కాలంతో పరుగు తీసిన మేధస్సు

ABN , First Publish Date - 2021-06-14T07:02:37+05:30 IST

కేకేఆర్‌గా సుప్రసిద్ధులైన కోయిల్‌ కందాడై రంగనాథా చార్యులు గారిది ఉన్నత జీవన ప్రమాణాలతో కొనసాగిన ఉదాత్త వ్యక్తిత్వం. వ్యష్టి కేంద్రకం కంటే సమిష్టి కేంద్రకానికి...

కాలంతో పరుగు తీసిన మేధస్సు

కేకేఆర్‌గా సుప్రసిద్ధులైన కోయిల్‌ కందాడై రంగనాథా చార్యులు గారిది ఉన్నత జీవన ప్రమాణాలతో కొనసాగిన ఉదాత్త వ్యక్తిత్వం. వ్యష్టి కేంద్రకం కంటే సమిష్టి కేంద్రకానికి, ప్రచారానికంటే భావనల ప్రసారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఆలోచనాశీలి.


హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షుడిగా, డీన్‌గా పలు బాధ్యతలను నిర్వహించి 2002లో పదవీ విరమణ చేసేనాటికే అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహించి పలు గ్రంథాలను వెలువరించారు కేకేఆర్‌. బొగ్గుల కుంటలోని సారస్వత పరిషత్తుకు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కాలంలో (1967-1987) కేకేఆర్‌గారు వ్యక్తిగతంగా తమ అధ్యయనాన్ని పెంచుకోవడానికి, పరిషత్తులో చదువుకునే విద్యార్థుల సాహిత్యాభిలాషను ద్విగుణీకృతం చేయడానికి, విలువైన పుస్తకాలను ప్రకటించడానికి సారస్వత పరిషత్తు గొప్ప వేదిక అయింది. అది సాయం కళాశాల కావడంతో రోజంతా చదువుకోడానికి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి పర్యవేక్షణలో భాషా శాస్త్రంలో పరిశోధన చేయడానికి ఆనాటి సమయం ఎంతో ఉపయోగపడిందని అనేక మార్లు చెప్పేవారు.


తన సంప్రదాయ కుటుంబంలోని నియమాలను ఛేదించి ప్రజాతంత్ర భావాలతో జీవించే వాతావరణం కోసం పరితపిస్తున్న వేళ దిగంబర కవుల-ముఖ్యంగా జ్వాలా ముఖి, నిఖిలేశ్వర్‌, నగ్నమునుల-సాన్నిహిత్యం కొత్త ద్వారాలకు అవకాశం కల్పించింది. తదనంతర కాలంలో వచ్చిన సామా జిక ఉద్యమాలు మార్క్సిస్టు ఆలోచన వైపు వెళ్లడానికి, విరసంతో అనుబంధం పెంచు కోవడానికి కారణమయ్యాయి. కానీ వారిలో ఉన్న సాహిత్య జిజ్ఞాస కార్యవాది కంటే కావ్యవాదిగా మార డానికి ఉపకరించింది. పరి షత్తులో ప్రధాన ఆచార్యు డిగా బాధ్యతలు నిర్వహి స్తూనే సంస్కృతం తెలుగు భాషాశాస్త్రాల్లో ఎమ్‌.ఏలు పూర్తి చేసి 1978లో Historical Grammar of Inscriptional Telugu అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యా లయం నుండి డాక్టరేట్‌ సాధించారు.  


