శివన్నగూడ రిజర్వాయర్‌ పనుల అడ్డగింత

ABN , First Publish Date - 2021-02-27T05:54:20+05:30 IST

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పునరావాసం కల్పించేంతవరకు పనులు జరగనిచ్చేదిలేదని చర్లగూడెం రిజర్వాయర్‌ ముంపు బాధితులు స్పష్టంచేశారు.

శివన్నగూడ రిజర్వాయర్‌ పనుల అడ్డగింత
తవ్వకాలను అడ్డుకుంటున్న చర్లగూడెం ముంపు బాధితులు

మర్రిగూడ, ఫిబ్రవరి 26: ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పునరావాసం కల్పించేంతవరకు పనులు జరగనిచ్చేదిలేదని చర్లగూడెం రిజర్వాయర్‌ ముంపు బాధితులు స్పష్టంచేశారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న చర్లగూడెం గ్రామంలోని వ్యవసాయ భూముల్లో ప్రాజెక్టు అధికారులు శుక్రవారం మట్టి తవ్వకాలను ప్రారంభించారు. గ్రామస్థులు మూకుమ్మడిగా వచ్చి పనులను అడ్డుకున్నారు. తమకు పూర్తిగా పునరావాసం కల్పించేంతవరకు పనులు నిలిపివేయాలని అధికారులను డిమాండ్‌ చేశారు. అధికారులకు, ముంపు బాధితులకు వాగ్వాదం జరుగుతుండగా పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఇరువురికీ నచ్చజెప్పారు. తాము రిజర్వాయర్‌ నిర్మాణానికి వ్యతిరేకం కాదని బాధితులు తెలిపారు. తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పునరావాసం కల్పించి, పనులు ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేశారు.


Updated Date - 2021-02-27T05:54:20+05:30 IST