చెల్లని ఓటు.. ఎందరికో చేటు!

ABN , First Publish Date - 2021-02-25T04:39:52+05:30 IST

ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 33వేల ఓట్లు పైబడి బుట్ట దాఖలా అయ్యాయి. ఈ విషయం తెలిసిన ప్రతి ఓటరూ ఆశ్చర్యపోతుండగా అభ్యర్థులు మొర్రో అంటున్నారు. చెల్లని ఓట్ల వల్ల ఎందరి తలరాతలు తలకిందులయ్యాయో అని ముక్కున వేలేసుకుంటున్నారు.

చెల్లని ఓటు.. ఎందరికో చేటు!

జిల్లాలో భారీగా చెల్లని ఓట్లు

33వేలు పైబడి బుట్ట దాఖలా

నోటాకూ సుమారు ఏడు వేల ఓట్లు 

ఫలితాలు తలకిందులు

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 33వేల ఓట్లు పైబడి బుట్ట దాఖలా అయ్యాయి. ఈ విషయం తెలిసిన ప్రతి ఓటరూ ఆశ్చర్యపోతుండగా అభ్యర్థులు మొర్రో అంటున్నారు. చెల్లని ఓట్ల వల్ల ఎందరి తలరాతలు తలకిందులయ్యాయో అని ముక్కున వేలేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌(10లోపు) ఆధిక్యంతో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ఎందరో ఉన్నారు. చెల్లని ఓట్ల సంఖ్య తగ్గి ఉంటే వీరిలో కొందరి జాతకాలు తారుమారు అయ్యేవి. 

జిల్లాలో 33,222 ఓట్లు చెల్లలేదని ఎన్నికల అధికారులు తేల్చారు. చెల్లని ఓట్లు గురించి వింటే ఓటరుకు గుండె చివుక్కు మంటుంది. ఎంతో ఉత్సాహంతో పనులు మానుకుని ఓటు హక్కును వినియోగించుకుంటుంటారు. గంటల తరబడి లైన్‌లో నిల్చుంటారు. వీరు సక్రమంగానే ఓటు వేసినా ఓటు ముద్ర వేసిన తరువాత బ్యాలెట్‌ పత్రం మడత వేసే సమయంలోనో లేదా ఓటు వేస్తున్న సమయంలో చిన్న పాటి ఇంకు మరక మరో గుర్తుపై పడ్డా దానిని అనర్హుల జాబితాలో వేసేస్తారు. అలాగే ఒక ఓటరు స్వస్తిక్‌ గుర్తుతో ఒక గుర్తుపై ఓటు వేసినా.. చేతికి అంటిన సిరా మరక, లేదా స్వస్తిక్‌ గుర్తున్న ఇంకు తడి పొరపాటున వేరే గుర్తుపై అంటితే అటువంటి వాటిని చెల్లని ఓట్లుగా తీసేశారు. ఇటువంటి చిన్నపాటి లోపాల కారణంగానే జిల్లా వ్తాప్తంగా 33,222 ఓట్లు చెల్లని ఓట్లుగా బుట్టదాఖలా చేశారు. ఈ ఓట్లు ఎంతో మంది భవితవ్యాన్ని తలకిందులు చేసి ఉంటాయనటంలో సందేహం లేదు. 

కొత్తవలస మండలంలో 10 ఓట్ల తేడాతో మేజరు సర్పంచి అభ్యర్థి గెలుపొందినట్లు ఆర్‌ఓ ప్రకటించారు. సుమారు 20వేల ఓట్లున్న ఈ పంచాయతీలో 10 ఓట్లు ఫలితాన్ని నిర్దేశించాయి. ఒక్కడ కూడా వందల సంఖ్యలో ఓట్లు చెల్లనవిగా నమోదయ్యాయి. మెంటాడ మండలం బుచ్చిరాజు పేట గ్రామానికి చెందిన తాడ్డి తిరుపతిరావు 4 ఓట్ల తేడాతో సర్పంచిగా గెలుపొందారు. దత్తిరాజేరు మండలంలో నారాయణరావు రెండు ఓట్లు తేడాతో విజయం సాధించారు. ఇవే కాకుండా అనేక పంచాయతీల్లో  స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందిన వారున్నారు. ఆయా చోట్ల చెల్లని ఓట్ల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. వార్డు సభ్యల పరిస్థితి మరింత దారుణం. వందల సంఖ్యలో వార్డులు 10నుంచి 20 ఓట్ల తేడాతో గెలుపొందినవే. ఓటర్లలో అవగాహన రాహిత్యం, అజాగ్రత్త, తొందరపాటు కూడా ఈ పరిస్థితికి కారణాలుగా ఉంటాయి. అయితే అందరికీ శిక్షణ తరగతులుంటాయి కాని ఓటర్లకు ఏర్పాటుచేయరు. దీనివల్లే ఏటా ఎన్నికల్లో అనేక ఓట్లు చెల్లడం లేదని సీనియర్‌ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఓటు ఎలా వేయాలి? ఏవిధంగా బ్యాలెట్‌ను మడత పెట్టాలి? గుర్తుపై వేసిన స్వస్తిక్‌ ముద్ర ఇంకు ఇతర చోట్ల అంటకూడదంటే ఏం చేయాలి? తదితర విషయాలపై కనీసం ఒక్కసారైనా అవగాహన పరచాల్సిన అవసరం ఉంది. ఏ అధికారీ అందుకు సిద్ధం కావడం లేదు. 

నోటాకూ ఓట్లు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి నోటా గుర్తును కూడా ముద్రించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ తమకు సమ్మతం కాదని భావించినట్లయితే నోటా గుర్తుపై స్వస్తిక్‌ ముద్ర వేయాలి. మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 6,961 మంది నోటా గుర్తుకు ఓటు వేశారు. అంటే వీరంతా పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ఆలోచనకు అనుకూలంగా లేరని భావించారు. మొదటి విడతలో పార్వతీపురం డివిజన్‌ 15 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 3062 మంది నోటా గుర్తుకు ఓటు వేశారు. చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల పరిధిలో 1925 మంది, ఎస్‌.కోట, గజపతినగరం నియోజకవర్గాల పరిధిలో 1974 మంది నోటాకు ఓటు వేశారు. 



Updated Date - 2021-02-25T04:39:52+05:30 IST