Parliament : లోక్‌సభలో రసవత్తర సన్నివేశం... స్మృతి ఇరానీ, సోనియా గాంధీ ఢీ అంటే ఢీ...

ABN , First Publish Date - 2022-07-28T23:11:53+05:30 IST

లోక్‌సభ (Lok Sabha)లో గురువారం బీజేపీ (BJP), కాంగ్రెస్

Parliament : లోక్‌సభలో రసవత్తర సన్నివేశం... స్మృతి ఇరానీ, సోనియా గాంధీ ఢీ అంటే ఢీ...

న్యూఢిల్లీ : లోక్‌సభ (Lok Sabha)లో గురువారం బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) వర్గాల మధ్య వాడివేడి వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi), కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ (Smriti Irani) ఒకరితో మరొకరు ఢీ అంటే ఢీ అన్నారు. చివరికి ఎన్‌సీపీ, టీఎంసీ ఎంపీలు సోనియా గాంధీని బయటకు తీసుకెళ్ళడంతో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. 


లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdary) ఓ నిరసన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘రాష్ట్రపత్ని’ (Rashtrapatni) అని సంబోధించారు. దీంతో బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఇతర బీజేపీ ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. స్మృతి ఇరానీ మాట్లాడుతూ, ‘‘సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ద్రౌపది ముర్మును అవమానించడాన్ని సోనియా గాంధీ అనుమతించారని ఆరోపించారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న మహిళను అవమానించడానికి సోనియా అనుమతి ఇచ్చారని ఆరోపించారు. అదే సమయంలో బీజేపీ ఎంపీలు ప్లకార్డులు ధరించి నిరసన తెలిపారు. దీంతో సభ వాయిదా పడింది. 


అనంతరం సోనియా గాంధీ బీజేపీ ఎంపీ రమా దేవి (Rama Devi) వద్దకు వెళ్ళారు. సోనియాతో పాటు ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. రమా దేవితో సోనియా గాంధీ మాట్లాడుతూ, ‘‘అధిర్ రంజన్ చౌదరి ఇప్పటికే క్షమాపణ చెప్పారు. నా తప్పు ఏం ఉంది?’’ అని ప్రశ్నించారు. ఈ సమయంలో అక్కడకు స్మృతి ఇరానీ వెళ్ళారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, స్మృతి ఇరానీ మాట్లాడుతూ, ‘‘మేడమ్, నేను మీకు సాయపడాలా? నేను మీ పేరు ప్రస్తావించాను’’ అన్నారు. దీనిపై సోనియా గాంధీ ‘‘నాతో మాట్లాడవద్దు’’ అని అన్నారు. 


ఓ కాంగ్రెస్ ఎంపీ మీడియాతో మాట్లాడుతూ, రమాదేవితో సోనియా గాంధీ చాలా మర్యాదగా మాట్లాడారని, స్మృతి ఇరానీ మాత్రం వేళ్లు చూపిస్తూ ఆమె వద్దకు వెళ్ళారని చెప్పారు. ‘‘మీకెంత ధైర్యం? ఇలా ప్రవర్తించొద్దు, ఇది మీ పార్టీ కార్యాలయం కాదు’’ అని స్మృతి అన్నారని ఆ ఎంపీ చెప్పారు. ‘‘నేను మీతో మాట్లాడటం లేదు’’ అని సోనియా చెప్పారన్నారు. సోనియా గాంధీని ఎగతాళి చేశారని, అడ్డుకున్నారని చెప్పారు. 


టీఎంసీ (TMC) ఎంపీలు మహువా మొయిత్రా (Mahua Moitra), అపరూప పొద్దార్ (Aparupa Poddar), ఎన్‌సీపీ ఎంపీ సుప్రియ సూలే (Supriya Sule)  బిగ్గరగా మాట్లాడుతున్న బీజేపీ సభ్యుల నుంచి సోనియా గాంధీని దూరంగా తీసుకెళ్ళారు. అదే సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ (Prahlad Joshi) పరిస్థితిని చక్కదిద్దారు. 


అనంతరం సోనియా గాంధీ మాట్లాడుతూ, తాను కేవలం రమాదేవితో మాత్రమే మాట్లాడేందుకు ప్రయత్నించానని, ఆమెను తనకు తెలుసు కాబట్టి ఆమెతో మాట్లాడాలని అనుకున్నానని చెప్పినట్లు సమాచారం. ‘‘నేను భయపడటం లేదు. నాకు రమా దేవిని తెలుసు కాబట్టి, అధిర్ క్షమాపణ చెప్పారని, నా మీద ఎందుకు దాడి చేస్తున్నారని అడగాలని ఆమె వద్దకు వెళ్ళాను’’ అని సోనియా చెప్పినట్లు తెలుస్తోంది. 


