హెల్త్ వర్కర్లకు బీమా పథకం పొడిగింపు

ABN , First Publish Date - 2021-10-21T02:23:00+05:30 IST

కోవిడ్-19 మహమ్మారిపై పోరాడుతూ, రోగులకు సేవలందిస్తున్న

హెల్త్ వర్కర్లకు బీమా పథకం పొడిగింపు

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారిపై పోరాడుతూ, రోగులకు సేవలందిస్తున్న హెల్త్‌కేర్ వర్కర్లకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ (పీఎంజీకేపీ) క్రింద బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ పథకం గడువు 2021 అక్టోబరు 20తో ముగిసింది. దీనిని అక్టోబరు 21 నుంచి మరో 180 రోజుల వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మహమ్మారి తీవ్రత ఇప్పటికీ తగ్గకపోవడం, దేశంలో కోవిడ్ సంబంధిత విధులు నిర్వహిస్తున్న హెల్త్‌కేర్ వర్కర్లు మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ రోగులకు సేవలందించే హెల్త్‌‌కేర్ వర్కర్లపై ఆధారపడినవారికి భద్రత, రక్షణ కల్పించేందుకు ఈ పథకాన్ని పొడిగించింది. ఈ పథకం క్రింద ఇప్పటి వరకు 1,351 క్లెయిములకు సొమ్ము చెల్లించింది. 


పీఎంజీకేపీ బీమా పథకం హెల్త్‌కేర్ వర్కర్ల కోసం 2020 మార్చి 30న ప్రారంభమైంది. దీని క్రింద రూ.50 లక్షలు వరకు సమగ్ర వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ ఉంది. కోవిడ్-19 రోగులకు సేవలందిస్తూ, ప్రమాదకర పరిస్థితుల్లో పని చేసే హెల్త్‌కేర్ వర్కర్లు దీనివల్ల ప్రయోజనం పొందవచ్చు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, ప్రైవేట్ హెల్త్ వర్కర్లు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారు. 


బీమా పథకం గడువు పెంపు గురించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఓ లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలియజేసింది. ఈ సమాచారాన్ని హెల్త్ వర్కర్లకు తెలియజేయాలని తెలిపింది. 


Updated Date - 2021-10-21T02:23:00+05:30 IST