భారత సైన్యంలోకి..అగ్ని వీరులు!

ABN , First Publish Date - 2022-04-08T08:33:05+05:30 IST

ఆర్మీ యూనిఫాం వేసుకుని, సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం గస్తీకాయడం ఓ అదృ ష్టం! అలాంటి అవకాశం అందరికీ రాదు! లక్షల మంది ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొంటే వేల మందికే జవాన్‌ గా అవకాశం దొరుకుతుంది! కానీ, యువతకు ఆర్మీలో చేరాలనేది ఓ సాహసం..

భారత సైన్యంలోకి..అగ్ని వీరులు!

‘అగ్నిపథ్‌’ ద్వారా రిక్రూట్‌మెంట్లు.. మూడేళ్ల పాటు సైన్యంలో జవాన్‌గా చాన్స్‌


ఖాళీల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం!

తర్వాత కార్పొరేట్‌ కొలువుల్లో ప్రాధాన్యం

సర్కారీ నియామకాల్లో అదనపు అర్హత!


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: ఆర్మీ యూనిఫాం వేసుకుని, సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం గస్తీకాయడం ఓ అదృ ష్టం! అలాంటి అవకాశం అందరికీ రాదు! లక్షల మంది ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొంటే వేల మందికే జవాన్‌ గా అవకాశం దొరుకుతుంది! కానీ, యువతకు ఆర్మీలో చేరాలనేది ఓ సాహసం.. ఓ కల! అలాంటి యువకుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్‌’ పేరుతో ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ’ పథకాన్ని ప్రకటించేందుకు సిద్ధమైంది. దివంగ త చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆలోచనలతో పురుడుపోసుకుని, ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా స్వచ్ఛందంగా సైన్యంలో సేవలందించేందుకు యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్యంలో మూడేళ్ల పాటు సేవలందించే అవకాశం కల్పిస్తారు. అగ్నిపథ్‌లో సైన్యంలో చేరే జవాన్లను ‘అగ్ని వీర్‌’గా పిలుస్తారు. వీరు జనరల్‌(యుద్ధ సైనికులు), టెక్నికల్‌ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.


ఖాళీల నేపథ్యం.. బడ్జెట్‌ భారం తక్కువ

పార్లమెంట్‌లో కేంద్రం ఇటీవల ప్రకటించిన గణాంకాల మేరకు రక్షణ శాఖలో 2.47 లక్షల ఖాళీలున్నాయి. వీటిలో 1.25 లక్షలకు పైగా ఆర్మీలోనే ఖాళీలున్నాయని, వాటిలో సింహభాగం జవాన్‌ పోస్టులేనని అంచనా. నిజానికి 2020లోనే నాటి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ వివిధ దేశాల్లో స్వల్పకాలిక ఆర్మీ రిక్రూట్‌మెంట్లపై అధ్యయనం చేసి మూడేళ్ల ‘అగ్నిపథ్‌’ పథకాన్ని ప్రతిపాదించారు. గత రెండేళ్లలో కొవిడ్‌తో త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్లు జరగలేదు. రిటైర్‌మెంట్లు మాత్రం భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్లు నిర్వహించి, నియామకాలు చేపట్టినా జీతభత్యాలు, అలవెన్సులు, రిటైర్మెంట్‌ ప్రో త్సాహకాలు.. ఇలా బడ్జెట్‌పై భారం పడే ప్రమాదం ఉంది. దీంతో త్రివిధ దళాల్లో స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్‌గా ‘అగ్నిపథ్‌’ ప్రకటనపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫలితంగా వేల కోట్ల నిధులు ఆదా అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా కీలకమైన రక్షణ శాఖలో ఖాళీలను భర్తీ చేసినట్లవుతుంది.


