తిరుగులేని పుతిన్‌!

ABN , First Publish Date - 2020-07-07T06:17:38+05:30 IST

ఇరవయ్యేళ్ళుగా రష్యా ప్రధానిగానో, అధ్యక్షుడిగానో అధికారాన్ని అనుభవిస్తున్న వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇక 2036వరకూ తానే దేశాధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్నారు...

తిరుగులేని పుతిన్‌!

ఇరవయ్యేళ్ళుగా రష్యా ప్రధానిగానో, అధ్యక్షుడిగానో అధికారాన్ని అనుభవిస్తున్న వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇక 2036వరకూ తానే దేశాధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇందుకు అనుగుణంగా తయారైన రాజ్యాంగ సంస్కరణలకు రష్యా ఓటర్లలో దాదాపు 78శాతం మంది ఆమోద ముద్రవేశారు. మరో రెండేళ్ళలో ఆయన రెండోవిడత పదవీకాలం పూర్తికాబోతున్నది. ఒక వ్యక్తి వరుసగా రెండుసార్లకు మించి అధ్యక్షహోదాలో కొనసాగకూడదన్నది అక్కడి నిబంధన. జనవరిలో పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణల్లో ఈ నిబంధనను తిరగరాయలేదు కూడా. కానీ, కొత్త రాజ్యాంగం ఆయనకు సరికొత్త అధ్యక్ష జీవితాన్ని ప్రసాదించబోతున్నది. గతంలో అనుభవించిన పదవీకాలమంతా గాలికి కొట్టుకుపోయి, 2024లో జరిగే ఎన్నికల్లో ఆయన తిరిగి అధ్యక్షపదవికి పోటీ పడవచ్చు. ఎంతైనా ఈ మాజీ గూఢచారి బుర్రే వేరు.


రాజ్యాంగ సవరణలకు ఎగువ దిగువ సభలు, దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే ఆమోదముద్ర వేసాయి కనుక, ప్రజాభిప్రాయ సేకరణ అనే విన్యాసం అవసరమే లేదు. కానీ, సవరణలకు విస్తృత ప్రజామోదం ఉన్నట్టుగా చూపడానికీ, విలువ కూడగట్టడానికి ఆయన రెఫరెండమ్‌కు సంకల్పించారు. తాను మళ్ళీ దేశాధ్యక్షుడై ౮౪ ఏళ్ళు వచ్చేవరకూ కుర్చీలో కూర్చోవడానికి వీలుగా దాదాపు 200 సంస్కరణలను గుదిగుచ్చారు. చట్టసభలు, సలహామండలి ఇత్యాది వ్యవస్థలపైన అధ్యక్షుడి అధికారాలను మరింత పెంచే సవరణలతో రష్యామీద తన అజమాయిషీని పెంచుకున్నారు. సామాజిక సంక్షేమపథకాలను బలోపేతం చేయడం, రష్యా రాజ్యాంగానికి అనుగుణంగా లేని అంతర్జాతీయ చట్టాలను త్రోసిరాజనడం వంటివి అటుంచితే, స్త్రీ పురుష వివాహాలను మాత్రమే గుర్తించడం, పాఠశాల విద్యనుంచే దేశభక్తి నూరిపోయడం, దేవుడిపై విశ్వాసం వంటివి కూడా ఈ సవరణల్లో చేర్చారు. సుస్థిర, సుదృఢ రష్యాకోసం ఈ సవరణలు అవసరమని ప్రజలకు చెప్పారు. కరోనా కారణంగా ఏప్రిల్‌లో జరగాల్సిన రెఫరెండమ్‌ వాయిదాపడినప్పటికీ, ఇప్పుడు ఆరున్నర లక్షలమంది బాధితులతో ప్రపంచ జాబితాలో మూడోస్థానంలో ఉన్నప్పటికీ, ఆర్థికం మరింత దెబ్బతినిపోయేలోగా దానిని పూర్తిచేసేయాలన్న పట్టుదలతో ఈ నెలలో రెఫరెండమ్‌ కానిచ్చేశారు.


