ఇంటిగ్రేటెడ్‌.. ఇంకా జాప్యం!

ABN , First Publish Date - 2020-07-06T09:38:28+05:30 IST

అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్‌ - ఇంటర్నేషనల్‌ ప్రయాణికుల అవసరాలను తీర్చటానికి బ్రాండ్‌గా నిర్మించాల్సిన ..

ఇంటిగ్రేటెడ్‌.. ఇంకా జాప్యం!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్‌ - ఇంటర్నేషనల్‌ ప్రయాణికుల అవసరాలను తీర్చటానికి బ్రాండ్‌గా నిర్మించాల్సిన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులు మరింత జాప్యమయ్యేలా కనిపిస్తున్నాయి. దీనికి టెండర్లు ఖరారయ్యాయి. కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేశారు. కానీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి నిధుల కేటాయింపుపై స్పష్టత రాలేదు. కరోనా నేపథ్యంలో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు గణనీయంగా ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవటంలో ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా దీనికి ఇప్పుడే ప్రాధాన్యత ఇవ్వాలా? అని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పేరుకు విజయవాడ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయం అయినప్పటికీ.. అంతర్జాతీయ సర్వీసులు నడవడం లేదు. ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌గా ఆధునికీకరించిన పాత టెర్మినల్‌ను కూడా ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయింది.


ఇది కాకుండా డొమెస్టిక్‌ అవసరాల కోసం మూడేళ్ల క్రితం ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ (తాత్కాలిక) నిర్మాణం జరిగింది. ఇది దేశీయ అవసరాలు తీరుస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా పరిమితంగా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. నిర్మించాల్సిన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలు లేకపోవటం, కరోనా కారణంగా దేశీయంగా విమానాలు తక్కువగా తిరగటం వల్ల రూ. 431 కోట్లు నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌కు ఖర్చు పెట్టడం అవసరమా అని కేంద్రం ఆలోచిస్తున్నట్టు సమాచారం. 


కొద్ది కాలం క్రితం ఎన్‌కేజీ ఇన్ర్ఫా అనే సంస్థ దీనికి సంబంధించిన టెండర్లను దక్కించుకుంది. ఈ సంస్థకు ఇప్పటి వరకు అవార్డు ఇవ్వలేదు. అవార్డు ఇవ్వకపోవటానికి ఇదే కారణమని తెలుస్తోంది. విమానయాన సంస్థలకు బూస్ట్‌ ఇవ్వాలనుకుంటే మౌలిక రంగ సదుపాయాలను విస్తరించాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో, విజయవాడ వంటి ఎయిర్‌పోర్టు కాకుండా దేశంలో అనేక ప్రాధాన్యతా ఎయిర్‌పోర్టులపై కేంద్రం దృష్టి ఉంటోంది. ఈ కోణంలో చూసినా.. విజయవాడ మీద కేంద్రం అంతగా దృష్టి సారించడం లేదని స్పష్టమవుతోంది.

Updated Date - 2020-07-06T09:38:28+05:30 IST