అణిచేస్తే ఆయుధాలయ్యారు!

ABN , First Publish Date - 2021-03-07T19:15:06+05:30 IST

ఖరీదైన కాఫీషాప్‌లో కూర్చుని కులాసాగా నాలుగు సెల్ఫీలు తీసుకుని..

అణిచేస్తే ఆయుధాలయ్యారు!

ఖరీదైన కాఫీషాప్‌లో కూర్చుని కులాసాగా నాలుగు సెల్ఫీలు తీసుకుని.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు చేసి.. లైకులొస్తే మురిసిపోయే రకం కాదు వీళ్లు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమంపై ఒక ట్వీటు విసిరి దర్బార్‌ గుండెల్లో దడ పుట్టించేది ఒకరైతే... కులం పునాదులను కూల్చేందుకు ఒక పాటను తూటాలా పేల్చి.. అసమానతలు లేని దేశం కోసం ఆరాటపడతారు ఇంకొకరు. దిశా రవి సోషల్‌మీడియాలో టూల్‌కిట్‌ షేర్‌ చేసినందుకు.. జ్యోతి జగ్‌తప్‌ ఎల్గార్‌పరిషత్‌లో పాట పాడినందుకు  జైలుకు వెళ్లారు.  ఏ ప్రభుత్వమైనా ప్రశ్నిస్తే సహించలేదు.. దాని స్వభావమే అంత! అయినా సరే పంజాబ్‌కు చెందిన నవదీప్‌ కౌర్‌ ఇంటిగోడలపైనే సర్కారును ప్రశ్నించే పోస్టరు అతికించింది. ఢిల్లీ సరిహద్దులకు వెళ్లి అన్నదాతలకు మద్దతు సైతం ప్రకటించింది. ఊరుకుంటుందా ప్రభుత్వం? సాకులు వెతుక్కుని మరీ జైల్లో పెట్టింది. వీళ్లే కాదు... కొత్తతరం యువతులు ఎంత అణిచివేతకు గురైతే అంత పదునెక్కిన ఆయుధాలు అవుతున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన షబ్నమ్‌ చిన్నప్పటి నుంచే భూ పోరాటాలు చేస్తోంది. ఆమెను మట్టుపెట్టేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారు భూకాసురులు. రాజస్థాన్‌కు చెందిన భారతి పరిస్థితి కూడా అంతే! బాల్యవివాహాలను  అడ్డుకుంటున్నందుకు చంపేస్తామని బెదిరించారు. జైళ్లకు భయపడితేనో, దౌర్జన్యాలకు లొంగిపోతేనో ఈ మార్గంలో నడిచేవాళ్లే కాదు వీళ్లు. రేపు మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా సమాజంలో మార్పును కోరుకుంటున్న ఆ సాహస యువతుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం...


హక్కులు అడిగితే ద్రోహమా?

ఆ అమ్మాయికి పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. ఎప్పుడూ మొక్కలు నాటుతూనో, చెరువుల్లో చెత్తను తొలగిస్తూనో కనిపిస్తుంటుంది. ఒక రోజు హఠాత్తుగా ఢిల్లీ పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఆమె చేసింది చిన్నాచితక నేరం కాదు, దేశద్రోహమట. బెంగళూరువాసులే కాదు, దేశమంతా నివ్వెరపోయింది. దిశా అన్నప్ప రవి అరెస్టు ఒక్కసారిగా అంతర్జాతీయ వార్త అయ్యింది. పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటాథన్‌బర్గ్‌తో కలిసి ఢిల్లీ రైతుల ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు టూల్‌కిట్‌ అనే ఒక చిన్న గూగుల్‌ డాక్యుమెంట్‌ను రూపొందించారు. దాన్ని ఇతరులతో పంచుకున్నందుకు అరెస్టు చేశారు. టూల్‌కిట్‌లో పొయెటిక్‌ జస్టిస్‌ అనే సంస్థ పేరు ఉండటం, దానికి నిషేధిత ఖలిస్తాన్‌ ఉద్యమంతో సంబంధం ఉందని ఆరోపించడం, అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. దేశద్రోహం ప్రేరేపించేందుకు, అశాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారన్నది ప్రభుత్వ వాదన. దిశకు బెయిల్‌ మంజూరైంది, కేసు విచారణ సాగుతోంది. ఇదంతా పక్కన పెడితే దిశా రవి కొత్తతరం ఉద్యమకారిణి. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం గ్రెటా థన్‌బర్గ్‌ చేపట్టిన ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ ఉద్యమానికి ఆకర్షితులైంది.


