ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన MBBS విద్యార్థులకు బిగ్ రిలీఫ్

ABN , First Publish Date - 2022-03-06T13:25:39+05:30 IST

ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత వైద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది.

ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన MBBS విద్యార్థులకు బిగ్ రిలీఫ్

ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన ఎంబీబీఎస్‌ విద్యార్థులకు అనుమతి

వాళ్లకు భారత్‌లో ఇంటర్న్‌షిప్‌!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత వైద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. వారు తప్పనిసరిగా ఏడాది పాటు చేయాల్సిన ఇంటర్న్‌షిప్‌‌ను భారత్‌లో పూర్తి చేసే వెసులుబాటు కల్పించింది. విదేశీ వైద్యవిద్య పట్టభద్రుల (ఎఫ్‌ఎంజీలు)కు ఈ మేరకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. ఎన్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సర్క్యులర్‌ను ఉంచింది.


ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ లైసెన్షియేట్‌ -2021 నిబంధనల ప్రకారం.. విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించే విద్యార్థులు కోర్సు, శిక్షణ, ఇంటర్న్‌షిప్‌ కూడా అక్కడే పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రాథమికంగా వైద్యవిద్యను ఎక్కడ చదువుతారో అక్కడే వీటన్నింటినీ పూర్తి చేయాలి. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభం కారణంగా ఎఫ్‌ఎంజీలు కొన్ని రాష్ట్ర వైద్య కౌన్సిళ్లలో రిజిస్టర్‌ చేసుకోవడం కష్టంగా మారడంతో ఎన్‌ఎంసీ నిబంధనలను సవరించింది.


అయితే, నవంబరు 18, 2021 నాటికి విదేశీ వైద్యవిద్య డిగ్రీ లేదా ప్రాథమిక అర్హత సాధించిన ఎఫ్‌ఎంజీలకు ఈ నిబంధనలు వర్తించవని తెలిపింది. అలాగే నవంబరు 18లోపు విదేశీ విద్యా సంస్థలో అండర్‌ గ్రాడ్యుయేట్‌గా చేరిన వారూ ఈ విభాగంలోనే ఉంటారని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ ద్వారా ప్రత్యేకంగా మినహాయింపు పొందిన ఎఫ్‌ఎంజీలకూ ఇవి వర్తించవు.

Updated Date - 2022-03-06T13:25:39+05:30 IST