అడుగడుగునా అవమానిస్తున్నారు

ABN , First Publish Date - 2022-08-17T06:31:00+05:30 IST

అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే తనను అవమానిస్తున్నా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని కోదాడ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష ఆరోపించారు.

అడుగడుగునా అవమానిస్తున్నారు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ శిరీష

కోదాడ టౌన్‌, ఆగస్టు 16: అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే తనను అవమానిస్తున్నా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని కోదాడ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష ఆరోపించారు. సోమవారం కోదాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా ప్రజాప్రతినిధిగా, పట్టణ ప్రథమ పౌరురాలిగా కోదాడలోని గాంధీ పార్కులో నిర్వహించిన  స్వాతంత్య్ర వజ్రోత్సవానికి హజరుకాగా, జాతీయ నాయకుల చిత్రపటాల ఎదుట కొబ్బరికాయలు కొట్టే విషయంలో ఎంపీపీ కవితారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బుర్ర సుధారాణిపుల్లారెడ్డి  తనను అడ్డుకుని అవమానించారన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ కళ్లెదుటే ఇదంతా జరిగినా ఆయన పట్టిం చుకోలేదన్నారు. కోదాడ మునిసిపాలిటీ జనరల్‌ స్థానమైనా తమ కుటుంబం వ్యవసాయం, విద్యలో ముందంజలో ఉందని, బీసీనైన తనకు టీఆర్‌ఎస్‌ పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎమ్మెల్యే సహకారంతో తనను విధులు నిర్వహించకుండా ఎంపీపీతో పాటు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తనను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రేక్షత పాత్రకే పరిమితం చేస్తున్నా రని, మునిసిపాలిటీ పాలకవర్గంలో చీలికలు తెచ్చి తనకు అభాసుపాలు చేసేందుకు యత్నిస్తున్నారని ఆమె కంటతడి పెట్టారు. పార్టీ నుంచి నిర్వహించే ఫ్లెక్సీల్లో తన ఫొటో వేయకుండా కించపరుస్తున్నారన్నారు. సున్నిత మనస్కురాలైన తనకు తోడుగా వస్తున్న భర్త లక్ష్మీనారాయణను అడ్డుకుంటున్నారని, భర్తగా తనకు తోడుగా రావడం నేరమా? అని ఆమె ప్రశ్నించారు. తన మానసిక క్షోభను సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డి అర్థం చేసుకొని తనను విధులను సక్రమంగా నిర్వహించేలా చూడాలని వేడుకున్నారు. సమావేశంలో కౌన్సిలర్లు తిపిరిశెట్టి సుశీలరాజు, మదార్‌, స్వామినాయక్‌, గుండపునేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఘటనతో కోదాడ టీఆర్‌ఎస్‌ నేతల్లో అంతర్గత విభేదాలు స్థానికంగా చర్చనీయాంశం అయ్యాయి.




Updated Date - 2022-08-17T06:31:00+05:30 IST