రంగంలోకి ఇంటలిజెన్స్‌

ABN , First Publish Date - 2021-09-15T05:58:53+05:30 IST

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఈ నెల 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్మల్‌కు వస్తున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమవుతోంది.

రంగంలోకి ఇంటలిజెన్స్‌

అమిత్‌ షా జిల్లా పర్యటనకు పకడ్బందీ భద్రత 

దారి పొడవునా సీసీ కెమెరాలతో నిఘా 

పోలీసుల గుప్పిట్లో సభాస్థలి 

నిర్మల్‌, సెప్టెంబరు 14 (ఆంఽధ్రజ్యోతి) : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఈ నెల 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్మల్‌కు వస్తున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఈ మేరకు అమిత్‌ షా పర్యటనకు భారీ భద్రత కల్పించేందు కోసం పోలీసు యంత్రాంగమంతా కసరత్తు మొదలుపెట్టింది. కేంద్ర హోం శాఖ మంత్రి స్థాయిలో అమిత్‌ షా పర్యటించబోతున్నందున ఆయన పర్యటనకు ఎక్కడ కూడా చిన్న పాటి ఆటంకం ఏర్పడకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి భద్రత ఏర్పాట్లకు సంబంధించి నివేదికలు కోరినట్లు సమాచారం. జిల్లా ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలో ఇప్పటికే పోలీసులు అమిత్‌ షా పర్యటనపై ప్రాథమిక స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎస్పీ డైరెక్షన్‌లో అమిత్‌ షా పర్యటనకు సంబందించిన భద్రతాచర్యలపై సంబంధిత యంత్రాంగమంతా సిద్ధమవుతోంది. కాగా వీఐపీ స్థాయిలో అమిత్‌షా పర్యటించబోతున్నందున రాష్ట్రస్థాయి ఇంటలిజెన్స్‌ వర్గాలు సైతం ఇప్పటికే నిర్మల్‌కు చేరుకొని పరిస్థితులను సమీక్షించినట్లు తెలిసింది. అత్యంత భద్రత అవసరమైన నేతల్లో అమిత్‌షా ఒకరైనందున ఇంటలిజెన్స్‌ వర్గాలతో పాటు రహస్య పోలీసు విభాగాలన్ని అప్రమత్తమవుతున్నాయి. అమిత్‌ షా పర్యటనకు సంబందించిన రూట్‌మ్యాప్‌ను పార్టీ వర్గాలు సిద్ధం చేయగా ఆ రూట్‌మ్యాప్‌ను పోలీసులు అధికారికంగా దృవీకరించాల్సి ఉంటుంది. హోం మంత్రిస్థాయిలో అమిత్‌షా పర్యటిస్తున్న కారణంగా ఆ స్థాయిలోనే ఆయనకు రక్షణ కల్పించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా అమిత్‌షా నిర్మల్‌కు చేరుకొని ఇక్కడి నుంచి వెయ్యి ఉరులమర్రి వద్ద గల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు. ఆ తరువాత ఇక్కడ జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు. ఈ రెండు ప్రదేశాలతో పాటు అమిత్‌షా కారులో ప్రయాణించే రూట్‌పై కూడా పోలీసుఅధికారులు సమీక్షిస్తున్నారు. దారి పొడగునా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలన్న అంశంపై రాష్ట్రస్థాయి అధికారులతో చర్చిస్తున్నారు. వీఐపీలకు భద్రత కల్పించే విభాగానికి సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు అధికారులతో టచ్‌లో ఉండి చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ అట్టహా సంగా నిర్వహించే వ్యవహారంలో భాగంగా అమిత్‌షా పర్యటనకు ఆ పార్టీ నేతలు కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఇటు పోలీసు యంత్రాంగం అటు బీజేపీ నేతలు అమిత్‌ షా పర్యటననే లక్ష్యంగా చేసుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. దీంతో పాటు అమిత్‌ షా నివాళులు అర్పించే వెయ్యిఉరులమర్రి స్మారకస్థూపాన్ని అలాగే సభాస్థలిని పోలీసులు పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకోనున్నారు. అమిత్‌షా పాల్గొనబోయే బహిరంగసభ వేదికకు సంబందించి పోలీసులు అన్ని అనుకూలతలను పరిశీలించిన తరువాతనే అనుమతులు ఇవ్వాల్సి ఉం టుంది. ఇప్పటికే పోలీసులు దిలావర్‌పూర్‌ మండలం సిర్గాపూర్‌లో అమి త్‌షా సభను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. అయితే నిర్మల్‌ పట్టణానికి ఈ ప్రాంతం దూరంగా ఉన్న కారణంగా వెయ్యిఉరుల మర్రి స్మారకస్థూపానికి సమీపంలో గల ఖాళీ ప్రదేశాన్ని బహిరంగసభ వేదికగా ఏర్పాటు చేసేందుకు బీజేపీ నిర్ణయించింది. ఇటు సభాస్థలిని అటు అమిత్‌షా పర్యటించే ప్రదేశాన్నంతటినీ పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకొని డేగకళ్లతో పహారా కాయనున్నారు. బుధవారం నుంచి పోలీసు యంత్రాంగమంతా అమిత్‌షా పర్యటనకు సంబంధించిన భద్రత చర్యలపైనే సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించబోతోంది. 

