తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత

ABN , First Publish Date - 2021-07-22T06:55:54+05:30 IST

‘రైతుదే తెలంగాణము రైతుదే..’, ‘ముసలి నక్కకు రాచరికంబుదక్కునే’ అని గర్జించాడు. నిజాం పాలనలో రకరకాల హింసలను అనుభవిస్తున్న పీడిత ప్రజలను చూసి చలించిపోయి గొంతుగా మారి నినదించాడు. నిజాంను సూటిగా గద్దిస్తూ తనదైన శైలిలో రచనలు చేసిన మహనీయుడు దాశరథి కృష్ణమాచార్యులు. 1925లో జూలై 22న జన్మించిన దాశరథి నిజామాబాద్‌ ఖిల్లా జైలులో

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత
జిల్లాకేంద్రంలో దాశరథి జైలు జీవితం గడిపింది ఇక్కడే..

- నిజాంకు ఎదురొడ్డిన వీరుడు

- తన రచనల ద్వారా తెలంగాణలో కాక పుట్టించిన దాశరథి

- రైతులకు అండగా నిలిచిన కృష్ణమాచార్యులు

- నేడు 79వ జయంతి వేడుకలు

- నాయకుల హామీలకే పరిమితమైన దాశరథి స్మృతి వనం

- మసకబారిపోతున్న ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ గోడలు

- నిజాం పాలనలో స్థానిక ఖిల్లాలో జైలు జీవితం గడిపిన మహనీయుడు

నిజామాబాద్‌ కల్చరల్‌, జూలైౖ 21: ‘రైతుదే తెలంగాణము రైతుదే..’, ‘ముసలి నక్కకు రాచరికంబుదక్కునే’ అని గర్జించాడు. నిజాం పాలనలో రకరకాల హింసలను అనుభవిస్తున్న పీడిత ప్రజలను చూసి చలించిపోయి గొంతుగా మారి నినదించాడు. నిజాంను సూటిగా గద్దిస్తూ తనదైన శైలిలో రచనలు చేసిన మహనీయుడు దాశరథి కృష్ణమాచార్యులు. 1925లో జూలై 22న జన్మించిన దాశరథి నిజామాబాద్‌ ఖిల్లా జైలులో జైలు జీవితాన్ని గడిపారు. అదేవేళ ప్రజలను తన రచనల ద్వారా ఉత్తేజిత పరిచారు. నిజాం నిరంకుశ పాలన గురించి ‘నిజాం పిశాచమా కానరాడు నిన్నుబోలిన రాజు.. మాకెన్నడే మి, తీగలను తెంచి అగ్గిలో దింపినావు. నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని జైలు గోడలపై రాసి ఉద్యమ స్ఫూర్తిని ఆనాడు చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్ని దశల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా నినాదంగా మారింది. ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్‌పెక్టర్‌గా, ఆకాశవాణి ప్రయోక్త ఉద్యోగిగా, పలు ఉద్యోగాలు చేసినా సంతృప్తినివ్వక పోవడంతో తెలంగాణ ఉద్యమం బాటపట్టారు. కమ్యూనిస్టు భావజాలం నుంచి వచ్చినప్పటికీ.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ వైఖరిని మార్చుకుని హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకున్నారు. అలాగే, సాహిత్యం లో దాశరథి కథలు, నాటికలు, సినీ పాటలు, కవితల ప్రక్రియలో ఎంతో కృషి చేశారు. దాశరథి కృష్ణమాచారి తెలంగాణ ఉద్యమానికి చేసిన కృషికి గాను ఆయన పుట్టిన రోజు ను సాహితీ సంస్థలు, స్వచ్చంధ సంస్థలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. 

ప్రతిధ్వనించిన ఖిల్లా జైలు గోడలు

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ జైలు నాలుగు గోడలకే ప్రతిధ్వనించిన నినాదం ప్రజల్లోకి వెళ్లే సరికి ప్రతీఒక్కరి గొంతుకగా మారింది. నాటి నిజాం పాలకులకు కంటినిండా కునుకు లేకుండా చేసిన ఈ నినాదం ప్రస్తుతం నాలుగు గోడలకే పరిమితమైంది. ఖిల్లా జైలులో పుట్టిన ఈ నినాదం నేడు ఎలాంటి అభివృద్ధి కి నోచుకోకుండా దీనావస్థకు చేరింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జైలుని దాశరథి స్మృతివనంగా మార్చాలని కోరినప్పటికీ.. కార్యరూపం దాల్చలేదు. ప్రతీ సంవత్సరం ఆయన జయంతిన ప్రజాప్రతినిధులు, సాహితీవేత్తలు దాశరథి స్మృతివనాన్ని తెరపైకి తెస్తూ.. మరచిపోవడం యథాలాపంగా మారింది.

ఆలనాపాలనా కరువై అధ్వానంగా..

ఖిల్లా జైలు సారంగపూర్‌కి తరలివెళ్లడంతో జైలు యొక్క ఆలనా పాలన చూసేవారు లేక దయనీయంగా మారింది. ఒకనాడు ఉద్యమస్ఫూర్తిని నింపిన నినాదాల ప్రాంతం నేడు శిఽథిలావస్థకు చేరుకోవడం పట్ల సాహితీవేత్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి దాశరథి స్మృతివనాన్ని ప్రత్యేక శ్రద్ధతో అభి వృద్ధి చేయాలని, ఖిల్లా చౌరస్తా వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాశరథి చౌరస్తాగా నామకరణం చేయాలని సాహితీవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతీ జయంతి మాదిరిగా కాకుండా ఈసారి ఆయన ఆశయ దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు.

నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి

దాశరథి కృష్ణమాచార్య 79వ జయంతి ఉత్సవాన్ని జిల్లాకేంద్రంలోని గాంధీ విచార్‌ మంచ్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహిస్తున్నట్లు బాధ్యులు వెంకటస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని గీతాభవన్‌లో ఉదయం 11 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. కవులు, కళాకారులు, సాహితీ అభిమానులు హాజరుకావాలని కోరారు.

Updated Date - 2021-07-22T06:55:54+05:30 IST