సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం

ABN , First Publish Date - 2022-05-02T23:45:05+05:30 IST

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో మే 1(ఆదివారం) అంతర్జాతీయ కార్మికదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో మే 1న(ఆదివారం) అంతర్జాతీయ కార్మికదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. సుమారు 1200 మంది స్థానిక తెలుగు కార్మికసోదరులను తెలుగు సమాజం సభ్యులు కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా రుచికరంగా తయారు చేయించిన బిర్యాని వారికి అందించారు. కార్మికుల యోగక్షేమాల గురించి విచారించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. తెలుగు సమాజం పూర్వ, ప్రస్తుత కార్యవర్గసభ్యులతో పాటు, సభ్యులు మరియు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, ప్రముఖ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.  


సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి గారు మాట్లాడుతూ, తెలుగు కార్మిక సోదరులకి ఏ సమస్య వచ్చినా అండగా ఉన్నామని, అన్నివేళళా తనతో పాటు తన కార్యవర్గం కార్మికులకు సాయ చేసేందుకు సిద్ధంగా ఉంటుందని భరోసాయిచ్చారు. రెండు సంవత్సరాల తరువాత అందరినీ భౌతికంగా కలుసుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు. ఎటువంటి క్లిష్టపరిస్ధితులోనైనా అందరూ ధైర్యంగా, కలిసికట్టుగా ఉంటూ ఒకరికొకరు తమకు చేతనైనంతలో సాయపడాలని పిలిపునిచ్చారు.


కుటుంబాలకు దూరంగా ఉన్న సుమారు 1200 మంది కార్మిక సోదరులకు స్థానిక రెస్టారెంట్స్ సహకారంతో బిర్యాని బాక్స్‌లు అందించామని సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు, కార్యక్రమ నిర్వాహకులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి తెలిపారు. కార్మికసోదరులకు తాము ఎప్పుడూ అండదండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం పర్యవేక్షించి విజయవంతం చేయడానికి, మరీ ముఖ్యంగా గత రెండు సంవత్సరాల క్లిష్టకాలంలో సింగపూర్ తెలుగు సమాజం తరుపున సోదరులకు అనేకరకాలుగా సహాయపడుతూ చేదోడువాదోడుగా ఉన్న కార్యవర్గసభ్యులు పోతగాని నరసింహగౌడ్, నాగరాజుల సేవలను కార్యవర్గసభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమానికి  హాజరైన తెలుగు వారికి, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ , కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించిన కార్యవర్గసభ్యులకీ, దాతలకు, సహకరించిన రెస్టారెంట్ యాజమాన్యాలకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు.

Read more