మత్తెక్కిస్తున్న నల్లమందు

ABN , First Publish Date - 2021-09-17T06:25:09+05:30 IST

జిల్లాలో నల్లమందు అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. మిర్యాలగూడ డివిజన్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పొరుగు రాష్ట్రాల కూలీలు వలస వస్తున్నారు. వీరితోపాటు డ్రగ్స్‌ జిల్లాకు సరఫరా అవుతున్నాయి.

మత్తెక్కిస్తున్న నల్లమందు
పోలీసులు స్వాధీనం చేసుకున్న నల్లమందు ప్యాకెట్లు

పోలీసులకు పట్టుబడ్డ పశ్చిమబెంగాల్‌ యువత

బెంగాల్‌ రాష్ట్రం నుంచి గుట్టుగా సరఫరా

ఓపీయం గ్రాము ధర రూ.3వేలు

దామరచర్ల పరిసరాల్లో జోరుగా విక్రయాలు

మిర్యాలగూడ అర్బన్‌, సెప్టెంబరు 16: జిల్లాలో నల్లమందు అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. మిర్యాలగూడ డివిజన్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పొరుగు రాష్ట్రాల కూలీలు వలస వస్తున్నారు. వీరితోపాటు డ్రగ్స్‌ జిల్లాకు సరఫరా అవుతున్నాయి. ఇప్పటికే రైస్‌ ఇండస్ట్రీ్‌సలో పనిచేస్తున్న బీహార్‌ కార్మికులు వారి రాష్ట్రంలో లభించే మత్తుపదార్ధాలను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బీహార్‌ రాష్ట్రం నుంచి జిల్లాలోని రైస్‌మిల్లులకు ఆ ప్రాంత లారీల్లో ధాన్యం వస్తోంది. ఈ లారీల్లోనే బీహార్‌ కార్మికులు మత్తుకోసం ఉపయోగించే ఆకు, ప్రత్యే క డబ్బాలో సున్నం దిగుమతి అవుతున్నట్టు సమాచారం. కొన్ని సందర్భాల్లో కార్మికులు గంజాయి సైతం వాడుతున్నట్టు వినికిడి. దామరచర్ల మండలంలో యాదాద్రి పవర్‌ప్లాంటు నిర్మాణంలో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం ముర్షిదాబాద్‌ జిల్లాకు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. సుమా రు వంద మందికిపైగా బెంగాల్‌ కార్మికులు ఇక్కడ ఉన్నారు. వీరిలో రెండుపదుల వయసు దాటిన యువకులు ఎక్కువ మంది ఉండగా, వీరిలో కొందరు మత్తుపదార్థాలకు అలవాటుపడినట్లు తెలుస్తోంది. గంజాయి వడకాన్ని తలదన్నేలా నల్లమందు విక్రయాలు చాపకింది నీరులా విస్తరిస్తున్నాయి. రెండు తెలుగురాష్ట్రాలకు సరిహద్దుప్రాంతమైన వాడపల్లి పరిసరాల్లో పనిచేస్తున్న బెంగాలీ కార్మికులు నల్లమందు సరఫరాలో కీలక పాత్రపోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

గ్రాము ధర రూ.3వేలు

నల్లమందు (ఓపీయం) వాడకం చాలా ఖరీదైనది. ఒక గ్రాము నల్లమందుతో ఐదారుగురు మత్తును ఆస్వాదించవచ్చు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో దీని వినియోగం అధికంగా ఉన్నట్టు సమాచారం. ఆ రాష్ట్రంలో రూ.800కు గ్రాము నల్లమందు లభిస్తోందని తెలిసింది. దీని వాడకంతో రోజంతా మత్తుగా ఉంటుంది కాబట్టి దినసరి కార్మికులు ఎక్కువగా వినియోగిస్తున్నట్టు వినికిడి. యాదాద్రి పవర్‌ప్లాంటు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న పశ్చిమబెంగాల్‌ కార్మికుల్లో ప్రతినెలా కొందరు స్వస్థలాలకు వెళ్లివస్తుంటారు. రైలుమార్గంలో తిరిగొచ్చే సమయంలో నల్లమందు అక్రమ రవాణా సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్లాంటులో పనిచేస్తున్న కూలీల సంబంధీకులతోపాటు, కొందరు యువత అఽధికారుల కళ్లుగప్పి రైలు, రోడ్డుమార్గంలో నల్లమందు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఒక గ్రాము ప్యాకెట్‌ నల్లమందును రూ.3వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.

పోలీసులకు చిక్కిన బెంగాల్‌ యువకులు

నల్లమందు వినియోగిస్తూ పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వలస కార్మికులను ఈనెల 14న మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని సీతారాంపురంకాలనీ శివారులో చెట్లపొదల వెంట అనుమానాస్పదంగా సంచరించడాన్ని పెట్రోలింగ్‌ పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. దీంతో వారివద్ద సుమారు 18గ్రాముల నల్లమందు (ఓపీయం) లభించింది. పట్టుబడ్డ యువకులు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని ముర్షిదాబాద్‌ జిల్లా మహ్మదాపూర్‌కు చెందిన మోహిదుల్‌ మండల్‌, తహిదుల్‌మండల్‌గా గుర్తించారు. వీరిద్దరు సోదరులు. ఇరువురు దామరచర్ల మండలంలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్‌ప్లాంటులో మేస్త్రీలుగా పనిచేసేందుకు జిల్లాకు వలస వచ్చినట్లు సీఐ సురేష్‌ తెలిపారు. నిందితుల నుంచి నల్లమందు పీల్చేందుకు ఉపయోగించే సిల్వర్‌పేపర్‌, చుట్టగా మడిచిన రూ.10 నోటు స్వాధీనం చేసుకున్నారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా యాదాద్రి పవర్‌ప్లాంట్‌ పరిసరాల్లో నల్లమందు విక్రయాలు కొనసాగుతున్న విషయం పోలీస్‌ విచారణలో వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు యువకులు నల్లమందు అక్రమ రవాణా చేస్తూ ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కూలీలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నల్లమందు వాడకం విస్తరించకముందే పోలీస్‌ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది.

తనిఖీలు ముమ్మరం చేస్తాం : వెంకటేశ్వరరావు, డీఎస్పీ

మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో నల్లమందు వినియోగిస్తున్నట్టు సమాచారం ఉంది. తాజాగా పట్టుబడ్డ ఇద్దరు పశ్చిమబెంగాల్‌ యువకుల వద్ద నల్లమందు లభించడంతో పోలీస్‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ప్రధానంగా యాదాద్రి పవర్‌ప్లాంటు నిర్మాణ పరిసర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేస్తాం. మత్తుపదార్ధాల వినియోగాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - 2021-09-17T06:25:09+05:30 IST