అంతర్జాతీయ క్రికెట్‌కు మోర్గాన్‌ గుడ్‌బై

ABN , First Publish Date - 2022-06-28T09:37:04+05:30 IST

ఇంగ్లండ్‌కు వన్డే వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు మోర్గాన్‌ గుడ్‌బై

నేడు ప్రకటన

లండన్‌: ఇంగ్లండ్‌కు వన్డే వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న మోర్గాన్‌ ఈమేరకు తన నిర్ణయాన్ని మంగళవారం ప్రకటించనున్నాడు. ఇక మోర్గాన్‌ స్థానంలో..ప్రస్తుత వైస్‌కెప్టెన్‌గా ఉన్న జోస్‌ బట్లర్‌ ఇంగ్లిష్‌ జట్టు పరిమిత ఓవర్ల సారథిగా నియమితుడయ్యే అవకాశముంది.


35 ఏళ్ల ఇయాన్‌..తన నాయకత్వంలో పరిమిత ఓవర్లలో ఇంగ్లండ్‌ను తిరుగులేని జట్టుగా తీర్చిదిద్దాడు. అయితే 2019లో జట్టు వన్డే ప్రపంచ కప్‌ గెలిచాక కెప్టెన్‌గా మోర్గాన్‌ ఒక సెంచరీ మాత్రమే చేయడం అతడి దారుణ ఫామ్‌కు అద్దం పడుతోంది. ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ ఇయాన్‌ పూర్తిగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో ఖాతాకూడా తెరవలేకపోయిన అతడు గాయంతో మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు.


తదుపరి సారథి బట్లర్‌..?:

ఇంగ్లండ్‌ తదుపరి సారథిగా ఎంపికయ్యే సూచనలున్న బట్లర్‌.. ఈసారి ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. లీగ్‌లో రాజస్థాన్‌ జట్టు ఫైనల్‌ చేరడంలో కీలక భూమిక పోషించాడు. ఆ జోరు ను నెదర్లాండ్స్‌పై వన్డే సిరీ్‌సలోనూ కొనసాగించాడు. తొలిమ్యాచ్‌లో బట్లర్‌ అజేయంగా 162 (70 బంతులు) రన్స్‌ చేయడం విశేషం. భారత్‌తో మూడేసి టీ20లు, వన్డేల హై ప్రొఫైల్‌ సిరీస్‌ కెప్టెన్‌గా బట్లర్‌కు మొదటిది కానుంది.

Updated Date - 2022-06-28T09:37:04+05:30 IST