ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-08T05:22:50+05:30 IST

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ గురువారం ప్రారంభ మైంది

ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

  1. పాత విధానంలోనే దరఖాస్తులు
  2. 17 వరకు దరఖాస్తులకు గడువు 
  3. 18 నుంచి తరగతులు 


కర్నూలు(ఎడ్యుకేషన్‌), జనవరి 7: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ గురువారం ప్రారంభ మైంది. హైకోర్టు తీర్పునకు లోబడి 2020-2021 విద్యాసంవత్స రానికి ఆఫ్‌లైన్‌ (పాత విధానం)లోనే ప్రవేశాలను చేపట్టేందుకు వీలుగా ఇంటర్‌ బోర్డు షెడ్యూలు విడుదల చేసింది. విద్యార్థులు దరఖాస్తులను జనవరి 17వ తేదీలోపు కళాశాలలో సమర్పించాలి. సంక్రాంతి సెలవుల అనంతరం 18వ తేదీ నుంచే ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ కళాశాలలు 265 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 45, ఎయిడెడ్‌ 10, ఆదర్శ పాఠశాలలు 35, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ 14, ఏపీఆర్‌జేసీ 2, ట్రైబల్‌ వెల్ఫేర్‌ 3, బీసీ వెల్ఫేర్‌ 2, కేజీబీవీ 23, ప్రైవేటు జనరల్‌ కోర్సు కళాశాలలు 118, వృత్తి విద్యాకళాశాలలు 13 ఉన్నాయి. ఇప్పటికే ప్రైవేటు రెసిడెన్షియల్‌ ఆదర్శ పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తి కావచ్చాయి. ఇప్పుడంతా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. దరఖాస్తు ఫీజు జనరల్‌ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన వారు ఇప్పుడు ఫీజు చెల్లించనవసరం లేదు. ఆ రశీదు చూపిస్తే చాలు.


పాఠాలు పూర్తవుతాయా?

గతంలో డిసెంబరు చివరి నాటికి సిలబస్‌ పూర్తి చేసేవారు. జనవరి నుంచి రివిజన్‌ చేసేవారు. ఈసారి కరోనా వల్ల కళాశాలలు తెరుచుకోలేదు. ఇప్పుడు అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తోంది. దీనివల్ల ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గిపోవచ్చని భావిస్తున్నారు. ఈ నెలలో తరగతులు ప్రారంభమైతే.. సిలబస్‌ పూర్తి చేసి ప్రాక్టికల్స్‌, పరీక్షలు, థియరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-01-08T05:22:50+05:30 IST