తదనంతర ప్రయోజనాలు

సైన్యం/త్రివిధ దళాల్లో మూడేళ్ల పాటు సేవలందించిన యువకులకు ఇతర ప్రభుత్వోద్యోగాలు, కార్పొరేట్‌ కొలువుల్లో ప్రాధాన్యత ఉంటుంది. పలు కార్పొరేట్‌ సంస్థలు ఇప్పటికే దీనిపై కేంద్రానికి హామీ ఇచ్చినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మూడేళ్ల సేవల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఆయా విభాగాల్లో ‘శాశ్వత’ ఉద్యోగి/జవానుగా కొనసాగించే అవకాశాలుంటాయి. ఇప్పటికే త్రివిధ దళాల్లో అధికారి స్థాయిలో ఈ తరహా నియామకాలు ఉన్నాయి. ‘షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌’ ద్వారా అధికారుల నియామకాలు జరుగుతాయి. వారు 3 లేదా 5 ఏళ్లకు కాంట్రాక్టుపై త్రివిధ దళాల్లో పనిచేస్తారు. తర్వాత ప్రతిభను బట్టి పూర్తిస్థాయి సర్వీ్‌స లో కొనసాగుతారు. అగ్నిపథ్‌ పథకాన్ని కూడా ఇలాగే కొనసాగించే అవకాశాలున్నాయని అంచనా. వీరికి నిర్ణీత కాలం వరకు ‘జాతీయ పెన్ష న్‌ పథకం’ అమలు, వైద్య సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు కల్పించాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. భారత్‌లో బ్రిటిష్‌ హయాంలో ఇలాంటి రిక్రూట్‌మెంట్లు ఉండేవి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్‌ అధికారులు ‘సందురుస్త్‌’ లేదా జాయింట్‌ సర్వీస్‌ వింగ్‌(జేఎ్‌సడబ్ల్యూ) పేరుతో యువతను ఇలా తాత్కాలిక ప్రాతిపదికన సైన్యంలో నియమించుకునేది. 1999 కార్గిల్‌ యుద్ధ సమయంలో మూడేళ్లలోపు సీనియారిటీ ఉన్న జవాన్లే చురుకుగా వ్యవహరించారనేది జనరల్‌ బిపిన్‌ రావత్‌ భావనగా తెలుస్తోంది. అగ్నిపథ్‌లోనూ మూడేళ్ల కాలా న్ని నిర్ణయించడం వల్ల ఎప్పటికప్పుడు సైన్యంలో యువరక్తం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.


15 దేశాల్లో సైన్యంలో సేవలు తప్పనిసరి

కొన్ని దేశాల్లో సైన్యంలో యువత సేవలందించడం తప్పనిసరి. 1970కి ముందు వరకు చాలా దేశాల్లో నిర్బంధ ఆర్మీ రిక్రూట్‌మెంట్లు ఉండేవి. ఆ తర్వాత ఇజ్రాయెల్‌, బెర్ముడా, బ్రెజిల్‌, సైప్రస్‌, గ్రీస్‌, ఇరాన్‌, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సింగపూర్‌, స్విట్జర్లాండ్‌, థాయ్‌లాండ్‌, టర్కీ, యూఏఈ దేశాల్లో మాత్రమే ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఉత్తరకొరియా, ఇజ్రాయెల్‌లో మాత్రం యువతులకూ సైన్యంలో సేవలందించడం తప్పనిసరి.




ఉద్యోగాలిచ్చేందుకు సిద్ధం

అగ్నిపథ్‌లో భాగంగా సైన్యంలో సేవలందించే యువతకు ఉద్యోగాలిచ్చేందుకు మహీంద్రా గ్రూప్‌ సిద్ధంగా ఉంది. యూనిఫాంలో దేశానికి సేవలందించడం యువతకు గర్వకారణం. వారికి అదో థ్రిల్‌.. ఓ సాహసం.

-ఆనంద్‌ మహీంద్రా



కార్పొరేట్‌ సంస్థలు కళ్లకద్దుకుని నియమించుకుంటాయి

సైన్యంలో పనిచేసిన యువతను కార్పొరేట్‌ సంస్థలు కళ్లకద్దుకుని నియమించుకుంటాయి. సైన్యంలో పనిచేసిన వారి జీవితం క్రమశిక్షణతో ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. యువతకు ఆదర్శంగా నిలుస్తారు. వారిలో ఆత్మస్థైర్యం, మానసిక స్థితి దృఢంగా ఉంటుంది. అందుకే కార్పొరేట్‌ సంస్థల్లో హెచ్‌ఆర్‌ మేనేజర్లలో 90ు మాజీ సైనికులే.

- శ్రీనేశ్‌ కుమార్‌,  

ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి


Updated Date - 2022-04-08T08:33:05+05:30 IST