ఇన్‌స్టాలో బగ్.. లోపం గుర్తించిన యువకుడికి భారీ బహుమతి!

ABN , First Publish Date - 2021-06-16T23:46:42+05:30 IST

సోలాపూర్‌కు చెందిన ఓ 21 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సరిగ్గా ఇలాంటి లోపాన్ని గుర్తించాడు. ఆ తరువాత బహుమతి కింద ఏకంగా రూ. 22 లక్షలను పొందాడు.

ఇన్‌స్టాలో బగ్..  లోపం గుర్తించిన యువకుడికి భారీ బహుమతి!

సోలాపూర్: తమ వినియోగదారుల సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు సోషల్ మీడియా సంస్థలు పటిష్ట భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేశాయి. అయితే..ఆ వ్యవస్థల నిర్మాణంలో అప్పుడప్పుడూ తలెత్తే చిన్న చిన్న లోపాలను(బగ్) ఆధారంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి బ్లాక్‌మెయిలింగ్ దిగుతుంటారు. వీటిని నిరోధించేందుకు  ‘సోషల్’ సంస్థలు ఈ బగ్‌లను పట్టించే వారి కోసం బగ్ బౌంటీల పేరిట పోటీలు నిర్వహిస్తుంటాయి. తమ ఉద్యోగుల దృష్టి నుంచి తప్పించుకున్న బగ్‌లను వెతిక పట్టుకున్నందుకు పెద్ద ఎత్తున నజరానాలు ప్రకటిస్తుంటాయి. కాగా.. సోలాపూర్‌కు చెందిన ఓ 21 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సరిగ్గా ఇలాంటి లోపాన్ని గుర్తించాడు. ఆ తరువాత బహుమతి కింద ఏకంగా రూ. 22 లక్షలను పొందాడు. 


మూయూర్ ఫర్తడే ఈ ఏడాది మార్చిలో ఇన్‌స్టాలో ఓ ప్రమాదకరమైన బగ్ ఉన్నట్టు గుర్తించాడు. ఈ లోపం కారణంగా ప్రైవేటు ఇన్‌స్టా అకౌంట్లలోని ఫొటోలు, పోస్టులు, రీల్స్ తదితర వివరాలు సైబర్ నేరగాళ్లు దొంగిలించే అవకాశం ఉందని గుర్తించాడు. మీడియా ఐడీ ద్వారా వారు మొత్తం వివరాలను తస్కరించవచ్చని కనిపెట్టాడు. లోపాన్ని గనుక సరిద్దికపోతే అది కేటుగాళ్లకు వరంగా మారొచ్చంటూ ఏప్రిల్ 16న అతడు ఫేస్‌బుక్‌కు సమాచారం అందించాడు. మయూర్ ఇచ్చిన వివరాల ఆధారంగా భద్రత వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించిన ఫేస్‌బుక్ లోపం ఉన్నమాట నిజమేనని నిర్ధారించింది. ఈ బగ్‌ను తమ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ మూయూర్‌కు ఏప్రిల్ 19న బదులిచ్చింది. అంతేకాకుండా.. ఈ బగ్‌ను కనుగొన్నందుకు బహుమతిగా జూన్ 15న అతడికి రూ. 22 లక్షలను అందజేసింది. కాగా.. దీనిపై స్పందించిన మయూర్ భవిష్యత్తులోనూ ఇటువంటి లోపాల వెలికితీసే ప్రయత్నాలను కొనసాగిస్తానని పేర్కొన్నాడు. ఈ బగ్‌ బౌంటీ తనకు ఓ వ్యాపకమని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలన్నదే తన లక్ష్యమని మయూర్ తెలిపాడు. 

Updated Date - 2021-06-16T23:46:42+05:30 IST