విద్యార్థులూ.. గెట్ రెడీ..!

ABN , First Publish Date - 2021-10-24T14:14:52+05:30 IST

విద్యార్థులకు..

విద్యార్థులూ.. గెట్ రెడీ..!

ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదు

వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌

రేపట్నుంచే ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఒమర్‌ జలీల్‌


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న రెగ్యులర్‌ విద్యార్థులకు సోమవారం నుంచే ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభవుతాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ వెల్లడించారు. ఈ బ్యాచ్‌ విద్యార్థులు కరోనా కారణంగా టెన్త్‌ పరీక్షలు రాయకుండానే ప్రమోట్‌ అయ్యారని, వారి భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పరీక్షలు ఈనెల 25న ప్రారంభమై నవంబరు 3న ముగుస్తాయని తెలిపారు. విద్యార్థులు ఎక్కడి నుంచైనా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చుని, హాల్‌టికెట్లపై ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదని  స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,59,228 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. శనివారం ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.


కరోనా నిబంధనల ప్రకారమే పరీక్షలు జరుగుతాయని, పాజిటివ్‌ ఉన్న విద్యార్థులకు తర్వాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ‘‘కొవిడ్‌ నేపథ్యంలో 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రశ్నల్లో 50 శాతానికిపైగా చాయిస్‌ రూపంలో ఉంటాయి. 1,768 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశాం. పరీక్షల విధుల్లో 25 వేల మంది పాల్గొంటారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న అధ్యాపకులకు మాత్రమే ఇన్విజిలేషన్‌ డ్యూటీ వేశాం. 1,768 చీఫ్‌ సూపరింటెండెంట్లు, 1,768 డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, 70 మంది ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌లు విధులు నిర్వహిస్తారు. పరీక్షా హల్‌లో ఒక బెంచ్‌కు ఒక్కో విద్యార్థి మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశాం. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో 30వ తేదీ సెలవు వచ్చింది. దాంతో అక్టోబరు 31న ఆదివారమైనప్పటికీ పరీక్ష జరుగుతుంది’’ అని జలీల్‌ వివరించారు.

Updated Date - 2021-10-24T14:14:52+05:30 IST