తాలిబన్లపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం

ABN , First Publish Date - 2021-12-29T21:46:10+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ల మాటలకు, చేతలకు పొంతన ఉండటం

తాలిబన్లపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ల మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదని అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆగస్టు 15న దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి తమ దురాగతాలను తీవ్రతరం చేశారని ప్రపంచం మండిపడుతోంది. గత ఆఫ్ఘన్ ప్రభుత్వంలో పని చేసిన సైనికుడిని తాలిబన్ ఉగ్రవాదులు చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో ఈ దుశ్చర్యలను ఖండిస్తోంది. గత ప్రభుత్వ ఉద్యోగులను క్షమిస్తున్నట్లు చెప్పిన తాలిబన్లు ఆ మాటను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని నిలదీస్తోంది. 


గత ప్రభుత్వంలో పని చేసిన ఉద్యోగులందరినీ సామూహికంగా క్షమిస్తున్నట్లు ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తాలిబన్లు చెప్పారు. కానీ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ మాజీ సైనికాధికారిని ఇద్దరు తాలిబన్ ఉగ్రవాదులు కట్టేసి, చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు కనిపించింది. 


ఆఫ్ఘనిస్థాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, సామూహిక క్షమాపణ విధానాన్ని తాలిబన్లు తమ క్రింది స్థాయిలో అమలు చేయాలని ఓ మాజీ మిలిటరీ అధికారి కోరారు. ప్రొవిన్షియల్ గవర్నర్లు, సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ చీఫ్‌ల ద్వారా ఈ విధానాన్ని అమలు చేయాలని కోరారు. తాలిబన్ల సీనియర్ నేత అనస్ హక్కానీ మాట్లాడుతూ, వ్యక్తిగత కక్ష సాధింపులను ఖండించారు. సామూహిక క్షమాపణను గౌరవించాలని చెప్పారు. 


ఆఫ్ఘనిస్థాన్ గత ప్రభుత్వంలో పని చేసిన ఉద్యోగులను, సైనికులను చిత్రహింసలకు గురి చేయడంతోపాటు చాలా మందిని హత్య చేస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి అనేక మానవ హక్కుల సంస్థలు నివేదికలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-12-29T21:46:10+05:30 IST