అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

ABN , First Publish Date - 2022-08-10T04:20:36+05:30 IST

ద్విచక్ర వాహనాలను చోరీ చేసే అంతర్రాష్ట్ర ముఠా గుట్టును మదనపల్లె టూటౌన్‌ పోలీసులు రట్టు చేశారు.

అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు

రూ.30 లక్షల విలువ చేసే 25 వాహనాలు స్వాధీనం

ఇద్దరు నిందితుల అరెస్లు


మదనపల్లె క్రైం, ఆగస్టు 9: ద్విచక్ర వాహనాలను చోరీ చేసే అంతర్రాష్ట్ర ముఠా గుట్టును మదనపల్లె టూటౌన్‌ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరి నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.30 లక్షల విలువ చేసే 25 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. మంగళవారం టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా రామకృష్ణహెగ్డే కాలనీకి చెందిన జోగి బంగారప్ప (25), ఇతడి స్నేహితుడు కోలార్‌ టౌన్‌ బొమ్మినగర్‌కు చెందిన ఫైరోజ్‌ (25)లు గుజిరీ వ్యాపారం చేస్తుండేవారు. ఇందులో బంగారప్ప పాత నేరస్థుడు. అయితే విలాసాలకు అలవాటుపడి ద్విచక్రవాహనాల చోరీని వృత్తిగా ఎంచుకున్నాడు. కాగా గతంలో కోలార్‌ టౌన్‌ గల్‌పేట, బంగారుపేట పోలీ్‌సస్టేషన్ల పరిధిలో పలు వాహనాలను చోరీ చేసి జైలుకు వెళ్లొచ్చాడు. ఈ నేపథ్యంలో బంగారప్ప వాహనాలను చోరీ చేసి తీసుకొస్తే ఫైరోజ్‌ వాటి స్పేర్‌పార్ట్స్‌ను విడదీసి విక్రయించేవాడు. దీంతో ఇద్దరూ జల్సాలు చేసేవారు. వాహన తనిఖీల్లో భాగంగా నిందితులు ఇటీవల మదనపల్లె టూటౌన్‌ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా చోరీ గుట్టు రట్టయింది.  కాగా నిందితులు కొద్దిరోజులుగా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఇళ్ల వద్ద, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, జనాభా రద్దీ ప్రాంతాల్లో నిలిపి ఉంచిన వాహనాలను చోరీ చేసేవారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మంగళవారం నిందితులను రిమాండుకు తరలించి రూ.30 లక్షల విలువ చేసే వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. కాగా కేసు ఛేదనకు కృషి చేసిన సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ చంద్రమోహన్‌, సిబ్బందిని అభినందించి నగదు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది శంకర, మునిరత్నం, రెడ్డిప్రసాద్‌, అబ్దుల్లా, భద్రానాయక్‌, రెడ్డిశేఖర్‌ పాల్గొన్నారు.


వాహనాలకు వీల్‌లాక్‌ ఏర్పాటు చేసుకోవాలి

- కె.రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె.

ద్విచక్ర వాహన చోదకులు తమ వాహనాలకు వీల్‌లాక్‌ ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పాటు జీపీఆర్‌ఎస్‌, సెక్యూరిటీ అలారం ఏర్పాటు చేసుకుంటే చోరీలు జరగవు. ముఖ్యంగా చోదకులు ఎక్కడబడితే అక్కడ వాహనాలను పార్కింగ్‌ చేయడం, తాళం వేసేది మరచిపోవడం తదితర కారణాలతో చోరీలు జరుగుతున్నాయి. వాహన చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 



Updated Date - 2022-08-10T04:20:36+05:30 IST