Inspired By Movie : సినిమా ప్రేరణగా ఏడుగురు వ్యక్తులు చేసిన పనిది.. వీళ్లలో ఇద్దరు మహిళలు కూడా..

ABN , First Publish Date - 2022-08-16T02:48:07+05:30 IST

దాదాపు ఏడేళ్ల క్రితం విడుదలైన బాలీవుడ్(Bollywood) మూవీ ‘స్పెషల్ 26’ (special 26) ప్రేరణగా ఏడుగురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. నిందితులు ముంబై పోలీస్ అధికారులమని చెప్పి దోపిడీకి పాల్పడ్డారు.

Inspired By Movie : సినిమా ప్రేరణగా ఏడుగురు వ్యక్తులు చేసిన పనిది.. వీళ్లలో ఇద్దరు మహిళలు కూడా..

న్యూఢిల్లీ : దాదాపు ఏడేళ్ల క్రితం విడుదలైన బాలీవుడ్(Bollywood) మూవీ ‘స్పెషల్ 26’ (special 26) ప్రేరణగా ఏడుగురు వ్యక్తులు దోపిడీ(Robbed)కి పాల్పడిన ఘటన ఢిల్లీలో  వెలుగుచూసింది. నిందితుల ముఠా ముంబై పోలీస్ అధికారులమని చెప్పి దోపిడీకి పాల్పడ్డారు. గత బుధవారం జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విజయ్ యాదవ్ అనే వ్యక్తి నిర్వహిస్తోన్న వెల్‌నెస్ సంస్థ కార్యాలయంలోకి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నిందితులు ప్రవేశించారు. ముంబై పోలీస్ అధికారులమని నమ్మబలికారు. ముంబై పోలీసుల మాదిరిగానే గుర్తింపు కార్డులు తగిలించుకొని రావడంతో అంతా నమ్మారు. కానీ ఉన్నపళంగా తమ వద్ద ఉన్న తుపాకులను గురిపెట్టడంతో అంతా ఉలిక్కపడ్డారు.  ఉద్యోగులందరి ఫోన్లను సీజ్ చేసి రూ.20 లక్షలు కాావాలని డిమాండ్ చేశారు.


ఆఫీస్‌లో డబ్బు లేకపోవడంతో సంస్థ యజమాని విజయ్ యాదవ్‌ తలపై తుపాకీ గురిపెట్టిన నిందితులు  ఆయన భార్యకు ఫోన్ చేశారు. రూ.20 లక్షలు నగదు సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. రూ.5.75 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో తీసుకొచ్చి అప్పగించాలని హెచ్చరించారు. సంస్థ వెలుపల వేచివున్న నిందిత ముఠా సభ్యురాలికి డబ్బు ఇచ్చింది. ఆ తర్వాత విజయ్ యాదవ్‌కు సంబంధించిన బ్యాంక్, కార్డుల వివరాలు కూడా అడిగి తెలుసుకున్నాక నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఉద్యోగులందరినీ లోపలే ఉంచి తాళం వేసి ఉడాయించారని ఈశాన్య ఢిల్లీ డీసీపీ ఉషా రంగరాణి వెల్లడించారు.


కాగా సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల్లో ఒకరైన ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తిని గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద రూ.2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారని, దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెప్పారు. నిందితుల ముఠాలో ఇద్దరు మహిళలు సహా మొత్తం ఏడుగురు సభ్యులున్నారని వివరించారు. నిందిత మహిళలు జ్యోతి, నేహా కశ్యప్ ఇద్దరూ ఢిల్లీ వాసులేనని తేలిందని, మిగతావారు జాహిద్(గురూజీ), సంజయ్ మనోచా, ఫైసల్, ఇమ్రాన్‌గా పేర్లు వెల్లడించారు. వీళ్లంతా మధ్యప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందినవారు. కాగా మరో నిందితుడు మజిద్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. ‘స్పెషల్ 26’ సినిమా చూసి ఈ దొంగతనం ప్రణాళిక రచించినట్టు విచారణలో నిందితులు అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. కాగా అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పెషల్ 26 సినిమాలో మోసగాళ్ల ముఠా సీబీఐ అధికారుల వేషంలో నకిలీ సోదాలు, దోపిడీలకు పాల్పడుతుంది.

Updated Date - 2022-08-16T02:48:07+05:30 IST