ఇండియాలో కూడా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతోంది దిశా రవి. ‘మా తాతల కాలం నుంచీ మాది రైతు కుటుంబం. అకాల వర్షాలు, వరదలు, కరువు ఇవన్నీ వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీస్తాయో నాకు తెలుసు. గ్లోబల్‌వార్మింగ్‌ అనేది మనకు సంబంధించినది కాదు, అదేదో అంతర్జాతీయ సమస్య అనుకుని వదిలేస్తాం. కచ్చితంగా మనందరి జీవితాలను తలకిందులు చేసే పెద్ద సమస్య అది. మన పొలంలో అకాల వర్షానికి పంట దెబ్బతిన్నా, వరదల్లో మన ఇల్లు మునిగిపోయినా అదే కారణం’ అంటుందామె. అన్ని దేశాలూ క్లయిమెట్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలి. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు ఇస్తున్న ఎన్నో సడలింపుల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. బెంగళూరులోని మౌంట్‌ కార్మెల్‌ కాలేజీలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేట్‌ అయిన దిశకు చిన్నప్పటి నుంచే సామాజిక స్పృహ ఎక్కువ. ప్రశ్నించే తత్వం ఆమె నైజం. తను జంతు సంబంధిత ఉత్పత్తులేవీ ముట్టకూడదని వీగన్‌గా మారింది. అలాంటి ఆహార ఉత్పత్తుల కంపెనీలోనే ఉద్యోగం కూడా చేయాలనుకుంది. అరెస్టు అయ్యే ముందు కూడా గుడ్‌మిల్క్‌ అనే సంస్థలో తను ఎక్స్‌పీరియన్స్‌ మేనేజర్‌. చదువుకుంటున్న ప్పుడే కాలేజీ సరదాలను కాదనుకుని అడవుల సంరక్షణ కోసం నడుం బిగించింది. గోవాలోని మొల్లెం అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు ఉద్యమంలో పాల్గొంది. ఉత్తరాఖండ్‌లోని ఏనుగుల సంరక్షణ కేంద్రం, ముంబయిలోని ఆరె అటవీ ప్రాంతం, జమ్మూలోని రైకా ఫారెస్ట్‌, మధ్యప్రదేశ్‌లోని డుమ్మా నేచర్‌పార్క్‌లను కాపాడేందుకు చేపట్టిన అనేక పోరాటాల్లో ముందుంది దిశ. శాంతియుతంగా నిరసనలు తెలపడం భారతీయుల రక్తంలోనే ఉంది. రైతుల మానవ హక్కుల కోసం ఉద్యమించడం ఏం తప్పు? అని ప్రశ్నిస్తోంది దిశా రవి.


కక్షతోనే లోపల వేశారు..

ఇరవై నాలుగేళ్ల దళిత యువతి నవదీప్‌ కౌర్‌ను అన్యాయంగా అరెస్టు చేయడమే కాకుండా, లైంగికహింసకు గురిచేస్తారా? ఆమెను ఎందుకలా వేధిస్తున్నారు? అంటూ కమలాహారిస్‌ బంధువు, లాయర్‌ మీనా హారిస్‌ ట్వీట్‌ చేశాకే మన మీడియాకు పెద్ద వార్త అయ్యిందీ సంఘటన. అంతవరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 


