ఆధార్‌కు అంతరాయం!

ABN , First Publish Date - 2020-11-29T05:19:03+05:30 IST

జిల్లాలో ‘ఆధార్‌’ నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. రెండు వారాలుగా సేవలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. ఇప్పటివరకూ ప్రైవేటు కేంద్రాల్లో ఆధార్‌ నమోదు ప్రక్రియ జరిగేది. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్‌ నమోదు చేయాలని ఉడాయ్‌ నిబంధన విధించడంతో ప్రైవేటు కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి.

ఆధార్‌కు అంతరాయం!
ఆధార్‌ సేవలు లేక వెలవెలబోతున్న మీసేవా కేంద్రం

  ప్రైవేటు ప్రదేశాల్లో సేవలకు అనుమతి నో

 ప్రభుత్వ కార్యాలయాల్లో కానరాని వసతులు

యంత్రాంగం తీరుపై ‘ఉడాయ్‌’ ఆగ్రహం

రెండు వారాలుగా సేవలు నిలిపివేత

(చీపురుపల్లి)

జిల్లాలో ‘ఆధార్‌’ నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. రెండు వారాలుగా సేవలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. ఇప్పటివరకూ ప్రైవేటు కేంద్రాల్లో ఆధార్‌ నమోదు ప్రక్రియ జరిగేది. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్‌ నమోదు చేయాలని ఉడాయ్‌ నిబంధన విధించడంతో ప్రైవేటు కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్‌ నమోదుకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. వసతులు లేక ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. 

మీసేవ కేంద్రాల్లో 2013 నుంచి ఆధార్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు. జిల్లావ్యాప్తంగా 450 మీ సేవా కేంద్రాలుండగా.. 27 కేంద్రాలను ఆధార్‌ సేవలకు అనుమతిచ్చారు. అందులో సాంకేతిక కారణాలతో 12 కేంద్రాలు నిలిచిపోయాయి. మరో 12 కేంద్రాలను ప్రైవేట్‌ వ్యక్తులు నిర్వహిస్తున్నారు. మూడు ఏపీ ఆనలైన కేంద్రాల్లో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్‌ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌) ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో మాత్రమే ఆధార్‌ కేంద్రాలు నడపాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ యంత్రాంగాలకూ వర్తమానం పంపించింది. ఆధార్‌ నమోదు కేంద్రాలు నడిపేందుకు సర్కారు కార్యాలయ ఆవరణల్లోనే అవసరమైన వసతిని కల్పించాలని సూచించింది. ఈ ఆదేశాలు వచ్చి ఏడాది గడిచినా కార్యాలయాల అవరణల్లో వసతి కల్పించడానికి ప్రభుత్వ ఆధికారులు చొరవ చూపించడం లేదు. దీనిని సీరియస్‌గా పరిగణించిన ఉడాయ్‌ ఆధార్‌ సేవల్ని ఈ నెల మొదటి వారంలోనే నిలిపివేసింది.


నిర్వాహకుల అభ్యంతరం

ఇది ఇలా ఉండగా, ఆధార్‌ సెంటర్లు నడుపుతున్న వారు ఉడాయ్‌ నిర్ణయానికి అనుకూలంగానే ఉన్నప్పటికీ, సర్కారు కార్యాలయాల ఆవరణలో ఆధార్‌ సెంటర్లను నడపడం వల్ల లబ్ధిదారులకు కలిగే అదనపు ప్రయోజనమేమీ లేదంటున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో తాగునీరు, వసతి, ఉండాలని, అంత వెసులుబాటు అక్కడ లేదన్నది వారి అభిప్రాయం. చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు నడపడానికే కష్టంగా ఉన్న నేపథ్యంలో ఆధార్‌ సెంటర్ల ఏర్పాటు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. మీసేవా కేంద్రాలు కూడా రెండుగా చీలి పోవాల్సి వస్తుందని ఈ రెండింటినీ రెండు వేర్వేరు ప్రదేశాల్లో నడిపించాలంటే రెట్టింపు సామగ్రి, సిబ్బంది ఉండాలని అంటున్నారు. కాగా, జిల్లాలోని ఆధార్‌ నమోదు కేంద్రాలు మూత పడిపోవడంతో వివిధ సేవలకు బ్రేక్‌ పడింది. పుట్టిన తేదీలు, ఇంటి పేర్లలో చేర్పులు, మార్పులు వంటి పలు సేవలందక అవసరార్ధులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఉడాయ్‌ పునరాలోచించుకోవాలి

ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఆధార్‌ కేంద్రాలు నడపడం వల్ల అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. ఇప్పుడందుతున్న నిరంతర సేవలకు అంతరాయం కలుగుతోంది. ప్రైవేటు ప్రదేశాల్లో ఈ సెంటర్లు నడుపుతుండడం వల్ల నిర్ణీత వేళల్లోనే కాకుండా నిరంతరం సేవలందించగలుగుతున్నాం. ఉడాయ్‌ పునరాలోచించాలని మా విన్నపం.

                                                సర్విశెట్టి వెంకటేశ్వరావు, జిల్లా అధ్యక్షుడు, మీ సేవ నిర్వహకుల సంఘం. 


Updated Date - 2020-11-29T05:19:03+05:30 IST