గులాబీ బాస్ KCR ఇలాకాలో కొట్లాట.. వర్కవుట్ కాని హరీష్ రాయబారం.. ముగింపు ఎలాగో మరి..!

ABN , First Publish Date - 2021-12-12T23:00:56+05:30 IST

గులాబీ బాస్ KCR ఇలాకాలో కొట్లాట.. వర్కవుట్ కాని హరీష్ రాయబారం.. ముగింపు ఎలాగో మరి..!

గులాబీ బాస్ KCR ఇలాకాలో కొట్లాట.. వర్కవుట్ కాని హరీష్ రాయబారం.. ముగింపు ఎలాగో మరి..!

దళపతి ఇలాకాలో యూటీ, బీటీ కొట్లాట తీర్చేదెవరు? కనుసైగతో రాష్ట్రాన్ని, పార్టీని శాసించే కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌ ఇంటి పంచాయతీకి ఎలాంటి ముగింపు ఇస్తారు? ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌ రాయబారం కూడా వర్కవుట్‌ కాలేదా? ఇంతకీ గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌లో ట్రబుల్‌ ఎక్కడ మొదలైంది? ఎక్కడికి దారితీస్తుంది? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌లో పదవుల పంచాయితీ..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో పార్టీ పదవుల పంచాయతీ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. పదవుల పంపిణీలో చెలరేగిన రచ్చ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పాత కొత్త వర్గాల కొట్లాట ఎటువైపు దారితీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. గజ్వేల్‌ పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్ష ఎన్నిక లోకల్‌ టీఆర్‌ఎస్‌ను రెండు వర్గాలుగా విడదీసింది.


యూటీ, బీటీ గొడవపై కేసీఆర్‌కు రిపోర్ట్‌..

ఓ వైపు నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు వెల్లువెత్తడంతో పాటు మరో వైపు పదవి ఆశించి భంగపడ్డ ఉద్యమకారులకు సానుభూతి వ్యక్తమవుతోంది. ఉద్యమ తెలంగాణా-యూటి బ్యాచ్‌కు మొండి చేయి చూపుతూ, బంగారు తెలంగాణా-బీటీ బ్యాచ్‌కు అందలం ఎక్కించడంలో అసలు ఆంతర్యం ఏమిటా అంటూ గజ్వేల్ పార్టీ శ్రేణులు చెవులు కోరుక్కుంటున్నాయి. ఈ పదవీ పంచాయతీ మంత్రి హరీష్‌రావును దాటి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇంటిలిజెన్స్‌ రిపోర్టుల రూపంలో వెళ్లింది. పంచాయితీ తీర్చాలని కేసీఆర్‌ ఆర్థికమంత్రి హరీష్‌రావుకు ఆర్డర్‌ వేశారనే టాక్‌ వస్తోంది.


యూటీ బ్యాచ్‌ గరం గరం..

ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆగడాలు ఎక్కువైపోతున్నాయని, బంగారు తెలంగాణ బ్యాచ్‌ ఒంటెత్తు పోకడలతో ఉద్యమ తెలంగాణ బ్యాచ్‌ ఉనికిలేకుండా పోతుందని పంచాయితీ మొదలైంది. వంటేరు ప్రతాప్ రెడ్డి అనుచరుడు నవాజ్ మీరా, బొగ్గుల సురేష్‌లను పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తూ మంత్రి హరీష్‌రావు అందజేస్తున్న నియామక పత్రం ఫోటోలు పార్టీ సోషల్‌మీడియా గ్రూపుల్లో వైరల్‌ కావడంతో వార్‌ మరింత ముదిరింది.


హరీష్‌తో ఫొటోలు దిగిన పదవులు పొందిన నేతలు.. 

గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక పంచాయతీ కొన్ని నెలలుగా సాగుతోంది. ఇంతకుముందువరకు అధ్యక్షుడిగా వంటేరు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మామిళ్ళ నాగులు ముదిరాజ్ సేవలందించారు.  20 వార్డులున్న గజ్వేల్ మున్సిపాల్టీలో తీవ్ర గందరగోళం మధ్య ఇప్పటికీ 14 వార్డుల్లో మాత్రమే వార్డు అధ్యక్షులు, కమిటీల నియామకం జరిగింది. మరో ఆరు వార్డుల్లో ఇప్పటికీ కమిటీలే లేవు. ప్లీనరీకి ముందుకూడా ఈ పంచాయతీ తెగకపోవడంతో పక్కనపెట్టాల్సివచ్చింది. అయితే ఏమైందోఏమోకాని ప్రతాపరెడ్డి వర్గానికి పదవి ఇస్తూ హరీష్‌రావుతో దిగిన ఫొటోలు వైరల్‌ కావడంపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది.


సీఎం ఇలాకాలో ఇంటిపోరు వద్దని సూచించినా..! 

పట్టణ అధ్యక్షుని ఎన్నిక సమయంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, సీనియర్ కార్యకర్తలు ఉండటం ఆనవాయితీ. కాని కొత్త కమిటీ ఫొటోల్లో ఎక్కడా  నేతలు కనిపించడం లేదు. పైగా ఈ విషయంపై కనీస సమాచారం కూడా లేదని వారంటున్నారు. అన్యాయమైపోయామని కమిటీ రద్దుపై మాట్లాడాలని నేతలందరూ హరీష్‌రావు దగ్గరకు వెళ్తే కాస్త ఓపిక పట్టాలని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీపరంగా పాతవారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రచ్చచేస్తే బాగుండదని హరీష్‌.. గజ్వేల్‌ అసంతృప్తులకు నచ్చచెప్పి పంపించారనే టాక్‌ వస్తోంది. నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్ పట్టణ మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక అంశంలోనూ ఉద్యమకారులకు మొండి చేయి చూపారని, మళ్ళీ ఇదే వరుసను పార్టీ అధ్యక్ష నియామకం అంశంలోనూ అధిష్టానం అవలంభించిదని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





Updated Date - 2021-12-12T23:00:56+05:30 IST