పంజాబ్‌లోని ముక్తర్‌సాహెబ్‌ జిల్లా గండేరా ఒక చిన్న గ్రామం. ఇటుకల గోడలపై కట్టుకున్న పెంకుటిల్లు. ఊర్లోని ప్రతి ఇంటిపైనా భారతీయ కిసాన్‌ యూనియన్‌ జెండాలు ఎగురుతున్నాయి. ఈ పెంకుటిల్లు గోడపైన కూడా- భారతీయుల్లో యాభై శాతం రైతులే. వాళ్లను కాపాడితే జాతిని కాపాడినట్లే. వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయండి... అనే పోస్టర్‌ ఒకటి కనిపిస్తుంది. నవ్‌దీప్‌ కౌర్‌ ఇల్లు అది. ఊర్లో ఒక అగ్రకుల వ్యక్తి దళిత అమ్మాయిని అత్యాచారం చేస్తే... కౌర్‌ తల్లి మాలియా అతన్ని నిలదీసింది. అందుకని ఊర్లోని అగ్రకులస్థులు ఆ దళిత కుటుంబంపై పగబట్టారు. చేసేది లేక తెలంగాణలో వరి కోత యంత్రానికి ఆపరేటర్‌గా పనిచేస్తున్న వాళ్ల నాన్న చక్‌దీప్‌సింగ్‌ దగ్గరికి వచ్చింది ఆ కుటుంబం. అయితే లాక్‌డౌన్‌ ప్రకటించాక మళ్లీ సొంతూరు వెళ్లిపోయారు. ఆ కుటుంబంలోని ఆరుగురు పిల్లల్లో ఒకరు నవదీప్‌కౌర్‌. ఆమె ఇంటర్‌ చదువుకుంది. ఆర్థిక పరిస్థితులు బాగలేక చదువుకోలేదు.


గత ఏడాది అక్టోబర్‌లో హర్యానాలోని సోన్‌పత్‌ జిల్లా కుండ్లీ పారిశ్రామిక వాడలోని బల్బుల ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. అది ఢిల్లీ సరిహద్దుల్లోని ప్రాంతం. అప్పటికే దళిత, కార్మిక సంఘాలలో చురుగ్గా పాల్గొనేది నవదీప్‌. ఉద్యోగం చేస్తూనే సెలవు రోజుల్లో సింధూ బార్డర్‌లోకెళ్లి రైతుల ఉద్యమాల్లో పాల్గొనేది. దాంతో ఆమెపై పోలీసుల కన్ను పడింది. మజ్దూర్‌ అధికార్‌ సంఘటన్‌ లేబర్‌ రైట్స్‌ యూనియన్‌లో చేరిన ఆమె ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించకుండా ఉండలేదు. ‘ఆ తత్వం మా అమ్మ నుంచి మాకు అలవడింది. కుల వివక్ష, ఆర్థిక అసమానతలను చిన్నప్పటి నుంచీ మేమంతా అనుభవిస్తున్నాం’ అంటుంది ఆమె సోదరి. ఒక రోజు - తను పనిచేస్తున్న పారిశ్రామిక వాడలో కనీసవేతనాల అమలుపై ఆందోళనలో పాల్గొంది నవదీప్‌. పోలీసులు ఆఘమేఘాలపై ఆమెను అరెస్ట్‌ చేశారు. లాఠీలతో బాదారు. అభ్యంతరకరమైన చోట్ల తాకారు. కర్రలతో పోలీసులపైనే ఉద్యమకారులు దాడులకు దిగారన్న సాకుతో జైల్లో పెట్టారు. హర్యానాలోని ఓ పోలీస్‌స్టేషన్‌ పోలీసులు నవదీప్‌ను లైంగిక హింసకు గురిచేశారని, ఆడపిల్ల అని కూడా వ్యవహరించలేదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె మీద పోలీసులు మోపిన కేసులు... అటెమ్ట్‌ టు మర్డర్‌, దొంగతనం, దోపిడీ. ఈ సంఘటన ప్రముఖ లాయర్‌ మీనాహారిస్‌ను కదిలించింది. అందుకే ఆమె చేసిన ఒక్క ట్వీట్‌తో విషయం అంతర్జాతీయ దృష్టికి వెళ్లింది.



