తెలంగాణ మూలాలు పరిచయం! గ్రూప్ 1 అభ్యర్థులకు!

ABN , First Publish Date - 2022-06-27T21:15:10+05:30 IST

గతానికి, వర్తమానానికి మధ్య జరిగే అంతులేని సంభాషణయే చరిత్ర’ అని ఇ.హెచ్‌.కార్‌ పేర్కొన్నాడు. మానవుడు సాధించిన ప్రగతే చరిత్రకు కొలమానంగా గుర్తించబడుతుంది. పోటీ..

తెలంగాణ మూలాలు పరిచయం! గ్రూప్ 1 అభ్యర్థులకు!

తెలంగాణ చరిత్ర - సంస్కృతి - ఉద్యమం

తెలంగాణ మూలాలు... అధ్యయన విధానం!


‘గతానికి, వర్తమానానికి మధ్య జరిగే అంతులేని సంభాషణయే చరిత్ర’ అని ఇ.హెచ్‌.కార్‌  పేర్కొన్నాడు. మానవుడు సాధించిన ప్రగతే చరిత్రకు కొలమానంగా గుర్తించబడుతుంది. పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో ప్రాథమిక అధ్యయనం చరిత్ర నుంచే ఆరంభమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో విడుదలవుతున్న ప్రతి నోటిఫికేషన్‌ సిలబ్‌సలో ‘తెలంగాణ చరిత్ర - సంస్కృతి- ఉద్యమం’ అతి కీలకమైన అంశాలు. పరీక్షల విజయానికి సంపూర్ణంగా తొడ్పడే అంశాలు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మూలాలను పరిచయం చేసే ప్రయత్నం ఈ వ్యాసం చేస్తుంది.


చరిత్ర రచనకు రెండు ప్రాథమిక ఆధారాలు ఉంటాయి. మొదటిది పురావస్తు ఆధారాలు, రెండోది సాహిత్య ఆధారాలు. పురావస్తు ఆధారాలు(మెటీరియల్‌) మొదటి కోవకు చెందగా, రాతపరమైన ఆధారాలు రెండో అంశానికి సంబంధించినవి. తెలంగాణ రచనకు పై రెండు అంశాలకు సంబంధించిన ఆధారాలు సంపూర్ణంగా లభ్యమయ్యాయి. మొదట ఆర్కియోలాజికల్‌ లేదా వస్తుపరమైన  ఆధారాలను పరిశీలిద్దాం.


నాణేలు

నాణేల అధ్యయన శాస్త్రాన్ని ‘న్యూమిస్‌మాటిక్స్‌’ అంటారు. నాణేల్లో విద్ధాంక నాణాలు(Punched Coins), రాతలేని నాణాలు(Script Coins) అంతర్భాగాలు. తెలంగాణ ప్రాచీన చరిత్రకు ప్రధానంగా జనపదాల చరిత్రకు నాణాలే ఆధారం. కోటిలింగాల, కొండాపూర్‌, నుస్తుల్లాపూర్‌, ఫణిగిరి, నేలకొండపల్లి మొదలైన ప్రాంతాల్లో లభ్యమైన నాణాలు తెలంగాణ తొలి చరిత్రను తెలియజేస్తున్నాయి. కోటిలింగాలలో లభ్యమైన నాణాలుపై ‘గోభద’ అనే అక్షరాలు బ్రహ్మిలిపిలో రాసి ఉన్నాయి. ‘రూపం’తో ఉన్న నాణాల మూలంగానే ‘రూపాయి’ అనే పదం ఉద్భవించిందని కొంతమంది చరిత్రకారులు భావిస్తుంటారు. ఈ నాణాల్లో రాగి శాతం ఎక్కువ. అప్పట్లో కొండాపూర్‌ ‘టంకశాల’గా గుర్తింపు పొందింది. తెలంగాణ నాణాలపై పరిశోధన చేసిన వారిలో ఆల్చిన్‌, డాక్టర్‌ దామె రాజారెడ్డి, పరబ్రహ్మ శాస్త్రి, వి.వి.కృష్ణ శాస్త్రి ప్రముఖులు.


పరీక్షల కోసం సంసిద్ధం అవుతున్న విద్యార్థులు తెలంగాణలో నాణాలు దొరికిన ప్రాంతాలు, వివిధ రాజవంశాల నాణాలు, వాటిపై గుర్తులు, లభ్యమైన  స్వదేశీ, విదేశీ నాణాలు సమాచారాన్ని సేకరించి నోట్స్‌ రూపంలో రాసుకోవాలి.