ఇదిలావుండగా, మహువా మొయిత్ర ఇచ్చిన ట్వీట్‌లో, 75 ఏళ్ళ వయసుగల సీనియర్ మహిళా నేతను నక్కల గుంపు మాదిరిగా చుట్టుముట్టి, అడ్డుకున్నపుడు తాను లోక్‌సభలో ఉన్నానని పేర్కొన్నారు. మరో సీనియర్ లేడీ ప్యానెల్ చైర్‌పర్సన్‌తో మాట్లాడటం కోసం వెళ్ళినపుడు ఇదంతా జరిగిందన్నారు. బీజేపీ అబద్ధాలు, తప్పుడు కథనాలను పత్రికల్లో చదవడం ఇబ్బందికరంగా ఉందన్నారు. 


నిర్మల సీతారామన్ స్పందన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ఈ సంఘటనపై స్పందిస్తూ, బీజేపీ సీనియర్ నేత రమా దేవి వద్దకు సోనియా గాంధీ వెళ్ళినపుడు ఏం జరుగుతోందో చూడటం కోసం కొందరు బీజేపీ ఎంపీలు అక్కడికి వెళ్ళారన్నారు. అక్కడ జరుగుతున్నది చూసి అవాక్కయ్యారన్నారు. ఓ బీజేపీ మెంబర్ అక్కడికి వెళ్ళినపుడు సోనియా గాంధీ స్పందిస్తూ, ‘‘మీరు నాతో మాట్లాడొద్దు’’ అని అన్నారన్నారు. తమ ఎంపీని అవమానించారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అత్యున్నత స్థాయి నేత  (Sonia Gandhi)  పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి బదులు, మరింత దూకుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. 


జైరామ్ రమేశ్ ఏమన్నారంటే...

మరోవైపు కొందరు కాంగ్రెస్ ఎంపీలు ఈ సంఘటనపై స్పందిస్తూ, స్మృతి ఇరానీపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ చీఫ్ సోనియా గాంధీపై స్మృతి దాడి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ఇచ్చిన ట్వీట్‌లో, స్మృతి ఇరానీ (Smriti Irani) లోక్‌సభలో సోనియా గాంధీ పట్ల అమర్యాదకరంగా, దురుసుతనంతో ప్రవర్తించారని ఆరోపించారు. స్పీకర్ ఈ సంఘటనను ఖండిస్తారా? అని ప్రశ్నించారు. నిబంధనలు కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమే ఉన్నాయా? అని నిలదీశారు. 


నాకేం తెలీదు : సుప్రియ సూలే

ఈ సంఘటన జరిగిన సమయంలో సోనియా గాంధీకి మద్దతుగా నిలిచిన ఎన్‌సీపీ ఎంపీ సుప్రియ సూలే (Supriya Sule) స్పందిస్తూ, తాను సోనియా, స్మృతి ఇరానీ ఘర్షణ సమయంలో ఆలస్యంగా అక్కడికి వెళ్ళానని విలేకర్లకు చెప్పారు. ఆ నేతలిద్దరి మధ్య ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. సోనియా తనను బెదిరించారని స్మృతి అన్నారా? అని అడిగారు. ‘‘నిజాయితీగా చెప్తున్నాను, నేను చాలా ఆలస్యంగా అక్కడికి వెళ్ళాను. ఈ సంఘటన జరిగినపుడు నేను అక్కడ లేను’’ అన్నారు. తాను అక్కడికి వెళ్ళినపుడు సోనియా గాంధీ ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు. అనేక మంది ఎంపీలు అక్కడ ఉన్నారని, గోల గోలగా ఉందని అన్నారు. భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని అన్నారు. రమాదేవితో మాట్లాడటానికి వెళ్ళానని సోనియా తనతో చెప్పారని సుప్రియ తెలిపారు. తాను రమా దేవితో మాట్లాడానని, ఆ తర్వాత రభస జరిగిందని చెప్పారని తెలిపారు. అసలేం జరిగిందో ఎవరికీ తెలియదన్నారు. 


ఈ రభసకు మూలం...

సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ నిర్వహించిన కార్యక్రమాల్లో అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పేర్కొన్నారు. ‘‘ఔను మేం రాష్ట్రపతి వద్దకు వెళ్తాం. భారత దేశ రాష్ట్రపతి. కాదు, కాదు, రాష్ట్రపత్ని, అందరికీ’’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతుండటంతో అధిర్ రంజన్ చౌదరి క్షమాపణ చెప్పారు. తాను హిందీ మాట్లాడే వ్యక్తిని కాదని, తాను బెంగాలీనని చెప్పారు. తాను నోరుజారి రాష్ట్రపత్ని అన్నానని చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా రాష్ట్రపత్ని అనలేదన్నారు. రాష్ట్రపతిని అవమానించాలని తాను పీడకలలో కూడా అనుకోనని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాధపడితే, తాను ఆమెను స్వయంగా కలిసి క్షమాపణ చెబుతానని తెలిపారు. కావాలనుకుంటే వాళ్ళు తనను ఉరి తీయవచ్చునన్నారు. తాను శిక్షను అనుభవించడానికి సిద్ధమేనని, కానీ సోనియా గాంధీని ఎందుకు ఈ వివాదంలోకి లాగుతున్నారని ప్రశ్నించారు. 




Updated Date - 2022-07-28T23:11:53+05:30 IST