ఆ పీష్వాపై పాట పాడినందుకు

అసమానతలు, అగ్రకుల ఆధిపత్యం, హిందుత్వం.. ఇవన్నీ అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అందుకే వాటిపైనే మా దళితుల పోరాటం అంటుంది కబీర్‌ కళా మంచ్‌ కళాకారిణి జ్యోతి జగ్‌తప్‌. 2007 నుంచీ బీమాకోరెగావ్‌ కేసులో అరెస్టు అయ్యే వరకు ఆమె గొంతు గర్జిస్తూనే ఉంది. ఆమె చేసిన తప్పు ఒక చారిత్రక స్మారక సభలో పాల్గొనడం. అది రెండొందల ఏళ్ల కిందటి చరిత్ర. బ్రిటిష్‌ రెజిమెంట్‌లోని దళిత మహర్‌లు (ఎస్సీలు) బ్రాహ్మణ పీష్వాలను ఓడించిన ఘట్టం. అదే బీమాకోరెగావ్‌ యుద్ధం. దీనికి గుర్తుగా- పుణెలోని ఆ ప్రాంతంలో ఆంగ్లేయులు ఒక స్మారక కేంద్రాన్ని నిర్మించారు.


అప్పట్లో అంబేద్కర్‌ కూడా సందర్శించడంతో దళితులకు, అభ్యుదయ వాదులకు అదొక విజయ స్మారక కేంద్రంగా మారింది. అప్పటి నుంచీ జనవరి 1న సమావేశాలు నిర్వహిస్తుంటారు. పుణెలో ఉన్న శనివార్‌వాడ మరాఠా పీష్వాల రాజ్యానికి కేంద్రం. అప్పట్లో పీష్వాలు దళితుల్ని, అణగారిన వర్గాలను అణగదొక్కుతూ అత్యాచారాలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. 2017 డిసెంబర్‌ 31న శనివార్‌వాడలో జరిగిన ఎల్గార్‌ పరిషత్‌ సమావేశంలో కబీర్‌ కళా మంచ్‌ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందులో పాల్గొంది జ్యోతి బృందం. పొద్దున్నే బీమాకోరేగావ్‌ సమావేశం ఉంది కనుక... ఈ చైతన్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సమాజంలో కులవ్యవస్థ వల్ల ఏర్పడిన అసమానతలపై పోరాడేందుకు చారిత్రక ఘట్టాలు స్ఫూర్తినిస్తాయన్నది ఆ కళాకారుల నమ్మకం. ఆ కార్యక్రమంలో జ్యోతి పాడిన పాటల్లో ‘న్యూ పీష్వా రూల్‌’ అన్నది ఒకటి. పరోక్షంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఆ పాట పాడిందామె. దళితులు, అగ్రకులాల మధ్య శత్రుత్వం పెంచేలా ఆమె పాటలు ఉన్నాయని, దీనివల్ల హింస చెలరేగుతుందన్నది పోలీసుల వాదన. ఆ మరుసటి రోజే బీమాకోరెగావ్‌ సభ జరిగింది. కొందరు చేసిన ఫిర్యాదు మేరకు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంది సర్కారు. సమావేశంపై కొందరు మతవాదులు దాడి చేయడంతో అల్లర్లు చెలరేగి ఒకరు మరణించారు.


ఈ కేసులోనే అనేక మంది మేధావుల్ని, కళాకారుల్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జ్యోతిని కూడా అరెస్టు చేసి ముంబైలోని బైకుల్లా జైలులో ఉంచారు. ఈమెపై ఊపా చట్టాన్ని ప్రయోగించింది ప్రభుత్వం. ఎల్గార్‌పరిషత్‌కు మావోయిస్టులతో సంబంధం ఉందని వాదిస్తున్నారు పోలీసులు. ఇవన్నీ విచారణలో తేలే అంశాలు. జ్యోతికి పుస్తకాలంటే ఇష్టం. ఆమె ఒకవైపు సామాజిక న్యాయం కోసం పోరాడుతూనే ఎంఏ సైకాలజీలో రేషనల్‌ ఎమోటివ్‌ బిహేవియర్‌ థెరపీ కోర్సు చేస్తోంది. జైలు గోడల కంటే కులం, మతం గోడలే బలమైనవి.. వాటిని కూల్చడమే మా ఏకైక లక్ష్యం అంటోంది జ్యోతి కళా బృందం.