శాసనాలు (Inscriptions): శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఎపిగ్రఫీ’ అంటారు. శాసనాలు చెక్కడం బర్హుత్‌ శిల్పనమూనా నుంచి గ్రహించారు. మైలోజు, ఐలోజు అనే ప్రాచీన శిల్పులు తెలంగాణ వారు. వెంకట్రావుపేట శాసనం, చైతన్యపురి శాసనం, కొరవి, కురిక్యాల, గూడూరు శాసనాలు ముఖ్యమైనవి. తెలంగాణ శిలా శాసనాల్లో నవీనమైనది తెల్లాపూర్‌ శాసనం(1470-80). ఈ శాసనంలో తెలంగాణ పేరు ప్రస్తావించారు.

శాసనాలు వేసే సంస్కృతిని తొలిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టింది అశోకుడు. శాతవాహనులు దానిని అనుసరించారు. తెలంగాణలో తొలి పద్య శాసనం కురిక్యాల శాసనం కాగా, తొలి గద్య శాసనం కొరవి శాసనం. తొలిసారిగా ఆవిష్కరించిన శాసనం హైద్రాబాద్‌లోని చైతన్యపురి శాసనం.

అభ్యర్థులు శాసనాలపై ప్రత్యేక అధ్యయనం చేయాలి. చరిత్ర రచనలో శాసనాల అఽధ్యయన ఆధారాలకు శాస్త్రీయత ఉంటుంది. తెలంగాణలో వివిధ రకాల శాసనాలు, వాటిలో ప్రస్తావించిన అంశాలు, శాసనకర్తలు మొదలైన అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.


తెలంగాణలో ప్రాచీన నిర్మాణాలు

చరిత్రకు ప్రధాన ఆధారాలు ప్రాచీన నిర్మాణాలు. తెలంగాణలో కోటిలింగాలలోని మట్టికోట, మునుల గుట్ట, పెద్ద బంకూర్‌, నేలకొండపల్లి, ఫణిగిరి, ధూళికట్ట,  భద్రకోట, రాజుపేట ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి. తొలి శిలువ ఆకారపు శిలలు కాటారం, గులబగూడెంలో లభ్యమయ్యాయి. కొల్లాపూర్‌ మండలం చిన్న మరూర్‌ వద్ద తాళ్లతో కట్టిన బొమ్మ బయటపడింది. తెలంగాణ నిర్మాణాలు ప్రధానంగా  బర్హూట్‌, సాంచీ స్థూపాలను పోలి ఉన్నాయి. దాదాపుగా వందకు పైగా ప్రదేశాల్లో ఇవి బయల్పడ్డాయి. అభ్యర్థులకు ఈ అంశాలపై అవగాహన అవసరం.


తెలంగాణలో మానవ పరిణామ క్రమం

కార్బన్‌ డేటింగ్‌ లేదా ‘సి-14’ పద్ధతి ప్రకారం భూమి వయసును 460 కోట్ల సంవత్సరాలుగా గుర్తించారు. కార్బన్‌ డేటింగ్‌ పద్ధతిని ‘విల్లార్డ్‌ లిబ్బి’ కనుగొన్నాడు. తొలి మానవ పరిణామ క్రమం 10 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఆరంభమైనట్లుగా గుర్తించారు. తెలంగాణలో మానవ ఆనవాళ్లపై మూడు లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న సమాచారం లభ్యమైంది. ఈ చరిత్రను...


  • పాత రాతియుగం(పాలియో లిథిక్‌)
  • మధ్య శిలాయుగం(మెగా లిథిక్‌)
  • బృహత్‌ శిలా యుగం(నియో లిథిక్‌)గా వర్గీకరించుకోవాలి.


పాతరాతియుగం

సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం నుంచి 1.30 లక్షల క్రితం వరకు ఈ కాలం ఉనికిలో ఉంది. వీటికి సంబంధించిన ఆనవాళ్లు లభ్యమవుతున్నాయి. ఈ యుగం అవశేషాలు దిగువ గోదావరి లోయలో కనిపించాయి. పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, సిర్పూర్‌, నస్పూర్‌, మంచిర్యాల, చెన్నూర్‌, వేములపల్లి, బోధ్‌, పొచ్చర, పెద్దవాగు, నిర్మల్‌, ఏటూరునాగారాం, రాజుపల్లి, దామరవాయి, ఎక్కాల, సెలబాక, పాల్వంచ, చెర్ల ఈ కాలం అవశేషాలకు ప్రధాన సాక్ష్యాలు. రాతిగొడ్డళ్లు, గోకుడు రాళ్లు, వృత్తాకారపు రాళ్లు ఆనాటి మానవుల ముఖ్య పరికరాలు. 


