పరిచయం... ప్రేమ.. పరిణయం!

ABN , First Publish Date - 2021-02-03T05:30:00+05:30 IST

చెల్లి పుట్టినరోజుకు మొక్కను కానుకగా ఇవ్వాలనుకున్న సూర్య నర్సరీకి వెళతాడు. అక్కడ ఓ అమ్మాయి అతడికి తారసపడుతుంది. రకరకాల మొక్కలు... వాటికి విరబూసిన పువ్వులు చూసి ఆమె ఆహ్లాదంలో మునిగిపోతే...

పరిచయం... ప్రేమ.. పరిణయం!

చెల్లి పుట్టినరోజుకు మొక్కను కానుకగా ఇవ్వాలనుకున్న సూర్య నర్సరీకి వెళతాడు. అక్కడ ఓ అమ్మాయి అతడికి తారసపడుతుంది. రకరకాల మొక్కలు... వాటికి విరబూసిన పువ్వులు చూసి ఆమె ఆహ్లాదంలో మునిగిపోతే... ఆమెను చూస్తూ అతడు మైమరిచిపోతాడు. ఆపై ఇద్దరూ ఒకరికి ఒకరు ఎదురవుతారు. తన కళ్లల్లో పరవశం... అతడి కళ్లల్లో తెలియని ఆనందం! ఏదో చెప్పబోయేలోపు... అతడి మనసును గత అనుభవం ఒకటి తరుముతుంటుంది. ‘నన్ను వదిలేయ్‌ సూర్యా. నన్ను మరిచిపో. బాధైనా ఏదైనా ఇక్కడే భరిస్తాను’... ప్రేయసి వద్దని వెళ్లిపోతూ పేల్చిన ఆ మాటల తూటాలు అతడి గిర్రున తిరిగాయి. ‘అంత దూరం నుంచి వచ్చి ఇంత దగ్గర్లో మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయావేంటి? నాతో మాట్లాడాలని లేదా? ఏదైనా మాట్లాడచ్చు కదా’... కన్నీరు పెట్టుకుంటుంది తను.

 

‘నాలో నేను నాతో నేను మాట్లాడుకున్న ప్రతిక్షణం నేను తలుచుకున్నది నిన్నే సంధ్య. అలాంటిది నువ్వే వచ్చి అడిగితే మాట్లాడకుండా ఎలా ఉండగలను?’. 

‘మరెందుకని మాట్లాడడంలేదు సూర్య?’ 

‘మనకు ఇష్టమైనవాళ్లతో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత దగ్గరవుతాము. ఎంత దగ్గరైతే అంత దూరమవుతాము. ఆ బాధ నువ్వు భరించినా నేను మోయలేను సంధ్య’. 

‘ఇంతలా ప్రేమించినవాడివి ఎలా వదిలేశావు’ అడుగుతుంది సంధ్య. ఇద్దరూ తమ తొలి పరిచయాన్ని, అది ప్రేమగా మారిన తీరుని గుర్తు చేసుకొంటారు. చెల్లితో గుడికి వెళ్లినప్పుడు మొదటిసారి సంధ్యను చూస్తాడు సూర్య. తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అతడి స్నేహితుడి సాయంతో వెంటనే ప్రపోజ్‌ చేస్తాడు. ‘మీ మీద నాకు ప్రస్తుతానికి అలాంటి ఫీలింగ్స్‌ లేవు’ అంటుంది సంధ్య. 

ఓ షాపింగ్‌ మాల్‌... సూర్య తన చెల్లితో షాపింగ్‌కు వెళతాడు. అక్కడ సంధ్య కనిపిస్తుంది. తనను వదిన అని పిలుస్తుంది సూర్య చెల్లి. ‘ఏంటి ఎప్పుడు చూసినా మీ చెల్లి నన్ను వదిన వదిన అని పిలుస్తుంది’... సూర్యను చికాకు పడ్డట్టు అడుగుతుంది సంధ్య. ‘తన తరుఫున సారీ’. 


‘పర్లేదులే... ఆ సౌండ్‌ వినడానికి బాగుంది. పిలవనీ’... సంధ్య కొంటెగా చెబుతుంది. ‘జీవితంలో అంతా బాగుందనుకున్నప్పుడు ఆ వెంటే బాధ కూడా ఉంటుందని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు’... విరహంలో సూర్య తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తాడు. సంధ్య తల్లితండ్రులు అంతరాలు చూపి ఇద్దరినీ విడదీస్తారు. ‘పెద్దలను కాదని నేను నీతో రాలేను. వదిలెయ్యి సూర్యా’... సంధ్య నోట ఆ మాట రాగానే నిశ్చేష్టుడవుతాడు అతడు. కట్‌ చేస్తే మళ్లీ ఇద్దరూ కలవడం ఆ నర్సరీలోనే! తరువాత ఏమైంది? తెలియాలంటే ‘పరిచయం ప్రేమ పరిణయం’ లఘుచిత్రం చూడాల్సిందే. గౌరీనాయుడు, ఆకాంక్షల నటన, కోట సాయికుమార్‌ దర్శకత్వ ప్రతిభ అద్భుతం. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్‌. యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పటికి నాలుగున్నర లక్షల మందికి పైగా వీక్షించారు.

Updated Date - 2021-02-03T05:30:00+05:30 IST