ప్రాణాలకు తెగించి పోరాటం 

అతనొక ఎమ్మెల్యే. భూకాసురుడు. అడ్డొస్తే అడ్డంగా నరికేస్తానంటాడు. అలాంటి వ్యక్తినే ఢీ కొట్టింది మధ్యప్రదేశ్‌లోని ముంగౌలికి చెందిన ముప్పయి యేళ్ల సాధారణ యువతి షబ్నమ్‌ షా. ఆమె ఎంచుకున్నదే ప్రాణాలతో చెలగాటమాడే భూ పోరాటం. అడవులు, గిరిజన ప్రాంతాలు, పేదలున్న పల్లెల్లో పర్యటిస్తూ... అదే జీవితంగా చేసుకుంది. ఆ ఎమ్మెల్యే బినామీలు భూమిని ఆక్రమించారు. పేదల చేతుల్లో పత్రాలు ఉన్నాయి కానీ భూమి ఆ రాకాసుల ఆక్రమణలో ఉంది. విషయం తెలుసుకున్న షబ్నమ్‌ ప్రాణాలకు తెగించి అక్కడికెళ్లింది. బాధితుల తరఫున పోరాటం మొదలుపెట్టింది. భూముల ధరలు ఆకాశన్నంటుతున్న తరుణంలో ఒక గజం జాగా కోసం భూకాసురులు ఎంతకైనా తెగిస్తారని ఆమెకు తెలుసు. అదే జరిగింది. ఒక రోజు ఎమ్మెల్యే తన అనుచరులతో ‘ఆ షబ్నమ్‌ ఎక్కడ కనిపిస్తే అక్కడే కాల్చిపడేయండి’ అని హుకుం జారీ చేశాడు.


అది తెలిసిన ఆమె తల్లీ, చెల్లీ ఒక్కటే ఏడుపు. ‘ఈ ఉద్యమాలు మనకొద్దు తల్లీ. ఇంత మందికి నువ్వు మంచి చేస్తున్నావు కదా... నిన్ను చంపడానికి ఆ దుండగులు వస్తే ఒక్కరైనా ముందుకొచ్చి నిన్ను కాపాడతారా? సమాజంలో ఎవరి స్వార్థం వారిది. నీ కాళ్లు పట్టుకుంటాం. ఇక మానేయ్‌’ అని బతిమాలారు. అప్పుడు షబ్నమ్‌ ‘మీరు కూడా అదే స్వార్థంతో ఆలోచిస్తే ఇక నాలాంటి వాళ్లు ఎలా పోరాడతారు’ అని ఎదురు ప్రశ్న వేసింది. అటవీ, గిరిజన, బంజరు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని తెలిసిన వెంటనే అక్కడ వాలిపోతుంది షబ్నమ్‌. రెవెన్యూ అధికారులను నిలదీస్తుంది, మాట వినకపోతే కోర్టును ఆశ్రయిస్తుంది. అలా సుమారు 1400 మంది సహర్య తెగ ఆదివాసీల భూముల్ని కాపాడిందామె. భూ పరిరక్షణ హక్కులపై చైతన్య కలిగించేందుకు ఏక్తాపరిషత్‌ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ‘ఎవరో ఎందుకు? మా తండ్రి కూడా భూ ఆక్రమణ బాధితుడే! అతను బతికున్నప్పుడు సుమారు ముప్పయి యేళ్లు ఇతరులు ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు న్యాయపోరాటం చేశాడు. కోర్టుల చుట్టూ తిరిగీ తిరిగీ చెప్పులు అరిగిపోయాయి. లాయర్లకు డబ్బులు చెల్లించలేక అప్పులపాలయ్యాడు.


ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండేది కాదు. చిన్నప్పుడు నా బాల్యంపైనా ఆ ప్రభావం పడింది. అందుకే నిరుపేదల భూ సమస్యలపై పోరాడేందుకే బతకాలనుకున్నా’ అంటోందామె. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులతో తలపడే భూసమస్యల పోరాటాన్ని ఎంచుకున్నందుకు షబ్నమ్‌కు లెక్కలేనన్ని ప్రశంసలు, అవార్డులు వచ్చాయి. అందులో గత ఏడాది ఆమె అందుకున్న అరుదైన పురస్కారం వుమెన్స్‌ వరల్డ్‌ సమ్మిత్‌ ఫౌండేషన్‌ అవార్డు. ‘నా పోరాటంతో తమ భూమి తమకు వచ్చిందన్న బాధితుల కళ్లలో మెరిసే ఆనందం ఉంది చూడు... అది ఈ అవార్డులకంటే గొప్ప సంతృప్తినిస్తుంది’ అంటుంది షబ్నమ్‌.


