ఎన్టీఆర్‌ కంటే ఐదు వేలు తక్కువ ఇవ్వమన్న అరుదైన నటి

Published: Wed, 05 Jan 2022 21:35:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎన్టీఆర్‌ కంటే ఐదు వేలు తక్కువ ఇవ్వమన్న అరుదైన నటి

కాఫీ, సినిమా, ఆత్మాభిమానం.. ఈ మూడు విషయాల్లో నేను  ఏ మాత్రం రాజీపడలేను.. అని స్పష్టంగా చెప్పిన అరుదైన నటి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి. ఆమె పాత్రపోషణ, గాత్రధారణ అసాధారణమైనవే. సినిమాలో భానుమతి ఉంటే మిగిలిన వారెవరూ కనిపించరన్నది అందరూ ఒప్పుకొనే విషయం. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌‌లతో కలసి నటించడమే కాకుండా వారితో తన బేనరులో సినిమాలు కూడా తీశారామె. ముఖ్యంగా ఎన్టీఆర్‌ అంటే ఆమెకు ప్రత్యేక అభిమానం. రామారావు కూడా ఆమెను ఎంతో గౌరవించేవారు. వీరిద్దరికీ సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే.. 

ఎన్టీఆర్‌ కంటే ఐదు వేలు తక్కువ ఇవ్వమన్న అరుదైన నటి

ఎన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో ‘తాతమ్మ కల’ పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు. అందులో తాతమ్మ పాత్రను భానుమతి వేస్తే బాగుంటుందని రామారావు అనుకున్నారు. అయితే ఇందులో ఆమెకు తను మనవడిగా నటించాలి. అటువంటి పాత్ర పోషించడానికి భానుమతి అంగీకరిస్తారో లేదో అని అనుమానం. తను డైరెక్ట్‌గా అడగడానికి మొహమాటపడి, రచయిత డి.వి. నరసరాజును భానుమతి దగ్గరకు పంపించారు ఎన్టీఆర్‌. కథ గురించి, తాతమ్మ పాత్ర గురించి భానుమతికి వివరించారు నరసరాజు. ఆమెకు ఆ పాత్ర నచ్చింది. చేస్తానని చెప్పేశారు. అదే సమయంలో భానుమతి ‘అమ్మాయి పెళ్లి’ అనే చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు. అందులో హీరోగా ఎన్టీఆర్‌ నటిస్తే, ‘తాతమ్మ కల’ చిత్రంలో తను నటిస్తానని కండీషన్‌ పెట్టారు భానుమతి. అంతే కాదు ఎన్టీఆర్‌ తాతయ్యగా నటిస్తే, తాతమ్మగా నటించాలని కూడా చెప్పారు. ఆ విషయం ఎన్టీఆర్‌కు చెప్పారు నరసరాజు. ‘ఓకే. ఆవిడ కోరిక సమంజసమే.  అలాగే చేద్దాం.. ఆ క్యారెక్టర్‌ క్రియేట్‌ చేద్దాం’ అన్నారు ఎన్టీఆర్‌. 


ఆయన తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసు కనుక ‘అమ్మాయి పెళ్లి’ చిత్రం కోసం అంతే మొత్తం ఇవ్వడానికి రెడీ అయ్యారు భానుమతి. మరి ‘తాతమ్మ కల’ సినిమా కోసం భానుమతికి పారితోషికం ఇవ్వాలి? ఇదే విషయం డీవీ నరసరాజు ఆమెను అడిగితే ‘రామారావుగారు ఓ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటారో మీకు తెలుసు కదా!  అందులో ఐదు వేలు తగ్గించి నాకు ఇవ్వండి’ అని భానుమతి చెప్పడంతో సమస్య పరిష్కారమైంది.   అలా ‘తాతమ్మ కల’, ‘అమ్మాయి పెళ్లి’ చిత్రాలు దాదాపు ఒకే సమయంలో మొదలై, 1974లో విడుదలయ్యాయి. ‘తాతమ్మ కల’ చిత్రంతోనే బాలకృష్ణ నటుడిగా పరిచయం అయ్యారు.

-వినాయకరావు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International