దండెత్తారు..!

ABN , First Publish Date - 2022-01-21T06:49:28+05:30 IST

రివర్స్‌ పీఆర్సీపై ఉద్యోగులు దండెత్తారు. తమకు దగా చేసిన ప్రభుత్వంపై గర్జించారు. ఉప్పెనలా కదిలొచ్చి.. గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు.

దండెత్తారు..!
రివర్స్‌ పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడిలో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు

అనంతదారులన్నీ కలెక్టరేట్‌ వైపే..

పోటెత్తిన వేలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు

కలెక్టరేట్‌ దారులను దిగ్బంధించిన పోలీసులు

4 వైపుల నుంచి చుట్టుముట్టిన ఉద్యమకారులు

10 వేల మంది రోడ్లపైకి ప్లకార్డులు, బ్యానర్లు, 

జెండాలతో పోటెత్తిన ఆందోళనకారులు

సీఎం డౌన్‌.. డౌన్‌.. అంటూ నినాదాలు

కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లే యత్నం

45 నిమిషాల  పాటు పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట

వందలాది మంది అరెస్టు

పలువురు నేతలు, ఉద్యోగులకు గాయాలు

5 గంటలపాటు ట్రాఫిక్‌ మళ్లింపు

అనంతపురం విద్య, జనవరి 20: రివర్స్‌ పీఆర్సీపై ఉద్యోగులు దండెత్తారు. తమకు దగా చేసిన ప్రభుత్వంపై గర్జించారు. ఉప్పెనలా కదిలొచ్చి.. గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అనంత నగరాన్నే దిగ్బంధించారు. ఎటుచూసినా.. ఉద్యోగులు, ఉపాధ్యాయులే. వేలాదిగా తరలివచ్చి, కలెక్టరేట్‌ను చుట్టుముట్టారు. పోలీసులు అన్నిదారులను మూసేసినా.. నాలుగు వైపుల నుంచి దండెత్తారు. అన్నిదారులు కలెక్టరేట్‌ వైపు అంటూ కదిలారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు తరలిరావడంతో కలెక్టరేట్‌ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. వినూత్న నిరసనలు, ఆందోళనలు, నినాదాలతో ఆ ప్రాంతం అట్టుడికింది. వేలాదిమంది బారికేడ్లు దాటి కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో సుమారు 45 నిమిషాలు ఉద్యమకారులు, పోలీసుల మధ్య తోపులాట సాగింది. పరిస్థితి చేయిదాటుతుందని భావించిన పోలీసులు బలవంతంగా ఉద్యమకారులను ప్రత్యేక వాహనాల్లో అరెస్టు చేసి, స్టేషన్లకు తరలించారు. సుమారు 10 వేల మంది ఉద్యోగులు, టీచర్లు, ఉద్యమకారులు.. తరలిరావడంతో కలెక్టరేట్‌ ప్రాంతం కిక్కిరిసింది. 5 గంటలపాటు ట్రాఫిక్‌ మళ్లించారు.



తోపులాట... అరెస్టులు.. గాయాలు...

మధ్యాహ్నం 12.10 గంటల తర్వాత ఉద్యమకారులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. కలెక్టరేట్‌ మెయిన్‌ గేటుకు ఎదురుగా ఏర్పాటుచేసిన ఇనుప బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు ఉద్యమకారులు ప్రయత్నించారు. సుమారు 45 నిమిషాలు పోలీసులు, ఉద్యమకారుల మధ్య పెద్దఎత్తున తోపులాట సాగింది. వందలాది మంది తోసుకుంటూ ముందుకొచ్చారు. పోలీసులు అంతే స్థాయిలో వారిని వెనక్కు నెట్టేస్తూ... వచ్చారు. ఉద్యోగుల తోపులాట మరీ ఎక్కువ కావడంతో పోలీసులు రోప్‌ పార్టీలను పిలిచి, ఉద్యమకారులను అక్కడి నుంచి దూరంగా నెట్టేస్తూ... తీసుకెళ్లి బలవంతంగా అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించారు. తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. ఏపీఎన్జీఓ నేత మనోహర్‌రెడ్డితోపాటు చాలామంది ఉద్యోగులు గాయపడ్డారు.


5 గంటలపాటు ట్రాఫిక్‌ మళ్లింపు

కలెక్టరేట్‌ ముట్టడి నేపథ్యంలో అటువైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్‌ మళ్లించారు. ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో కదిరి, ధర్మవరం, పెనుకొండ, పుట్టపర్తి, హిందూపురం, బెంగళూరు నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించారు. అటువైపు నుంచి వచ్చే వాహనాలను రాప్తాడు బైపాస్‌ మీదుగా పంపారు. దీంతో రాప్తాడు, రుద్రంపేట బైపాస్‌ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ మళ్లించిన ప్రాంతాలతోపాటు, కలెక్టరేట్‌ వైపు వెళ్లే ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