రేప్‌ చేస్తామని బెదిరించారు

అదొక స్వచ్ఛంద సంస్థ కార్యాలయం. బాల్య వివాహాలపై టీవీ ఛానల్‌ చర్చావేదిక  నిర్వహిస్తోంది. ఓట్లు, సీట్ల కోసం ముక్కుపచ్చలారని పిల్లల పెళ్లిళ్లను ప్రభుత్వం అడ్డుకోలేకపోతోంది... అని విమర్శిస్తోంది ఒక యువతి. ఐదారు వాహనాలు వేగంగా దూసుకొచ్చి, ఆఫీసు ముందు ఆగాయి. ఖరీదైన కారులో నుంచీ ఖద్దరు చొక్కా వేసుకున్న వ్యక్తి గబగబా లోపలికి వెళ్లి... టీవీ చర్చను ఆపేవరకు ఆగమాగం చేశాడు. అయినా బెదరలేదు అక్కడున్న యువతి. మాట్లాడే స్వేచ్ఛకు అడ్డుచెప్పేందుకు నీకేం అధికారం ఉందని అక్కడికక్కడే కడిగిపారేసింది. తిరగబడ్డ ఆ ఆడబిడ్డను చూసి నీళ్లు నమిలాడు వచ్చిన వ్యక్తి. అదీ కృతి భారతి సత్తా. ఆమె రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌ వాసి. బాల్యవివాహాలను అడ్డుకునేందుకు ఉద్యమిస్తోంది.


భారతి బాల్యం సంఘర్షణల మయం. తను పుట్టక ముందే తల్లిని వదిలేశాడు తండ్రి. పసిబిడ్డను చంకన వేసుకుని - ఒకవైపు పేదరికంతో, మరోవైపు సమాజంతో పోరాడక తప్పలేదు ఆ తల్లి. ఆ క్రమంలో పెరిగిన భారతిని ఆమె బంధువులు చిన్నచూపు చూశారు. కొందరైతే తండ్రి లేని బిడ్డకదాని లైంగికంగా వేధించారు. పదేళ్ల వయసుకే  జీవితంపై విరక్తి కలిగి, విషం తీసుకుని చనిపోవాలనుకుంది. మధ్యలో బడి మానేయక తప్పలేదు. ఆఖరికి అన్ని అడ్డంకుల్ని అధిగమించి, అవమానాలను దిగమింగి మళ్లీ చదువును కొనసాగించింది. ఇప్పుడు సైకాలజీలో పీహెచ్‌డీని పూర్తి చేసే పనిలో ఉందామె. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే సామాజిక అంశాలపైన ఉద్యమిస్తూనే, అత్యాచార బాధితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేది. మానసికంగా అండగా నిలిచేది. ‘నిజానికి నా గతం గుర్తుకొచ్చినప్పుడల్లా నాపై నాకే జాలి కలుగుతుంది. నన్ను అత్యాచారం చేస్తాం. చంపుతాం అని భయపెట్టారు.


