లేనిది ఉన్నట్టు.. అంతా ‘మనీ’కట్టు!

ABN , First Publish Date - 2020-12-02T05:16:09+05:30 IST

అప్పటి దాకా అంతంతమాత్రం విలువ చేసిన భూము ల ధరలు భద్రాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌ నిర్మాణంతో అమాంతం పెరిగాయి. మరోవైపు ప్రభుత్వం ప్రతీ స్థలాన్ని ఆన్‌లైన్‌ చేసి యజమానులకు సర్వహక్కులు కల్పించేందుకు సిద్ధమైంది. ఇదే అదునుగా పంచాయతీ అధికారులు దర్జాగా దందాకు తెరలేపారు. ఒక్కో ఖాళీ స్థలానికి రూ. ఐదువేలు ధర నిర్ణయించారు. ఇలా రూ.లక్షల్లో వసూలు చేశారు. ఈ వ్యవహారంపై కొందరు ‘ఆంధ్రజ్యోతి’ని ఆశ్రయించగా.. క్షేత్రస్థాయిలో పరిశీలించగా విస్తుగొలిపే వాస్తవాలు బయటకువచ్చాయి.

లేనిది ఉన్నట్టు.. అంతా ‘మనీ’కట్టు!
ఇంటి పన్ను జారీచేసి దమ్మక్కపేటలోని ఓ ఖాళీ స్టలం

ఖాళీ స్థలాలకు ఇంటిపన్ను రశీదులు

దమ్మక్కపేటలో అధికారుల లీలలు

ఒక్కో ఖాళీస్థలానికి రూ. ఐదువేల వసూలు

ప్రజలకు మాత్రం రూ. వందల్లో రశీదులు

మణుగూరురూరల్‌, డిసెంబరు1: అప్పటి దాకా అంతంతమాత్రం విలువ చేసిన భూము ల ధరలు భద్రాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌ నిర్మాణంతో అమాంతం పెరిగాయి. మరోవైపు ప్రభుత్వం ప్రతీ స్థలాన్ని ఆన్‌లైన్‌ చేసి యజమానులకు సర్వహక్కులు కల్పించేందుకు సిద్ధమైంది. ఇదే అదునుగా పంచాయతీ అధికారులు దర్జాగా దందాకు తెరలేపారు. ఒక్కో ఖాళీ స్థలానికి రూ. ఐదువేలు ధర నిర్ణయించారు. ఇలా రూ.లక్షల్లో వసూలు చేశారు. ఈ వ్యవహారంపై కొందరు ‘ఆంధ్రజ్యోతి’ని ఆశ్రయించగా.. క్షేత్రస్థాయిలో పరిశీలించగా విస్తుగొలిపే వాస్తవాలు బయటకువచ్చాయి.

ఖాళీస్థలానికి రూ. ఐదువేలు

మణుగూరు మండలంలోని దమ్మక్కపేట పంచాయతీలో పక్కా ఇళ్లే కాదు.. కనీసం పూరిగుడిసె లేకపోయినా సరే.. ఖాళీ స్థలం ఉందా.. అయితే రూ.5వేలు ఇస్తే చాలు ఇంటిపన్ను ఇస్తారు. ఇలా పంచాయతీ పరిధిలో ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందల సంఖ్యలోనే ఖాళీ స్థలాలకు లక్షల్లో వసూళ్లు చేసి ఇంటి పన్ను రశీదులను జారీ చేశారన్న విమర్శలు విరివిరిగా వినిపిస్తున్నాయి.. ఇందులో గమ్మత్తు ఏంటంటే రూ.ఐదు వేలు తీసుకు న్న పంచాయతీ అధికారులు కేవలం రూ.500 లోపే ఇంటి పన్ను చెల్లించినట్లుగా ఖాళీ స్థలాల యజమానికి రశీదులను అందజేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏడాది క్రితం నూతన పంచాయతీలను ఏర్పాటు చేసిన క్రమంలో చిక్కుడుగుంట గ్రామాన్ని కలుపుకోని దమ్మక్కపేటను పంచాయతీగా ఏర్పాటు చేశారు. నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో పాలన కొనసాగుతుండగా.. ప్రభుత్వ ఇటీవల ప్రతీ ఇంటికి సర్వహక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో ఇళ్లను ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. 

భూముల ధరలకు రెక్కలు

పంచాయతీలో భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఉండడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. పలు పట్టణ ప్రాంతాలకు చెందిన వారు ఇబ్బముబ్బడిగా ఖాళీ ఇంటి స్థలాలను కొనుగోలు చేశారు. భూములు కొనుగోలు చేసిన వారు తమ స్థలాలను క్రమబద్ధికరించుకునేందుకు పలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే అదనుగా భావించిన అధికారులు తాజాగా ఖాళీ స్థలానికి కూడా ఇంటి ప న్ను జారీ చేసి దాంతో పాటు లేని ఇంటికి హక్కులు కల్పిస్తామని అధికారులు నమ్మబలికినట్లు తెలిసింది. దీంతో అమాయక ప్రజలు అధికారుల మాటలు నమ్మి రూ.వేలల్లో ముట్టజెప్పి ఖాళీ స్థలంలో ఇళ్లున్నట్లుగా రశీదులు పొంది ఆన్‌లైన్‌ చేయించారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయమై ఆంధ్రజ్యోతి మణుగూరు ఎంపీవోను ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.


Updated Date - 2020-12-02T05:16:09+05:30 IST