ముట్టడికి సంఘాల మద్దతు

కలెక్టరేట్‌ ముట్టడికి భారీగా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల, కార్మిక, రిజర్వేషన్ల, కళాశాలల, పెన్షనర్ల సంఘాలు మద్దతు ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు రామాంజనేయులు, జయచంద్రారెడ్డి, నాగేంద్ర, సూర్యుడు, రమణారెడ్డి, సిరాజుద్దీన్‌, రవీంద్ర, ఓబులేసు, పెద్దన్న, గోపాల్‌రెడ్డి, నరసింహులు, అశోక్‌కుమార్‌, వెంకటరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరత్నం, రవీంద్రనాయక్‌, త్రిమూర్తి,  విశ్వనాథ్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, లింగమూర్తి, శంకర్‌, ఏపీఎన్జీఓ నాయకులు శ్రీధర్‌బాబు, ఉమాశంకర్‌, దేవేంద్ర, శ్రీనివాసులు, ఇరిగేషన్‌ఉద్యోగులు మహబూబ్‌దౌలా, శ్రీనివాసులు, మహబూబ్‌బాషా, ఆర్పీఎఫ్‌ నాయకులు నాగభూషణ, నారాయణనాయక్‌, శ్రీనివాసులు, ఉమా శంకర్‌, ఓబిలేసు, పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం నేతలు నాగభూషణరెడ్డి, చంద్రశేఖర్‌, పెన్షనర్ల సంఘం శీలా జయరామప్ప, రామకృష్ణ, ఖలందర్‌, ప్రభాకర్‌, బీసీ ఉద్యోగుల సంఘం చంద్రమోహన్‌, టీఎన్‌యూఎస్‌ రామలింగప్ప, ప్రకా్‌షరావు, నాగరాజు జయపాల్‌నాయుడు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల లెక్చరర్ల సంఘం నాయకుడు రమణ కుమార్‌ పాల్గొన్నారు.








గంటన్నరపాటు ‘డౌన్‌... డౌన్‌.. సీఎం’ అంటూ నినాదాలు...

పీఆర్సీని అశాస్త్రీయంగా, అసంబద్ధంగా ప్రకటించడంతో మండిపోయిన ఉద్యమకారులు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్లకార్డులు, బ్యానర్లు, జెండాలు ప్రదర్శిస్తూ... కనిపించారు. రివర్స్‌ పీఆర్సీ వద్దనీ, హెచ్‌ఆర్‌ స్లాబు యథావిధిగా కొనసాగించాలనీ, సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏ ఉద్యోగి నోట విన్నా.. ‘సీఎం డౌన్‌...డౌన్‌’ అంటూ గంటన్నరపాటు నినదించారు. మహిళా ఉద్యోగులు సైతం పాటలు పాడుతూ... సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. గంటన్నరపాటు ఆ ప్రాంతంలో ఇదే వినిపించింది. అనంతరం ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు జయరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సాలెవేముల బాబు, ఫోర్టో చైర్మన్‌ హరికృష్ణ, ఏపీ ఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు అతావుల్లా, నగర అధ్యక్షుడు మనోహర్‌, జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ నాగిరెడ్డి, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దన్న, ఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు ఇతర నాయకులు మాట్లాడుతూ... ఉద్యోగుల వ్యతిరేక పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలన్నారు. 30 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించాలన్నారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలన్నారు. పాత హెచ్‌ఆర్‌ స్లాబు కొనసాగించాలని కోరారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎ్‌సను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘సిగ్గులేని సీఎం వెంటనే దిగిపోవాలం’టూ నినదించారు.  





ఉదయం నుంచి పోటెత్తిన ఉద్యమకారులు

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఫ్యాప్టో పిలుపుతో గురువారం కలెక్టరేట్‌ ముట్టడికి పోటెత్తారు. ఉదయం 9.30 గంటల నుంచే ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులు తదితర వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. ముట్టడి తీవ్రతను ముందే అంచనావేసిన పోలీసులు కలెక్టరేట్‌కు వెళ్లే అన్నిదారులను మూసివేశారు. సంఘమేష్‌ సర్కిల్‌, ఎస్కేయూ, జేఎనటీయూ, రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌, చెరువుకట్ట వైపు దారుల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆందోళనకారులు నాలుగువైపుల నుంచి గుంపులుగుంపులుగా పోటెత్తారు. మధ్యాహ్నం 10.45 గంటలకి వేలాదిమంది ఉద్యోగులు జిల్లా నలుమూలల నుంచి అక్కడికి చేరుకున్నారు. అప్పటినుంచి ఫ్యాప్టోతోపాటు, ఫోర్టో, ఏపీజేఏసీ, ఏపీఎన్జీఓలు, ఏపీ జేఏసీ అమరావతిలోని సంఘాలతోపాటు ఇతరత్రా నాయకులతో కలసి వేలాదిమంది ఉద్యోగులు నినాదాలతో కలెక్టరేట్‌ దద్దరిల్లింది. 


డీఈఓకు నిరసన సెగ

స్కూళ్ల మ్యాపింగ్‌ వర్క్‌షా్‌పను అడ్డుకున్న ఉపాధ్యాయులు

రాప్తాడు, జనవరి 20: జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) శామ్యూల్‌కు నిరసన సెగ తగిలింది. పాఠశాలల మ్యాపింగ్‌పై వర్క్‌షాప్‌ నిర్వహించకుండా ఫ్యాప్టో నేతలు అడ్డుకున్నారు. రివర్స్‌ పీఆర్సీపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంఘాల నేతలు గురువారం కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. రాప్తాడు సమీపంలోని పంగల్‌రోడ్డు వద్ద గల ఆర్డీటీ పాఠశాలలో.. మ్యాపింగ్‌పై డీఈఓ, ఓపెన స్కూల్‌ డైరెక్టర్‌, ప్రత్యేకాధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఒకరోజు వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశారు. జిల్లాలోని జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్‌ యాజమాన్య ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు హాజరయ్యారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు ఆర్డీటీ పాఠశాల వద్దకొచ్చి, వర్క్‌షా్‌పను అడ్డుకున్నారు. డీఈఓ ముందే నిరసన చేపట్టారు. సీపీఎ్‌సను రద్దు చేసి, పెన్షనర్లకు న్యాయం చేయాలన్నారు. ఐదేళ్ల పీఆర్సీని కొనసాగించాలన్నారు. ఎన్నికల హామీల మేరకు ముఖ్యమంత్రి జగన.. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-01-21T06:49:28+05:30 IST