రంగంలోకి నిఘా వర్గాలు

ఇదిలా ఉండగా కేంద్ర హోం శాఖ మంత్రి స్థాయిలో అమిత్‌ షా నిర్మల్‌లో పర్యటించబోతున్న కారణంగా పోలీసు యంత్రాంగం ఆ స్థాయిలోనే భద్రత చర్యలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని కోసం గాను రాష్ట్ర డీజీపీస్థాయిలో భద్రతచర్యలకు సంబందించి దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఇంటలిజెన్స్‌ వర్గాలు అమిత్‌ షా పర్యటనపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి పరిధిలోని ఇంటలిజెన్స్‌ అధికారులు నిర్మల్‌కు చేరుకొని ఇక్కడి పరిస్థితులను ఆరాతీస్తున్నట్లు తె లుస్తోంది. దీంతో పాటు సభా స్థలి, అమిత్‌షా పర్యటించే రోడ్డు మార్గం అలాగే వెయ్యిఉరులమర్రి ప్రదేశంపై ఇంటలిజెన్స్‌ వర్గాలు దృష్టి కేంద్రీకరించినట్లు చెబుతున్నారు. ఇంటలిజెన్స్‌ వర్గాలతో పాటు పోలీసుశాఖ పరిధిలోని ఇతర రహస్య విభాగాలు కూడా అమిత్‌షా పర్యటనను లక్ష్యంగా చేసుకుంటూ నిఘాను విస్తృతం చేస్తున్నాయంటున్నారు. 

గ్రామాల్లో విస్తృత ప్రచారం

ఇదిలా ఉండగా అమిత్‌ షా పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ యంత్రాంగమంతా పల్లెభాట పట్టింది. అమిత్‌ షా పర్యటనకు సంబందించి గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌ పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో కాషాయ జెండాలను రెపరెపలాడిస్తున్నారు. ముఖ్యంగా నిర్మల్‌ పట్టణాన్ని కాషాయమయం చేసేందుకు బీజేపీ నడుం భిగిస్తోంది. జిల్లాస్థాయి నేతలే కాకుండా రాష్ట్ర స్థాయినేతలంతా నిర్మల్‌లోనే మకాం వేసి పల్లెల్లో పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు భారీ జన సమీకరణపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అయితే బీజేపీ శ్రేణుల జనసమీకరణకు సంబందించి కూడా ఇంటలిజెన్స్‌ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అమిత్‌ షా పర్యటనను ఇటు పోలీసు వర్గాలు రక్షణాత్మక చర్యలతో కట్టుదిట్ట చేసేందుకు సిద్దమవుతుండగా బీజేపీ వర్గాలు ఈ పర్యటనను విజయవంతం చేసి తమ సత్తాను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

Updated Date - 2021-09-15T05:58:53+05:30 IST