International Day of Democracy: ప్రజాస్వామిక హక్కులపై అవగాహన పెరగాలి

ABN , First Publish Date - 2022-09-15T22:40:20+05:30 IST

ప్రతి సంవత్సరం సెప్టెంబరు 15న అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

International Day of Democracy: ప్రజాస్వామిక హక్కులపై అవగాహన పెరగాలి

న్యూఢిల్లీ : ప్రతి సంవత్సరం సెప్టెంబరు 15న అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం (International Day of Democracy) జరుగుతుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఇతివృత్తంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. అంతర్జాతీయ సమాజం, పౌర సమాజం, జాతీయ పరిపాలక వ్యవస్థలు, వ్యక్తులు సంపూర్ణంగా మద్దతిస్తూ, సహకరిస్తూ, భాగస్వాములైనపుడు మాత్రమే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, ప్రజాస్వామ్య హక్కులు అందరికీ సమానంగా అమలవుతాయి. 


వాక్ స్వాతంత్ర్యం ప్రాథమిక మానవ హక్కు అని సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనలోని అధికరణ 19 చెప్తోంది. మానవ హక్కులను సమగ్రంగా సాకారం చేసుకోవడం, వాటిని పరిరక్షించడం ఎంత ముఖ్యమో వివరిస్తూ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాలను నిర్వహిస్తారు. 2007 నుంచి ఈ ఉత్సవాల నిర్వహణ ప్రారంభమైంది. 


చరిత్ర

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాల నిర్వహణ కోసం 2007లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఓ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ దినాన్ని దాదాపు 46 దేశాల పార్లమెంట్లు ఆమోదించాయి. 2008 సెప్టెంబరు 15న మొదటిసారి ఈ దినోత్సవాలను నిర్వహించారు. 


లక్ష్యం

ప్రజాస్వామిక మౌలిక విలువలకు మద్దతిచ్చి, ప్రోత్సహించడమే ఈ ఉత్సవాల నిర్వహణ లక్ష్యం. అభిప్రాయాన్ని ఏర్పరచుకుని, దానిని వ్యక్తీకరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనలోని అధికరణ 19 చెప్తోంది. ఎటువంటి జోక్యాలు లేకుండా అభిప్రాయాలను ఏర్పరచుకోవడం, హద్దులు లేకుండా, ఏ మాధ్యమం ద్వారానైనా ఆలోచనలు, సమాచారాన్ని కోరడం, స్వీకరించడం, తెలియజేయడం కూడా ఈ హక్కు పరిధిలోకి వస్తాయి. 


ప్రజాస్వామిక దేశంలో ప్రతి నిర్ణయంలో, ప్రతి సంఘటనలో ప్రజల అభిప్రాయానికి విలువ ఉంటుంది. సామాన్యుల గళాన్ని అణగదొక్కే అధికారం ఏ వ్యక్తికి కానీ, ఉన్నతాధికారికి కానీ ఉండదు. ప్రజాస్వామ్యం అంటే అసలు అర్థం ఏమిటి? దానితోపాటు వచ్చే అధికారాలను ఎలా వినియోగించుకోవాలి? వంటి అంశాలను తెలియజేయడానికే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 


ప్రయోజనాలు 

ప్రజలు తమ మౌలిక హక్కుల కోసం గట్టిగా నిలబడే విధంగా ప్రజాస్వామ్యం శక్తినిస్తుంది. ప్రజలపై దీర్ఘ కాలంలో దుష్ప్రభావాలు చూపగలిగే నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకున్నపుడు, వాటిని వ్యతిరేకించే సంపూర్ణ హక్కులు ప్రజలకు లభిస్తాయి. 


ప్రజాస్వామ్యంలో మార్పులు ఏ సమయంలోనైనా జరగవచ్చు. తమకు నచ్చని రాజకీయ నిర్ణయాలను మార్చవచ్చు లేదా వాటిని యథాతథంగా కొనసాగించవచ్చు. 


ప్రజాస్వామ్యానికి పునాది సమానత్వం. వయసు, ప్రాంతం, వర్ణం, వర్గం, కులం, మతం, స్త్రీ, పురుష వంటి భేదాలేవీ లేకుండా ప్రజలంతా సమానులే. ప్రజాస్వామిక పాలనకు సమాన హక్కులు చాలా ముఖ్యమైనవి. 


రెండు రకాల ప్రభుత్వాలు

ప్రజాస్వామిక ప్రభుత్వాలు రెండు రకాలు. అవి: అధ్యక్ష తరహా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. మన దేశంలో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం అమలవుతోంది. ఈ రెండు రకాలను కలిపి మిశ్రమ ప్రభుత్వ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయవచ్చు. మన రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని  రూపొందించారు. అధ్యక్ష తరహా, పార్లమెంటరీ ప్రజాస్వామిక ప్రభుత్వాల్లో తేడాలు ముఖ్యంగా, శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య అధికార విభజన; శాసన వ్యవస్థకు కార్యనిర్వాహక వ్యవస్థ జవాబుదారీతనం వంటివాటిలో కనిపిస్తుంది. 


అధ్యక్ష తరహా పాలనలో అధ్యక్షుడిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది లేదా నేరుగా ప్రజలు ఎన్నుకుంటారు. చట్ట సభలు చేసిన చట్టాలను అధ్యక్షుడు తిరస్కరించవచ్చు. చట్ట సభల్లో అవిశ్వాస తీర్మానం ద్వారా అధ్యక్షుడిని తొలగించడానికి వీలుండదు. అధ్యక్షుడు తన నిర్ణీత పదవీ కాలాన్ని పూర్తి చేసిన తర్వాత పదవీ విరమణ చేస్తారు. నేరగాళ్ళకు న్యాయస్థానాలు విధించే శిక్షలను తగ్గించడానికి, రద్దు చేయడానికి అధ్యక్షునికి అధికారం ఉంటుంది. 


పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక శాఖల మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి. శాసన వ్యవస్థకు కార్యనిర్వాహక శాఖ బాధ్యతవహిస్తుంది. నామమాత్రపు కార్యనిర్వాహకునిగా దేశాధ్యక్షుడు ఉంటారు, నిజమైన కార్యనిర్వాహకుడిగా ప్రధాన మంత్రి పని చేస్తారు. ప్రభుత్వానికి అధిపతిగా ప్రధాన మంత్రి వ్యవహరిస్తారు.  


మానవులంతా సమానులే. జాతి, వర్ణ, ప్రాంత తదితర భేదాలేవీ లేకుండా హక్కులను అందరూ సమానంగా అనుభవించాలి. సమాజంలో అందరి భాగస్వామ్యంతో మనుగడ సాగించాలి. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాల సందర్భంగా ప్రజాస్వామ్యంపై అందరూ మరింత అవగాహనను పెంచుకోవాలి. 



                                           - యెనుములపల్లి వేంకట రమణ మూర్తి


Updated Date - 2022-09-15T22:40:20+05:30 IST