‘తెలుగు సాహిత్యం మరో చూపు’, ‘నూరేళ్ల తెలుగునాడు’, ‘తెలుగులో తొలి సమాజ కవులు’, ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు’, ‘తెలుగు జనసాహితి’ లాంటి గ్రంథాలు సాహితీ పరిశో ధకులకు కరదీపికలుగా వెలుగొందాయి. పరిశో ధకులను సాహితీవేత్తలను విభిన్న మార్గంలో ఆలోచించేట్లు ప్రోత్సహించడంలో కేకేఆర్‌గారి దార్శనికత నిరుపమానం. ఈ గ్రంథాలకు పీఠికలను కూర్చే సమయం లోనే భారతదేశ చరిత్ర అధ్యయనంలో అపారమైన ప్రభా వాన్ని వేసిన డి.డి.కోశాంబి, రొమిల్లా థాపర్‌, ఆర్‌.ఎస్‌.శర్మ, ఇర్ఫాన్‌ హబీబ్‌ లాంటి వాళ్ల రచనల స్ఫూర్తితో సాహిత్య అధ్యయనానికి చారిత్రక నేపథ్యాన్ని అందించే కొత్త కోణాలను ఆవిష్కరించారు. ఆ క్రమంలో మార్క్సిస్టు విమర్శకులు అయిన క్రిస్టఫర్‌ కాడ్వెల్‌ జార్జి థామ్సన్‌, రేమాండ్‌ విలియమ్స్‌, టెర్రీ ఈగల్టన్‌ల రచనల స్ఫూర్తితో మార్క్సిస్టు అవగాహనను సాహిత్య అధ్యయనానికి ఉపయోగించుకునే ఉపకర ణాలను పరిచయం చేశారు. దిగంబర సాహిత్యమంతా నిరుపయోగమైన దని, వారి రచనలను కవిత్వం అనుకునేంత అల్పస్థాయికి స మాజం చేరలేదని వ్యాఖ్యానించే కాలంలో దిగంబర కవుల చారి త్రక నేపథ్యాన్ని, పాశ్చాత్య బీట్‌ కవుల రచనలను, ఆనాటి బెంగాల్‌ కవుల రచనలను సమన్వయం చేస్తూ దిగంబర కవుల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగించడంలో విమర్శకుడిగా కేకేఆర్‌ రాసిన వ్యాసాలు ఎంతగానో దోహదం చేశాయి.


అధ్యాపకుడిగా కేకేఆర్‌ గారిది గొప్ప ఆకర్షణ. నిండైన విగ్రహం. ముఖమంతా గొప్ప తేజస్సు. భాషా శాస్త్రం బోధించినా, ఆధునిక కవిత్వం విశదపరిచినా, సంస్కృత సాహిత్య మాధుర్యం పంచినా వారి ఆలోచనల్లో విద్యార్థులు మమేకం కావాల్సిందే. విద్యార్థుల్లో ఆలోచనలు పురికొలపడంలోగానీ, కొత్త భావనలకు పయనింప చేయడంలోగానీ వారి బోధన ఎంతో సజీవంగా ఉండేది. అందుకే వారి దగ్గర పాఠాలు చదువుకున్న విద్యార్థులు ఎవరూ వారిని మర్చిపోరు. తన తండ్రి అలంకార శాస్త్రం, వ్యాకరణ అంశాలను బోధించేటప్పుడుగాని, భద్రిరాజుగారు భాషాశాస్త్రం బోధించేటప్పుడుగానీ అటువంటి చైతన్యవంతమైన బోధన ఉండేదని కేకేఆర్‌ చెప్పేవారు. మేఘసందేశం బోధించేటప్పుడు కాళిదాసు ఊహాశాలిత, తన బోధనా సామర్థ్యం విద్యార్థులకు పరమాన్నం వడ్డించినంత ఆహ్లాదభరితంగా ఉండేది. వారికి గురజాడ అత్యంత ఇష్టమైన రచయిత. ఆనాటి సాహితీ ప్రియులందరికీ సహజంగానే శ్రీశ్రీ పట్ల అపారమైన అభి మానం ఉండేది. శ్రీశ్రీ రచనలు బోధించేటప్పుడు వారి తన్మయ త్వానికి అవధులు ఉండేవి కావు. అలాగని కేవలం వారి రచనలను వల్లె వేసే దుష్ట సంప్రదాయం కాదు. రచయి తను అర్థం చేయించడం వారి భావాల సామంజస్యాన్ని గుర్తింప జేయడం, అటువంటి అధ్యయన సంప్రదాయంలో పయనించడానికి కావలసిన వాతావరణాన్ని పరికల్పించడంలో సిద్ధహస్తులు కేకేఆర్‌.


హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలోవారు ప్రొఫెసర్‌గా చేరిన తర్వాత పరిశోధక అంశాలను సూచించడంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. తెలుగు సాహిత్యంలో మార్క్సిస్టు ధోరణులు అనే అంశంపైన, తెలుగులో భక్తి కవిత్వం సామా జిక విశ్లేషణ అనే అంశంపైన వారి మార్గదర్శకత్వం ఈ వ్యాసకర్త సాహిత్య జీవితాన్ని ఎంతగానో ఉద్దీపితం చేసింది. సామాజిక జీవితంలో వస్తున్న కొత్త ఉద్యమాలు ఆనాటి మేధావులకు కొంత ఛాలెంజింగ్‌గా ఉన్న రోజుల్లో దళిత ఉద్యమాన్ని, స్త్రీవాద సాహిత్యాన్ని, ముస్లిం వాదాన్ని, పోస్ట్‌మోడర్నిస్ట్‌ ఆలో చనలను ఆనాడే సునిశిత దృష్టితో పరిశీలిస్తూ వ్యాసాల్ని రాస్తూ, విద్యార్థుల చేత పరిశోధనలూ చేయించారు కేకేఆర్‌. 


OUPవారు ప్రచురించిన Literary Cultures in History అనే సుప్రసిద్ధ గ్రంథ రూపకల్పనలో కేకేఆర్‌ ప్రమేయం ఉంది. ఆ పుస్తక పీఠికలో కేకేఆర్‌ నిర్వహించిన కార్యశాలను గూర్చి ప్రత్యేకంగా ప్రశంసించారు. Modernity and Modernism in Telugu Literature అనే అంశంపై సాధికారమైన గ్రంథాన్ని రచించాలని ప్రణాళికలు వేసుకున్నారు. తాము నివసించే తార్నాక నుండి హైదరాబాద్‌ విశ్వవిద్యాలయానికి జరిపే ప్రయాణంలోనే ఎంతో సమయం వృథా కావడం, విశ్వవిద్యాల యాల్లో ఉండే అనుకూల ప్రతికూల వాతావరణాలు వారి రచనా వ్యాసంగానికి కొంత ఆటంకం కలిగించి ఉంటాయి.


కొంతకాలం పాఠశాల స్థాయి వాచకాలకు సంపాదకులుగా వ్యవహరించారు కేకేఆర్‌. ఆ పుస్తకాలలోని విషయాలను రూపొందించడంలోనూ విద్యార్థులకు భాష పట్ల ప్రత్యేక అవ గాహన ఏర్పడ్డానికి కావలసిన అభ్యాసాలను తయారు చేయడంలోనూ భాషా సాహిత్యాలపట్ల ఉత్తమ అభిరుచిని కల్పించడంలోనూ వారి అవగాహన ప్రశంసావహమైనది విద్యార్థుల్లో ఉండే సహజ సంకోచాలను భయాలను పోగొట్టే విధంగా వారిని ప్రేమపూర్వకంగా పలకరించేవారు. పరిశోధ కులకు కావలసిన స్వేచ్ఛను ఇచ్చేవారు. అయితే దానికి కొంత హద్దులు కూడా గీసేవారు. సంస్కృతంలో ఒక సుప్రసిద్ధ మైన ఆ భాణకం ఉంది. దాని భావం: సముద్రంలోకి వెళ్లాలని కోరిక. వెళ్తే ఏమవుతుందో అని భయం. విద్యార్థులకు వారి హృదయద్వారాలను స్పృశించాలని కోరిక. వెళ్తే ఏమౌతుందో అని మీ మాంస. విద్యార్థుల స్థాయిని బట్టి వారితో గడిపే సమయాన్ని బట్టి ఎన్నో విషయాలను పంచుకునేవారు. విద్యార్థులతో గాఢమైన అనుబంధాన్ని కలిగి ఉండేవారు. కేకేఆర్‌  పంచివెళ్ళిన ఆలోచనలు వారి విద్యార్థుల్లో కొత్త ఆవిష్కరణకు దోహదకారులై చైతన్యాన్ని అందిస్తాయి. ఉన్నత మార్గంలో పయనించడానికి ప్రేరణ కలిగిస్తాయి.

(నేడు కేకేఆర్‌ 81వ జయంతి)

పిల్లలమర్రి రాములు


Updated Date - 2021-06-14T07:02:37+05:30 IST