‘ఇంటింటికీ’ రేషన్‌ కుదరదు

ABN , First Publish Date - 2021-11-28T07:39:00+05:30 IST

‘ఇంటింటికీ’ రేషన్‌ కుదరదు

‘ఇంటింటికీ’ రేషన్‌ కుదరదు

సరుకులు అందించే బాధ్యత డీలర్లదే

ఎండీయూ వ్యవస్థ రద్దు కోసం ఉద్యమిస్తాం

న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతాం

ఆలిండియా డీలర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి బిశ్వంభర బసు


విజయవాడ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రేషన్‌ డీలర్ల పాత్రను నామమాత్రం చే స్తూ ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్‌ డిస్పెన్సివ్‌ యూనిట్‌ (ఎండీయూ) వ్యవస్థను తక్షణం రద్దు చేయాలని ఆల్‌ ఇండియా ఫెయిర్‌ ప్రైయిస్‌ షాప్‌ డీలర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి బిశ్వంభర బసు డిమాండ్‌ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో జాతీయ ఆహారభద్రతా చట్టానికి తూట్లు పొడిచేలా విధానాలు ఉన్నాయని అన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ను చూసి దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా రేషన్‌ డోర్‌ డెలివరీ అని ముందుకొస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయగా కేంద్రం సుప్రీంకోర్టులో కేసు వేసిందన్నారు. శనివారం విజయవాడలో జాతీయ ఫెడరేషన్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని నాలుగు రేషన్‌ డీలర్ల సంఘాలు సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా బిశ్వంభర బసు మాట్లాడుతూ.. డీలర్‌కు ఇచ్చే కమీషన్‌లోనే ఖర్చులు కూడా ఉంటాయని, ఎండీయూ వ్యవస్థలో ఖర్చులతోపాటు జీతం కూడా ఇవ్వడం ఆహారభద్రతా చట్టం నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. కమీషన్‌తోపాటు డీలర్‌కు వచ్చే గోనె సంచులను కూడా ప్రభుత్వం  బలవంతంగా తీసుకుంటోందని, కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యమ కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఏపీలోని ఎండీయూ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇస్తామని, డిసెంబరు 10న అన్ని జిల్లాల్లో సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తామని, డిసెంబరు 17న చలో విజయవాడ నిర్వహిస్తామని వివరించారు. ఈ వ్యవస్థపై న్యాయ నిపుణల సలహా తీసుకుని హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు.

Updated Date - 2021-11-28T07:39:00+05:30 IST