ఇవన్నీ ఎలా తట్టుకుని నిలబడ్డానా అనిపిస్తుంది. నేను ఏ కులాన్నీ, మతాన్నీ అనుసరించను. వాటిపైన ఏవగింపు కలిగింది. అందుకే ఇంటిపేరును భారతిగా మార్చుకున్నాను. భారతి అంటే డాటరాఫ్‌ ఇండియా అని అర్థం..’ అని  చెప్పుకొచ్చింది. అనేక స్వచ్ఛంద సంస్థల్లో పనిచేశాక బాల్యవివాహాలను అడ్డుకునేందుకు సార్థి అనే ఎన్‌జీవోను నెలకొల్పింది. దేశంలో తొలిసారి బాల్యవివాహాన్ని న్యాయపరంగా రద్దు చేయించిన ఘనత ఆమెకే దక్కింది. 2013 లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డు కూడా ఆ విషయాన్ని గుర్తించింది. సీబీఎస్‌ఈ కి చెందిన 11, 12 వ తరగతుల పాఠ్యపుస్తకాల్లోనూ భారతి జీవితం పాఠంగా చదువుకుంటున్నారు పిల్లలు. ఒకే రోజు రెండు బాల్యవివాహాలను కోర్టు ఆదేశాలతో నిలుపుదల చేయించి ప్రపంచరికార్డు సాధించింది. బాల్య వివాహాలతోపాటు బాలకార్మికులు, మహిళలపై లైంగిక వేధింపులు, మహిళా ఖైదీల సమస్యలపై కృతి భారతి కృషి చేస్తోంది. ఒకప్పుడు ఏ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ ప్రజాప్రతినిధి తనపై దాడికి దిగాడో... అదే ప్రభుత్వం లండన్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ మహిళా సమావేశానికి తనను అతిథిగా పంపింది. అదీ భారతి విజయం.


ఆయన వక్ర బుద్ధిపై గెలిచింది 

ఒక వ్యక్తి కంటే ఉద్యమానికే శక్తి ఎక్కువ. సాధారణ మనిషి వ్యవస్థలపైనా, అధికార ముసుగులు వేసుకున్న పెద్దలపైనా పోరాటం చేయడం అంత సులభం కాదు. అదే మనిషే ఒక ఉద్యమంలా ముందుకు సాగితే కొండంత ధైర్యం వస్తుంది. అప్పుడు కొండలనే ఢీకొట్టవచ్చు. ఆ పనే చేసింది ప్రముఖ పాత్రికేయురాలు ప్రియా రమణి. ఇరవై ఏళ్ల కిందట ఆమె ఒక సాధారణ జర్నలిస్టు. ప్రముఖ ఆంగ్లపత్రిక ఏసియన్‌ ఏజ్‌కు సంపాదకుడు ఎంజే అక్బర్‌. ఆయన తనతో ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉందంటూ ఆమె ఇరవైఏళ్ల తరువాత నోరు విప్పింది. 2018లో మీటూ ఉద్యమం ఊపందుకున్న తరుణంలో ట్విట్టర్‌లో ఆరోపించింది. ఆమెతో పాటు మరికొందరు మహిళలు అక్బర్‌పైన విరుచుకుపడ్డారు. అప్పట్లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో ఆయన ప్రియపైన పరువునష్టం దావా వేశాడు. ఇటీవలే ఆ కేసును కోర్టు కొట్టివేయడంతో ప్రియకు ఊరట కలిగింది. 1994లో ఏసియన్‌ ఏజ్‌ పత్రికలో పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టిన ప్రియ .. రాయిటర్స్‌, ఎల్లె, ఇండియాటుడే, కాస్మోపాలిటన్‌, లైవ్‌ మింట్‌లలో పనిచేసింది. అనేక పత్రికలకు కథనాలు రాస్తుంటుంది. న్యాయకథనాలను అందించే ‘ఆర్టికల్‌ 14’ వెబ్‌సైట్‌ ఎడిటోరియల్‌ బోర్డులో ఆమె సభ్యురాలు. ఆమె పోరాటం చేసింది బాస్‌పైనే కాదు, మగవాళ్ల వక్ర బుద్దిపైన!.


నేటి యువతరం సామాజిక సమస్యలపై స్పందించడం లేదు అన్నది ఒక కోణమే! అయితే పట్టించుకుంటున్న వాళ్లు మాత్రం ఆధునిక పంథాలో ముందుకెళుతున్నారు. సామాజిక మాధ్యమాలను ఆయుధాలుగా చేసుకుని... అంతర్జాతీయ మద్దతు సైతం కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నవతరం మహిళలు కొత్త ఉద్యమాలకు సన్నద్ధమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు. అందుకు నిదర్శనమే ఈ పోరాటయోధులైన మహిళలు. 

Updated Date - 2021-03-07T19:15:06+05:30 IST