ఇంటర్‌లో ఇంత తక్కువా?

ABN , First Publish Date - 2022-06-24T06:03:57+05:30 IST

విద్యా వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోందో ప్రస్తుత పరీక్షల ఫలితాల సరళిని చూస్తే అర్థం అవుతుంది.

ఇంటర్‌లో ఇంత తక్కువా?

ఫలితాలు నిరాశాజనకం

ప్రభుత్వ కళాశాలల్లో బాగా తగ్గిన ఉత్తీర్ణత

పర్యవేక్షణ లోపమే కారణం

అడ్మిషన్లపై పడనున్న ప్రభావం

విద్యావేత్తలు, నిపుణుల హెచ్చరిక


జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు ఏడాదికేడాదికి తిరోగమనం చెందుతున్నాయి. బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాలే దీనికి నిదర్శనం. ఒకటి రెండు కళాశాలలు కొంత మెరుగైన ఉత్తీర్ణత సాధించగా అత్యధిక శాతం కళాశాలలు వెనుకంజలో ఉండి పోయాయి. దీని ప్రభావం అడ్మిషన్లపై పడుతుందని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యమే దీనంతటికీ కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


నెల్లూరు (విద్య), జూన్‌ 23 : విద్యా వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోందో ప్రస్తుత పరీక్షల ఫలితాల సరళిని చూస్తే అర్థం అవుతుంది. పిల్లలో నైపుణ్యాలు ఉన్నాయో.. లేవో చూడకుండా ఎన్ని మార్కులు వచ్చాయి.. గ్రేడింగ్‌ పాయింట్లు ఎంత అన్నదానిపైనే ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రుల ఆలోచన, ఉపాధ్యాయులకు ఇస్తున్న టార్గెట్ల కారణంగానే ఉత్తీర్ణత శాతంలో మార్పు లు చోటుచేసుకుంటున్నాయని విద్యావేత్తలు అంటున్నారు. పదో తరగతిలో సాధించిన ఫలితాలు ఇంటర్‌కు వచ్చేసరికి మారిపోతున్నాయి. ఇంటర్‌లో వచ్చిన ఫలితాలతో పోలిస్తే ఇంజనీరింగ్‌, ఇతర కోర్సులకు వెళ్లేసరికి పూర్తిగా వ్యత్యాసం ఉంటోంది. దీనికి కారణం అధికంగా మాస్‌ కాపీయింగ్‌ అనేదే బలంగా వినిపిస్తోంది. విద్యార్థులు కూడా చదవకపోయినా పాస్‌ అవుతాములే అనే ఆలోచనలో ఉన్నారు. ఉన్నత చదువులకు వెళ్లే సరికి నైపుణ్యాలు లేక వెనుదిరగాల్సి వస్తోంది. నూటికి 80శాతం ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో నైపుణ్యాలు లేవని ఇటీవల ఏఐసీటీఈ సర్వే తేల్చి చెప్పింది. తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రాకపోతే రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. 

జిల్లాలో 139 ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలు, 27 ప్రభుత్వ, 5 ఎయిడెడ్‌, 10 మోడల్‌, 12 సోషల్‌ వెల్ఫేర్‌, 1 ఏపీ రెసిడెన్షియల్‌, 2 ట్రైబుల్‌ వెల్ఫేర్‌ కళాశాలలు, బీసీ వెల్ఫేర్‌ 2, కేజీబీవీలు 6 కలిపి మొత్తం 204 ఉన్నాయి. వీటిలో జనరల్‌ విభాగంలో 14 కోర్సులు అమలవుతున్నాయి. అందులో ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సులను తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమంలో నిర్వహిస్తున్నారు. 14 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, రెండు ఎయిడెడ్‌ కళాశాలలు, నాలుగు ప్రైవేటు కళాశాలల్లో ఒకేషనల్‌ (వృత్తి విద్య) కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం పదో తరగతిలో వేల సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తున్నా ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. పలు మండలాల్లో జూనియర్‌ కళాశాలలు అందుబాటులో లేకపోవడం, ఉన్న ప్రాంతాల్లో సరైన వసతులు లేకపోవడం, భవనాలు శిథిలావస్థకు చేరడం తదితర కారణాలతో ఆర్థికంగా ఇబ్బంది అయినా సరే ప్రైవేటు వైపే తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు.  


ఫలితాలు పేలవం

తాజాగా విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 25,374 మంది విద్యార్థులు హాజరుకాగా 14,791 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 25,576 మందికిగాను 17,190 మంది పాసయ్యారు. 

ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి జనరల్‌ విభాగంలో మున్సిపల్‌ కళాశాలలు మినహా మిగిలిన వాటిలో 2,693 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే కేవలం 609 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 22.61శాతం మంది మాత్రమే పాసయ్యారన్నమాట. 

ఇదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో 3,033 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1,200 మంది, అనగా 39.56శాతం ఉత్తీర్ణత సాధించారు. 

మున్సిపల్‌ కాలేజీల విషయానికి వస్తే ఫస్టియర్‌లో 107 మంది విద్యార్థులకు 52 మంది (48.60శాతం), సెకండియర్‌లో 124 మందికి 81 మంది (65.32 శాతం) విజయం సాధించారు. 

ఎయిడెడ్‌ కళాశాలల్లో 834 మంది విద్యార్థులకు 262 మంది (31.41శాతం) ఉత్తీర్ణులయ్యారు. 

 

పర్యవేక్షణ లేకపోవడం వల్లనే...

ప్రభుత్వ కళాశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఫలితాలు తగ్గాయని విద్యావేత్తలు, నిపుణులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకపోవ డం, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లలో బాధ్యత లేకపోవడంతో ఇలాంటి ఫలితాలు వచ్చాయని ఆరోపిస్తున్నారు. లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్న అధ్యాపకు లు బాధ్యతగా విధులు నిర్వహించినా, విద్యార్థులకు నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందించినా ఇలాంటి పరిస్థితిలు ఉండేవి కావని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితు లు మారాలని, లేని పక్షంలో ప్రభుత్వ కళాశాలలు మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.  

Updated Date - 2022-06-24T06:03:57+05:30 IST