Elon Musk గురించి విస్తుపోయే నిజాలివి.. సొంత ఇల్లు లేదు.. రెండేళ్ల క్రితం 7 లగ్జరీ బంగ్లాలను అమ్మేసి మరీ..

ABN , First Publish Date - 2022-04-26T18:51:17+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ మంగళవారం ట్విటర్‌ సంస్థను కొనుగోలు చేశారు

Elon Musk గురించి విస్తుపోయే నిజాలివి.. సొంత ఇల్లు లేదు.. రెండేళ్ల క్రితం 7 లగ్జరీ బంగ్లాలను అమ్మేసి మరీ..

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ మంగళవారం ట్విటర్‌ సంస్థను కొనుగోలు చేశారు. ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున మొత్తం రూ.3.37 లక్షల కోట్లు చెల్లించి ట్విటర్‌ను దక్కించుకున్నారు. కంపెనీలో 100% వాటాను పొంది ట్విటర్‌ను తన ప్రైవేట్ కంపెనీగా మార్చుకున్నారు. మొదటి నుంచి విభిన్నమైన ఆలోచనలతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మస్క్ తాజా డీల్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. చిన్నప్పటి నుంచి మస్క్‌ విభిన్న ఆలోచనా సరళి కలిగి ఉండేవాడు. తనకున్న దూరదృష్టి వల్లే ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, అంతరిక్ష పరిశోధన కోసం `స్పేస్ ఎక్స్` ప్రారంభించాడు. 


ప్రస్తుతం ట్విటర్‌ను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన మస్క్‌కు సంబంధించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు వైరల్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.. 


* ఎలన్ మస్క్ తల్లి అమెరికన్, తండ్రి దక్షిణాఫ్రికాకి చెందిన వాడు. మస్క్ 28 జూన్ 1971న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా నగరంలో జన్మించాడు.


* 12 సంవత్సరాల వయస్సులో మస్క్ ఒక వీడియో గేమ్‌ రూపొందించి దానిని ఒక సంస్థకు రూ. 38 వేలకు విక్రయించాడు. ఆ గేమ్ పేరు `బ్లాస్టర్`.


* యుక్త వయసులోకి వచ్చాక మస్క్ తన సోదరుడు కింబ్లేతో కలిసి `జిప్-2` పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించాడు. తర్వాత దానిని కూడా రూ.170 కోట్లకు అమ్మేశాడు.


* 1999లో సుమారు రూ.77 కోట్ల పెట్టుబడితో `ఎక్స్ డాట్‌కామ్` అనే సంస్థని ప్రారంభించాడు. తర్వాత దానిని కూడా `కన్ఫినిటీ` అనే కంపెనీకి విక్రయించాడు. తర్వాత అది పేపాల్‌గా మారింది.


* రాబోయే కాలంలో మానవులు ఇతర గ్రహాలపై జీవించగలుగుతారు అని బలంగా నమ్మిన మస్క్ ఆ దిశగా పరిశోధనలు సాగించేందుకు 'స్పేస్-ఎక్స్' అని సంస్థను స్థాపించాడు. 


* 2004లో ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లాను స్థాపించాడు. `భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్‌లతో సహా అన్నీ విద్యుత్‌తోనే నడుస్తాయి. ఆ మార్పును తీసుకురావడంలో టెస్లా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంద'ని మస్క్ ఆత్మవిశ్వాసంతో ప్రకటించాడు. 


* భవిష్యత్తులో అణుయుద్ధం లేదా ఏదైనా గ్రహశకలం ఢీకొనడం వల్ల భూమి ఉనికికే ప్రమాదం ఏర్పడితే, అలాంటి పరిస్థితుల్లో అంగారక గ్రహమే మానవులకు అత్యంత అనుకూలమని మస్క్ భావిస్తున్నాడు. మస్క్ అంచనా ప్రకారం 2050 నాటికి అంగారక గ్రహంపై మానవుల నివాసాలు ఏర్పడతాయి. ఆ నివాసాలను `స్పేస్ ఎక్స్` సంస్థ నిర్మిస్తుందని మస్క్ ప్రకటించారు. 


* న్యూరాలింక్ టెక్నాలజీతో ఒక యంత్రాన్ని మస్క్ అభివృద్ధి చేయిస్తున్నాడు. ఇది మానవ మెదడును కంప్యూటర్‌కు కనెక్ట్ చేస్తుంది. దాంతో మనిషి ఆలోచనలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి నమ్మశక్యంగా లేకున్నా.. మస్క్ ట్రాక్ రికార్డ్ చూస్తే.. ఈ అద్భుతం మరీ అసాధ్యం కాదేమోననిపిస్తోంది.




తనకు ఉన్న 7 లగ్జరీ బంగ్లాలను అమ్మేస్తున్నట్టు 2020లో మస్క్ ప్రకటించి సంచలనం రేకెత్తించాడు. జీవితంలో వైభవాన్ని తగ్గించుకుంటున్నానని చెప్పి తన 7 విలాసవంతమైన భవనాలను విక్రయించాడు. మస్క్ ప్రస్తుతం  ఓ చిన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. బోక్సబుల్ అనే స్టార్టప్ కంపెనీ ఈ ఇంటిని నిర్మించింది. ఈ ఇంటిని మడిచి ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకెళ్లవచ్చు. 

Updated Date - 2022-04-26T18:51:17+05:30 IST