు ఆదరిస్తున్నారు!

సహజ వ్యవసాయ పద్ధతులను మిగిలిన వారితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల రైతులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు రెండు లక్షల ఎకరాలలో ప్రకృతి కృషి పద్దతిలో సాగు జరుగుతోందంటే- దీనికి లభిస్తున్న ఆదరణను మనం గమనించవచ్చు. రైతు సాధికార సమితి కేవలం ఆంధ్రాలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా నోడల్‌ ఏజన్సీగా వ్యవహరిస్తోంది. ఇక మహిళా రైతులకు వ్యవసాయంతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా తెలుసు. కనుక తమ కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని ఎలా అనుకుంటారో.. సమాజానికి కూడా అలాంటి ఆహారాన్ని అందించాలనే తపన వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఎరువుల వల్ల కలిగే కష్టనష్టాలు వారికి బాగా తెలుసు కాబట్టి- సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తోంది. 2015 నుంచి సహజ వ్యవసాయ పద్దతులపై కేంద్రం అమలు చేసిన పధకాలన్నీ విజయం సాధించాయి. ఈ ఏడాది సాగు పద్ధతులపైనే కాకుండా.. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పైన దృష్టి పెడుతున్నాం. సేంద్రీయ రైతు ఉత్పత్తి సంస్థ (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌-ఎఫ్‌సీఓ)లను ఏర్పాటు చేస్తున్నాం. వీటివల్ల రైతులు తమ ఉత్పత్తులను లాభసాటి ధరలకు విక్రయించుకోగలుగుతారు. ఎఫ్‌సీఓల వల్ల దేశంలో సేంద్రీయ వ్యవసాయానికి కొత్త ఊపు వస్తుందని ఆశిస్తున్నాం.’

- అడిదం నీరజ శాస్త్రి, 

జాయింట్‌ సెక్రటరీ, కేంద్ర వ్యవసాయ శాఖFollow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.