నేటి నుంచి ఇంటింటా ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2022-01-21T05:47:37+05:30 IST

జిల్లాలో శుక్రవారం నుంచి 5 రోజుల పాటు ఇంటింటా ఆరోగ్యం (ఫీవర్‌ సర్వే) కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

నేటి నుంచి ఇంటింటా ఫీవర్‌ సర్వే
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు

- కొవిడ్‌ ముందు జాగ్రత్త చర్యలపై మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాలి : కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు


మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), జనవరి 20 : జిల్లాలో శుక్రవారం నుంచి 5 రోజుల పాటు ఇంటింటా ఆరోగ్యం (ఫీవర్‌ సర్వే) కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌లు హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ జిల్లా, మండల స్థాయి, ప్రత్యేక అధికారులు, ఇతర అధికారులతో వీడి యో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఒమైక్రాన్‌తో కూడిన కొవిడ్‌ కేసులు పెరుగు తున్న దృష్ట్యా అధికారులు, సిబ్బంది అందరు మరోసారి శ్రద్ధ వహించి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,89,319 గృహాల్లో ఫీవర్‌ సర్వే కార్యక్రమాన్ని మరోసారి నిర్వహించాలన్నారు. ఈ ప్రక్రియ 5 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి మల్టీ డిసిప్లినరీ బృందాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కనీసం 50 గృహాలు కవరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా కొవిడ్‌ పాజిటివ్‌ ఉంటే ఐసో లేషన్‌ కిట్లు ఇచ్చి ఎలా వాడాలో చెప్పాలని సూచించారు. జిల్లాలో 40 వేల హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లు సిద్దంగా ఉన్నాయని, కొవిడ్‌ మందులకు, పరీక్షల కిట్ల కు కొరత లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 550 కొవిడ్‌ పడకలు, ఆక్సిజన్‌ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారా మారావు, డీఎం హెచ్‌ఓ డాక్టర్‌ కృష్ణ, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ రమేష్‌, డీఐవో డాక్టర్‌ శంకర్‌, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు, ఎంపిఓలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:47:37+05:30 IST