మైలవరం వైసీపీలో ముసలం

ABN , First Publish Date - 2021-11-27T06:24:00+05:30 IST

మైలవరం వైసీపీలో ముసలం పుట్టింది.

మైలవరం వైసీపీలో ముసలం

ఏఎంసీ చైర్మన్‌ పదవికి పామర్తి రాజీనామా

పార్టీ మండల కన్వీనర్‌ పదవికీ గుడ్‌బై

అదే బాటలో పార్టీ మండల కార్యదర్శి రాంబాబు 

నానాటికీ శ్రుతిమించుతున్న ఇన్‌చార్జ్‌ల ఆగడాలు

పార్టీని వీడే యోచనలో మరి కొంత మంది 


మైలవరం వైసీపీలో ముసలం పుట్టింది. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ వైఖరిపై బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికేతరులను తీసుకొచ్చి నియోజకవర్గంలో ఇన్‌చార్జ్‌లుగా నియమించి, ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న స్థానిక నాయకులను డమ్మీలుగా చూస్తున్నారని గత కొంత కాలంగా ఎమ్మెల్యేపై స్థానిక వైసీపీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో ఓటమితో వీరిలో గూడుకట్టుకున్న అసంతృప్తి ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంది. ఇప్పుడు వీరంతా రాజీనామా బాట పట్టారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మైలవరం మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పదవికి, వైసీపీ మైలవరం మండల కన్వీనర్‌ పదవికి బీసీ నాయకుడు పామర్తి శ్రీనివాసరావు శుక్రవారం రాజీనామా చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఈయన వైసీపీలో కొనసాగుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మైలవరం మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ అయ్యారు. మైలవరం మండల కన్వీనర్‌గా కూడా ఉన్నారు. పేరుకు రెండు పదవులు ఉన్నా, పెత్తనం అంతా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ సొంత మనిషిదే. నందిగామ నియోజకవర్గం నుంచి ఇక్కడికి ఎమ్మెల్యే తన సొంత మనుషులను దిగుమతి చేశారు. అన్ని మండలాలకూ వారినే ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. బీసీ గౌడ కులానికి చెందిన పామర్తి పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ వర్గంగా భావించిన వసంత ఆయనను పక్కన పెడుతూ వచ్చారు. ఈ పరిణామాలతో కినుక వహించిన పామర్తిని కొండపల్లి మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వసంత బుజ్జగించారు. అయినా అసంతృప్తి జ్వాల చల్లారలేదు. ఆది నుంచి పార్టీ జెండా మోసిన తనలాంటి వారికి జరుగుతున్న అన్యాయం, అవమానాన్ని భరించలేక పామర్తి శుక్రవారం జోడు పదవులకు రాజీనామా చేశారు. ఈయనతో పాటే మైలవరం మండల కార్యదర్శి యరగోపుల రాంబాబు కూడా పార్టీ పదవికి రాజీనామా చేశారు. 


సొంత మనుషులదే దందా అంతా..

మైలవరం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు వసంత తన సొంత మనుషులను ఇన్‌చార్జ్‌లుగా నియమించు కున్నారు. వీరంతా నందిగామ నుంచి దిగుమతి అయినవారే. అందరూ ఎమ్మెల్యే బామ్మర్ది కనుసన్నల్లో పనిచేస్తుంటారు. ఈ ఇన్‌చార్జ్‌లు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ పథకాల కోసం వచ్చే మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 12 ఏళ్లుగా ఆయా మండలాల్లో పార్టీ జెండాలు మోసి, కార్యక్రమాలు నిర్వహించిన స్థానిక నాయకులను విస్మరించి, వేరే నియోజకవర్గం నుంచి నాయకులను దిగుమతి చేసుకోవడం ఏమిటని స్థానిక వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 


వసంతపై పెరిగిపోతున్న అసంతృప్తి

ఎమ్మెల్యేపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలు, సొంత మనుషుల వ్యవహార శైలి కారణంగా స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇటీవల గొల్లపూడికి చెందిన సీఎం ప్రోగ్రాం కన్వీనర్‌ తలశిల రఘురాంను ఎమ్మెల్సీగా ప్రకటించడం వసంతకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. మరోవైపు కొండపల్లి మున్సిపాలిటీలో ఓటమి కూడా వసంతకు తలనొప్పిగా పరిణమిస్తోంది. మైలవరం నియోజకవర్గ వైసీపీలో ముసలం పుట్టిందన్న వార్తలు సీఎం జగన్‌కు చేరాయి. కొండపల్లి ఓటమితో తీవ్ర అసహనంతో ఉన్న జగన్‌ తాజా పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మైలవరంలో వ్యవహారాలను జాగ్రత్తగా పరిశీలించాలని తలశిల రఘురాం, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌, పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌లను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. 


పామర్తి పంథాలోనే మరి కొందరు

వైసీపీ నాయకులు మరికొందరు కూడా పామర్తి బాటనే ఎంచుకున్నారు. పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి, కొండపల్లిని కోల్పోవడంతో ఆగ్రహజ్వాలగా మారింది. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌గిరీని ఎమ్మెల్యే జోగి రమేష్‌ తమ్ముడు జోగి రాముకు కట్టబెట్టడం ఎమ్మెల్యే వసంతకు ఇష్టం లేదని ప్రచారం సాగుతోంది. తన సొంత మనిషి అయిన రసూల్‌కు ఆ పదవి ఇచ్చేందుకు వసంత మొగ్గు చూపారని, ఈ ముఠా తగాదాల కారణంగానే కొండపల్లి మున్సిపాలిటీని తమ పార్టీ కోల్పోవాల్సి వచ్చిందని వైసీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2021-11-27T06:24:00+05:30 IST