మధ్యశిలా యుగం 

1.30 లక్షల నుంచి 20,000 సంవత్సరాల మధ్యకాలంలో  ఈ యుగ అవశేషాలను గుర్తించారు. హోమోసెపియన్‌, నియండర్థాల్‌ మానవ అవశేషాలు ఈ కాలంలో ఎక్కువగా లభించాయి. కృష్ణానది తీరంలోకి మానవ క్రమం విస్తరించింది. యప్రాదేవి పాడు, సిత్తరాయ గుహల్లో ఎద్దు అస్థిపంజరాలు కూడా లభ్యమయ్యాయి. గోదావరి తీరంలోని గోదావరిఖని, మేడిపల్లి, పొచ్చర, రామగుండం, మల్కాపురం ప్రాంతాల్లో ఈ యుగ అవశేషాలు లభ్యమయ్యాయి.


కొత్త రాతియుగం/బృహత్‌ శిలాయుగం

ఇది తొలి మానవ జీవితంలో ముఖ్యమైన దశ. ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు కొనసాగిన దశ. 20,000 సం. నుంచి 3,000 సంవత్సరాల వరకు కొనసాగి తొలి నాగరికతకు పునాదులు వేసిన దశ. మొక్కల పెంపకం, పశువుల పెంపకం ఈ కాలంలో ఉనికిలోకి వచ్చాయి. కుమ్మరి చక్రం వాడుకలోకి వచ్చింది. జమ్మూ కశ్మీర్‌లోని బూర్జ్‌హం గుహలు, మహారాష్ట్రలోని దైమాబాద్‌ గుహలను పోలిన అవశేషాలు తెలంగాణలో లభ్యమయ్యాయి. ఈ యుగానికి ప్రధాన సాక్ష్యాలు కెనోసోరిస్‌  లేదా మెనిహీర్‌ సమాధులు. ఇవి నాలుగు రకాలు...


కేన్స్‌ లేదా పిట్‌ బరియల్స్‌: నాగార్జున కొండ, ఆడెరిపల్లి, ఉప్పలపాడు, ఈర్ల దిన్నెలలో లభించాయి.

సిస్ట్‌ లేదా గూడు సమాధులు: ఇవి  స్వస్తిక్‌ ఆకారంలో గూడు లాగా పేర్చి ఉంటాయి. చిన్న మరూర్‌, పెద్ద మరూర్‌ ప్రాంతాల్లో వీటి అవశేషాలు ఉన్నాయి.

రాక్‌ కట్‌ లేదా రాతి సమాధులు: ప్రస్తుత హైద్రాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ ఏరియా, ల్యాబర్తీ, ఫణిగిరి, శివారు వెంకటాపూర్‌, రాజుపల్లి, కాంచనపల్లి, దామెరవాయి, పోచంపాడు ప్రాంతాల్లో గుర్తించారు. వీటితోపాటు సర్కోఫాగస్‌ శవపేటికలు రాయగిరి, హుజూర్‌నగర్‌, నార్కట్‌పల్లి, మంగపేట, జానంపేట, మంజీర నదీ తీరాల్లో లభించాయి ఏనుగు ఆకారం శవపేటిక ఏలేశ్వరంలో లభించింది. ఈ యుగంలోనే తొలి బూడిద కుప్పలు లభ్యమయ్యాయి.


శాసనాలు వేసే సంస్కృతిని తొలిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టింది అశోకుడు. శాతవాహనులు దానిని అనుసరించారు. తెలంగాణలో తొలి పద్య శాసనం కురిక్యాల శాసనం కాగా, తొలి గద్య శాసనం కొరవి శాసనం. తొలిసారిగా ఆవిష్కరించిన శాసనం హైద్రాబాద్‌లోని చైతన్యపురి శాసనం.


తెలంగాణ భౌగోళిక మూలాలు

భౌగోళికంగా తెలంగాణ ఒక ప్రాచీన ప్రాంతం. వివిధ భౌమ శిలా విన్యాసాలతో దార్వార్‌ సమూహానికి చెందిన అతిపురాతనమైన శిలలతో ఏర్పడిన ప్రాంతం. గోండ్వాన ప్రాంత పునాదులతో సమద్విబాహు త్రిభుజాకారంలో ఏర్పడి ఉంది. అవి శిలలు రూపాంతరం చెందిన తరవాత టౌర్‌, బౌల్డర్‌ గుట్టలతో ఏర్పడి ఉంది. బొగ్గు తరవాత గ్రానైట్‌ శిలాజాలు, శిలలు ఈ పీఠభూమిపై పుష్కలంగా ఉన్నాయి. గోదావరి-కృష్ణా నదుల మధ్య విస్తరించిన దోభ్‌ తెలంగాణ.

