Ponniyin Selvan: ‘పొన్నియన్ సెల్వన్’కు, బెజవాడ కనకదుర్గమ్మకు సంబంధం ఏం లేదు.. కానీ..

ABN , First Publish Date - 2022-10-04T00:51:42+05:30 IST

మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించిన ‘పొన్నియన్ సెల్వన్-1’ (PS-1) సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా హిట్టా.. ఫట్టా.. యావరేజా.. ఇలాంటి టాక్ గురించి..

Ponniyin Selvan: ‘పొన్నియన్ సెల్వన్’కు, బెజవాడ కనకదుర్గమ్మకు సంబంధం ఏం లేదు.. కానీ..

మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించిన ‘పొన్నియన్ సెల్వన్-1’ (PS-1) సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా హిట్టా.. ఫట్టా.. యావరేజా.. ఇలాంటి టాక్ గురించి పక్కనపెడితే ఈ సినిమాకు ఆధారం ‘పొన్నియన్ సెల్వన్’ (Ponniyin Selvan) అనే పేరుతో రచించిన తమిళ నవల. కల్కి కృష్ణమూర్తి రచించిన 2,210 పేజీల ఈ తమిళ నవలలో ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చోళ యువరాజు అయిన అరుల్‌మొళివర్మన్ (Arulmoli Varman) జీవితంలోని ప్రథమార్ధం గురించి ఈ నవలలో ఎక్కువగా రచయిత ప్రస్తావించారు. ఈ నవలలో ఒక ఆసక్తికర కథ గురించి రచయిత రాశారు. ఆ కథకూ, శరన్నవరాత్రుల్లో భాగంగా నేడు కనకదుర్గగా దర్శనమిస్తున్న దుర్గాదేవికి ఆ పేరు రావడానికీ సంబంధం ఏమీ లేదు గానీ సారూప్యత ఉందనడంలో సందేహం లేదు. ముందుగా.. ‘పొన్నియన్ సెల్వన్’లో రచయిత ప్రస్తావించిన ఆ కథేంటో తెలుసుకుందాం.


‘చోళ’ సామ్రాజ్యం పేరు వినగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు రాజరాజ చోళుడు. ఆ రాజరాజ చోళుడు మరెవరో కాదు అరుల్‌మొళివర్మన్. చోళ రాజుల ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన రాజు రాజరాజ చోళుడు-I అయి ఉండొచ్చు గానీ.. చోళుల ధర్మ నిరతి గురించి తెలియాలంటే మాత్రం మనునీతి చోళన్ గురించి తెలుసుకుని తీరాల్సిందే. ‘పొన్నియన్ సెల్వన్’లో ప్రస్తావించిన కరికాల చోళన్, కొప్పెరున్ చోళన్ మాదిరిగానే చోళ సామ్రాజ్యపు తొలి రోజుల్లో పాలన సాగించిన రాజు మనునీతి చోళన్. ఈయన అసలు పేరు ఎల్లాలన్. తమిళనాడులోని తిరువరూర్ ప్రాంతాన్ని పాలించిన ఎల్లాలన్ న్యాయం, ధర్మం విషయంలో ఎంతో విశ్వసనీయత కలిగి ఉండేవాడు. తప్పు చేస్తే ఎంతటి వారైనా సరే.. స్వపర భేదం చూపేవాడు కాదు. న్యాయ స్థానంలో ఒక ధర్మ గంట ఉండేది. న్యాయం కోరుతూ రాజును ఆశ్రయించే వాళ్లు ఎవరైనా ఆ ధర్మ గంటను మోగించేవాళ్లు. ఆ తర్వాత రాజు విచారణ జరిపి తప్పు చేసిన వారికి శిక్ష విధించేవాడు. ఒకరోజు ఆ ధర్మ గంట మోగింది. కానీ.. ఆ ధర్మ గంట మోగించిది మనిషి కాదు. ఉబికి వస్తున్న కన్నీళ్లతో ఉసూరుమంటున్న ఒక ఆవు. ఏం జరిగిందని ఎల్లాలన్ ఆరా తీశాడు.



ఎల్లాలన్ కన్న కొడుకు అయిన యువరాజు వీధివిటంకుడు(Veedhividangan) నడిపిన రథం కింద పడి ఒక లేగ దూడ చనిపోయింది. ధర్మ గంట మోగించిన ఆ ఆవు మరెవరో కాదు చనిపోయిన ఆ లేగ దూడ కన్న తల్లి. న్యాయం కోసం ఆ ఆవు ధర్మ గంటను మోగించి చోళ రాజు ఎల్లాలన్‌ను ఆశ్రయించింది. ‘ఇదీ సంగతి’ అని తెలుసుకున్న ఎల్లాలన్ కన్న కొడుకు అయినప్పటికీ పక్షపాతం చూపించలేదు. ఒక అమాయక మూగ జీవి ప్రాణం పోవడానికి కారణం తన కొడుకే అని తెలిసినా శిక్ష విధించే విషయంలో ఏమాత్రం ఉపేక్షించలేదు. కన్న కొడుకు చేసిన తప్పుకు ఈ చోళ రాజు యువరాజుకు మరణ దండన విధించాడు. ఈ తీర్పుతో ఎల్లాలన్ ధర్మ నిరతి గురించి రాజ్యంలోని ప్రజలు వేనోళ్లా కొనియాడారు. అప్పటి నుంచి ఎల్లాలన్‌ను ‘మనునీతి చోళన్’ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ కథను ‘పొన్నియన్ సెల్వన్’ నవలలో రచయిత ప్రస్తావించారు. అయితే.. ‘దుర్గాదేవి’ కనకదుర్గగా పేరుగాంచడానికి సంబంధించి ఇలాంటి కథే ఒకటి ప్రచారంలో ఉంది.



నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ‘దుర్గాదేవి’ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జయవాటిక (అంటే విజయవాడ) రాజధానిగా పాలించిన విష్ణుకుండిన వంశస్థుడైన 2వ మాధవవర్మ కూడా తన కుమారుడికి మరణశిక్ష విధిస్తాడు. తన కుమారుడి రథం క్రింద పడి, బ్రాహ్మణ బాలుడు చనిపోవటంతో మాధవవర్మ అలా తీర్పునిస్తాడు. మాధవవర్మ ధర్మదీక్షకు మెచ్చి విజయవాటికలో (విజయవాడ) దుర్గాదేవి కనకవర్షం కురిపించటంతో 'కనకదుర్గ'గా అమ్మవారు పేరుగాంచిందట. ‘పొన్నియన్ సెల్వన్’లో ప్రస్తావించిన కథకూ, ‘కనకదుర్గ’గా అమ్మవారు పేరుగాంచడం వెనుక ఉన్న కథకూ సారూప్యత ఉండటం విశేషం.

Updated Date - 2022-10-04T00:51:42+05:30 IST