నిజంగానే ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో ఆయనే తమ పాలకుడిగా కొనసాగాలని కోరుకున్నారా? విపక్షనాయకులు, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్న ప్రకారం ఈ రెఫరెండమ్‌ ఓ పచ్చి అబద్ధం. కరోనా పేరిట ఏకంగా వారం పాటు సాగిన ఈ ప్రక్రియలో కొద్దిమంది ప్రత్యక్షంగా ఓటేస్తే, ఆన్‌లైన్‌లో పడిన ఓట్లే ఎక్కువ. అక్రమాలకు అనేక అవకాశాలు ఉండగా, నియంత్రణలు, పర్యవేక్షణలు ఏమాత్రం లేకుండా సాగిన ప్రక్రియ ఇది. అధికార మీడియా రాజ్యాంగ సవరణల ఆవశ్యకతను విస్తృతంగా ప్రచారం చేసి, దేశభక్తి, దైవభక్తి రగల్చింది. పుతిన్‌ మరోమారు ఎన్నికల్లో పాల్గొని అధ్యక్షుడయ్యేందుకు, 2036వరకూ దేశాన్ని ఏలేందుకు మీ అభిప్రాయం తోడ్పడుతుందన్న విషయం మాత్రం ప్రచారంలోకి రానివ్వలేదు. రెఫరెండమ్‌లో ఔను లేదా కాదు అని చెప్పే అవకాశం మాత్రమే ఇస్తూ, రెండువందల అంశాల్లో ప్రతీ ఒక్కరికీ నచ్చే అంశమేదో ఒకటి చేర్చి పాలకులు విస్తృత ప్రజాభిప్రాయాన్ని కూడగట్టగలిగారు. మొత్తం ప్యాకేజీని ఆమోదించడమో తిరస్కరించడమో తప్ప, మళ్ళీ పుతిన్‌ వద్దు, పింఛను మాత్రమే ముద్దు అనేందుకు వీల్లేని స్థితి.


సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం తరువాత ఎదురైన కష్టాలనుంచి రష్యా పెద్దగా కోలుకున్నదేమీ లేదు. ఆర్థికం ఏమాత్రం బాగులేని స్థితిలో పుతిన్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు చూడగలిగే నాయకులెవ్వరూ అక్కడ పెద్దగా లేరు, ఉండనివ్వలేదు కూడా. ప్రజాభిప్రాయ సేకరణ ఎలా జరిగిందన్నది అటుంచితే, ప్రజలకు కూడా పుతిన్‌ తప్ప గతిలేదు. మంచో చెడో ఆయనవంటి ‘బలమైన’నేతే తమకు ఈ కష్టకాలంలో అవసరమని వారు కూడా అనుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పుతిన్‌ వ్యతిరేక ప్రచారం బాగానే సాగినప్పటికీ, దేశానికి సుస్థిరత, భద్రత ఆయనతోనే సాధ్యమని వారు నమ్మారు. ఆయన ప్రయోగించిన కుటుంబవిలువలు, దైవసృష్టి, జాతీయవాదం వారిమీద అస్త్రాలుగా పనిచేశాయి. పుతిన్‌ బలపడితే తమ వేతనాలు పెరుగుతాయనీ, సంక్షేమపథకాలు అమల్లోకి వస్తాయని నమ్మారు తప్ప, అందుకు కావల్సిన వేలకోట్ల సొమ్ము ఎక్కడినుంచి వస్తాయన్నది వారికి పట్టలేదు. మరోమారు అధికారంలోకి రావాలని పుతిన్‌ ఎత్తువేస్తే, బలమైన అధ్యక్షుడు ఉంటే చాలని ప్రజలు అనుకున్నారు. 

Updated Date - 2020-07-07T06:17:38+05:30 IST