సముద్ర మట్టానికి దాదాపు 480 - 600 మీటర్ల ఎత్తులో విస్తరించిన పీఠభూమి కాస్త తూర్పువైపు వాలి ఉంది. రాష్ట్ర రాజధాని 600 మీటర్ల ఎత్తులో ఉండి తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది.


స్పటిక రూపాంతర శిలలు, బసాల్ట్‌ శిలలతో కూడిన ప్రాంతాలు, గ్రానైట్‌, నీస్‌ శిలా మిశ్రమాలు తెలంగాణ అంతా వ్యాపించి ఉంటాయి. గోదావరి నదీ పరివాహకంలోని మంచిర్యాల, పెద్దపల్లి, భూపాల్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలన్నీ ముడుతలు పడిన గోండ్వాన జాతికి చెందిన బొగ్గు ప్రాంతాలు. కృష్ణానదీ తీర ప్రాంతాలైన పాత మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాంతాలు, హజూర్‌నగర్‌ అంతా లైమ్‌ స్టోన్‌ లేదా సున్నపు రాయి నిక్షేపాలు నిండిన ప్రాంతాలు.


తెలంగాణలోని అధిక ప్రాంతాలు ఎర్రని మృత్తికలతో, తరవాతి స్థానంలో లావా నుంచి వచ్చిన నల్లరేగడి నేలలతో, మరికొంత భాగం ముదురు గోధుమ వర్ణంతో ఏర్పడిన నేలల ప్రాంతం. తెలంగాణ శిలలు నాలుగు రకాలు. అవి... ఆల్చియన్‌,  వింధ్యా, గోండ్వాన, ద్రవిడియన్‌ శిలలు. అభ్యర్థులకు తెలంగాణ ప్రాచీన భూభాగంపై గట్టి అవగాహన ఉండాలి. దీనికోసం ప్రాచీన గోండ్వాన నుంచి వస్తున్న మార్పులను, శీతోష్ణస్థితిపై దాని ప్రభావాన్ని ప్రస్తుత వాతావరణ, పర్యావరణ స్థితిగతులను అంచనా వేసే పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి.


ప్రాచీన తెలంగాణ ప్రాంతంలో మానవ ఆవాస ప్రాంతాలు ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే నదీ తీరాల్లో ఆరంభమయ్యాయి. వీటిని కృష్ణా నదీ తీర నాగరికత, గోదావరి నదీ తీర నాగరికతగా వర్గీకరించవచ్చు.


కృష్ణా నదీ తీరంలో ప్రాచీన తెలంగాణ నాగరికత

కృష్ణా నది గురించి బౌద్ధ గ్రంథాలు ప్రస్తావించాయి. అలాగే ‘బ్రహ్మాండ పురాణం’లో కూడా ఈ నది గురించిన ప్రస్తావన ఉంది. మహారాష్ట్రలోని సతార జిల్లాలో గల ‘జార్‌’ గ్రామ సమీపంలోని ‘మహాబలేశ్వరం’ కొండల్లో ఒక పాయగా ఈ నది ఆరంభమవుతుంది. ఈ నదిలో కలిసే మొదటి ఉపపది ‘బెన్న’, మరో ఉపనది ‘భీమ’. ఈ నది తెలంగాణలో తంగిడిగి, కృష్ణా, కల్‌వాల్లి గ్రామాల సమీపంలో ప్రవేశిస్తుంది. కృష్ణానది నల్లని కొండల మధ్య ప్రవహించడంవల్ల ప్రాచీన శాసనాల్లో నల్లబెన్న, కన్నబెన్న అనే పేర్లతో పిలిచారు. ఈ పేర్లు క్రమేణా కృష్ణవేణి, కృష్ణా నదులుగా మారాయి.


కృష్ణా నదీ తీర  ప్రాంతం అత్యంత ప్రాచీనమైనది. కృష్ణానదీ తీర శిలల వయసు దాదాపు 260 కోట్ల సంవత్సరాలు. ఈ తీర ప్రాంతాల్లో మూడు లక్షల సంవత్సరాల క్రితం వరకు జీవించి ఉన్న మానవ అవశేషాలు లభ్యమయ్యాయి. కృష్ణా నదీ తీరంలోని అనేక ప్రాంతాలు ప్రాచీన మానవ నాగకరిత అవశేషాలుగా నేటికీ సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి.


