వైసీపీలో సీనియర్లకు పరాభవం

ABN , First Publish Date - 2022-07-01T05:34:08+05:30 IST

వైసీపీలో సీనియర్‌ నాయకులు అవమానాలకు గురవుతున్నారా? ప్రాధాన్యం దక్కకుండా చేస్తున్నారా? పొమ్మనలేక వారికి పొగపెడుతున్నారా? అంటే అధికారపార్టీ శ్రేణుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల సీఎం జగన్‌ జిల్లా పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణికి అవమానం ఎదురైంది. ఈ ఘటన మరువక ముందే పలాస ప్లీనరీలో ఏకంగా మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబుకు అవమానం జరిగింది.

వైసీపీలో సీనియర్లకు పరాభవం
పలాస : ప్లీనరీ నుంచి అనుచరులతో బయటకు వెళ్లిపోతున్న చైర్మన్‌ బళ్ల గిరిబాబు

మొన్న కృపారాణి, నేడు బళ్ల గిరిబాబు
పొమ్మనలేక పొగ పెడుతున్న వైనం
అధికార పార్టీ శ్రేణుల్లో కలకలం
(టెక్కలి/పలాస)

వైసీపీలో సీనియర్‌ నాయకులు అవమానాలకు గురవుతున్నారా? ప్రాధాన్యం దక్కకుండా చేస్తున్నారా? పొమ్మనలేక వారికి పొగపెడుతున్నారా? అంటే అధికారపార్టీ శ్రేణుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల సీఎం జగన్‌ జిల్లా పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణికి అవమానం ఎదురైంది. సీఎంకు స్వాగతం పలికేందుకు హెలీప్యాడ్‌ వద్దకు వెళుతున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఆహ్వాన జాబితాలో మీ పేరు లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను కేంద్ర మాజీ మంత్రినని.. మొన్నటివరకూ వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశానని తనకు తాను చెప్పుకున్నా పోలీస్‌ అధికారులు వినలేదు. లోపలికి విడిచిపెట్టలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అక్కడే ఉన్న వైసీపీ సీనియర్‌ నాయకులు సముదాయించే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఒక మహిళా నాయకురాలిని ఇలా అవమానిస్తారా? అంటూ ఆమె ప్రశ్నించారు. వైసీపీ చోటా నాయకులకు విడిచిపెట్టి.. ఆమెను మాత్రం అడ్డుకోవడం అధికార పార్టీలోనే చర్చకు తెరలేపింది. కీలక నేత ఆదేశాలతోనే ఈ ఘటన జరిగినట్టు కృపారాణి అనుచరులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన మరువక ముందే పలాస ప్లీనరీలో ఏకంగా మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబుకు అవమానం జరిగింది. మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్లీనరీకి వైసీపీ జిల్లా కన్వీనర్‌ ఽధర్మాన కృష్ణదాస్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మునిసిపాల్టీలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్‌కు స్థానం కల్పించలేదు. సభకు అధ్యక్షత వహించే అవకాశమివ్వలేదు. అంతా ఇతర మండలాలకు చెందిన నేతలకే మంత్రి బాధ్యతలు అప్పగించారు. వేదికపై వెళ్లిన చైర్మన్‌ గిరిబాబుకు కిందకు దించేయడం.. ఆయన మాట్లాడుతుండగా మైక్‌ కట్‌ చేయడం వంటి వాటితో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మంత్రి సమక్షంలోనే తతంగం జరుగుతున్నా ఆయన పట్టించుకోకపోవడంతో అవమానంగా భావించిన గిరిబాబు మీ ప్లీనరీకో దండమంటూ అనుచరులతో అక్కడ నుంచి వెనుదిరిగారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో అధికార పార్టీలో చర్చనీయాంశమైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ తరహా ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలను టార్గెట్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ వర్గంలో అంతర్మథనం ప్రారంభమైంది. గత ఎన్నికల్లో అండగా నిలిచినందుకు తమకు తగిన శాస్తి జరిగిందంటూ సామాజికవర్గానికి చెందిన నాయకులు, ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు.


Updated Date - 2022-07-01T05:34:08+05:30 IST