ఉప్పేరు ప్రాంతంలో బృహత్‌శిలాయుగ అవశేషాలు, ఈర్లదిన్నెలో రాక్షస గుండ్లు, యాపాలదేవిపాడులో గుహ చిత్రాలు, ఎద్దుబొమ్మలు, రసూల్‌ చెరువు వద్ద ఆదిమ మానవుడు వాడిన పరికరాలు, ఏలేశ్వరం వద్ద ఇటుక సమాధులు, అక్కదేవి గుహల వద్ద తొలి మానవ జీవన దృశ్యాలు వీటిలో ముఖ్యమైనవి. తరవాతి కాలంలో ఏర్పడిన చంద్రగుప్త పట్టణం, శాతాని కోట, మాజేరు, విజయపురి, నాగార్జున కొండ, ఏలేశ్వరం, ఆలంపురం, ప్రతోళిద్వారం, అక్కమహాదేవి గుహలు, రాజమర్ల బావి కృష్ణానదీ తీర నాగరికతకు ఉన్నతమైన సాక్ష్యాలు. గ్రూప్‌ పరీక్షల కోసం, పోలీస్‌, టీచర్‌ సర్వీసుల కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు తెలంగాణలో కృష్ణాదీ పరివాహక ప్రాంతాన్ని గుర్తించి భౌగోళిక పరిజ్ఞానాన్ని, చరిత్ర జ్ఞానాన్ని జోడించి సమాచారాన్ని సేకరించుకోగలగాలి. దక్షిణ తెలంగాణ ప్రాంతమంతా అభ్యర్థుల అవగాహన పరిధిలో ఉండాలి.


గోదావరి నదీ తీర ప్రాచీన తెలంగాణ

గోదావరి నది గురించి బౌద్ధ గ్రంథాలైన సెరివన జాతక కథలు, జైన గ్రంథాలైన ఎట్టావళీ, భగవతీ; పురాణాలైన భవిష్య పురాణం, వాయు పురాణం, మత్స్య పురాణం, బ్రహ్మాండ పురాణాల్లో ప్రస్తావన ఉంది. గోదావరి అర్థం విభజన. ఉత్తర - దక్షిణ భారతదేశాన్ని విభజించే భౌగోళిక నది.


వాస్తవానికి  గోదావరి ప్రవాహాల నుంచే తెలంగాణ జీవన రేఖను గీశారు. ఒకప్పుడు ‘తేలి వాహన నది’గా పిలిచే గోదావరి పరివాహక ప్రాంతమే తెలంగాణగా మారింది. ఈ ప్రాంత భాష తెలుగు భాషగా మారింది.


కందుకూరి, బోధన్‌, పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, కోటి లింగాల, ఆసిఫాబాద్‌, బోధ్‌, సిర్‌పూర్‌, నస్పూర్‌, ఏటూరు నాగారం, వెంకటాపురం, చర్ల, భద్రాచలం వరకు అనేక మానవ జీవన అవశేషాలు లభ్యమయ్యాయి. ఆస్సాక రాజ్యం, శాతవాహన రాజ్యం, సబామి రాజ్యం నుంచి నేటి వరకు తెలంగాణ సౌభాగ్యమంతా గోదావరితో ముడిపడి ఉంది.


ముగింపు

తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం. దీని వాస్తవ పునాదులు పాత హైద్రాబాద్‌ రాజ్యం లేదా రాష్ట్రంలో ఉన్నాయి. అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక మూలాలను అవగతం చేసుకోకుండా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు.


చరిత్ర అధ్యయనం వర్తమానాన్ని అర్థం చేయిస్తుంది. వర్తమానం అవగతం భవిష్యత్‌కు పునాదులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు తమ తాత్విక పునాదులను నిర్మించుకోవడం కోసం తెలంగాణ చరిత్ర - సంస్కృతి- ఉద్యమాన్ని అధ్యయనం చేయాలి.


ఈ రాష్ట్ర విధాన నిర్ణయాల కూర్పులో భాగస్వామ్యం కావడం కోసం, విధాన అమలులో భాగం కావడం కోసం తెలంగాణ చారిత్రక భౌగోళిక మూలాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి.


-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ 

డైరెక్టర్‌, 5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌



Updated Date - 2022-06-27T21:15:10+05:30 IST