మార్చి చివర్లో ఐపీఎల్‌!

ABN , First Publish Date - 2022-01-23T08:37:04+05:30 IST

ఐపీఎల్‌-2022కు ముహూర్తం ఖరారైంది. ఫ్రాంచైజీల యజమానులు కోరిన మీదట మార్చి చివరి వారం..

మార్చి చివర్లో ఐపీఎల్‌!

మే ఆఖరి వరకు లీగ్‌

ముంబైలోనే అన్ని మ్యాచ్‌లు?

వచ్చే నెలలో మెగా వేలంప్రకటించిన బీసీసీఐ


న్యూఢిల్లీ: ఐపీఎల్‌-2022కు ముహూర్తం ఖరారైంది. ఫ్రాంచైజీల యజమానులు కోరిన మీదట మార్చి చివరి వారం నుంచి మే ఆఖరి వరకు మెగా లీగ్‌ను జరపనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. లీగ్‌లోని 10 జట్ల ఫ్రాంచైజీలతో బోర్డు సమావేశం నిర్వహించిన అనంతరం కీలక నిర్ణయాలు తీసుకొంది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మార్చి 27న లీగ్‌ ఆరంభం కానుందని తెలుస్తోంది. లీగ్‌ మొత్తాన్ని భారత్‌లోనే నిర్వహించాలనుకుంటున్నట్టు షా పేర్కొన్నారు. కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ వేదికలపై కూడా దృష్టిసారించనున్నట్టు చెప్పారు. కాగా, సమావేశంలో లీగ్‌ను ఎప్పుడు ఆరంభించాలి? అనేదానిపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. ఓ వర్గం మార్చి 27 నుంచి నిర్వహించాలంటే.. మరో వర్గం ఏప్రిల్‌ 2న ఆరంభించాలని సూచించిందట. ముంబై, పుణె వేదికలుగా లీగ్‌ను నిర్వహించాలని.. కరోనా అదుపులోకి వస్తే ప్లేఆ్‌ఫ్సకు అహ్మదాబాద్‌ను రెండో వేదికగా పరిశీలించాలని కూడా చెప్పినట్టు తెలిసింది. కొవిడ్‌ కారణంగా ఐపీఎల్‌ను నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వేదికలుగా దక్షిణాఫ్రికా, యూఏఈలను బ్యాక్‌పగా పరిగణించాలని కూడా సూచించాయట. 


ముంబైలోనే అన్నీ?:

గతేడాది అనుభవం రీత్యా లీగ్‌ మొత్తాన్ని ముంబైలోనే నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. ఇక్కడ మూడు స్టేడియాలు.. వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌తోపాటు ముంబై-పుణె హైవేపై ఉన్న  గహుంజే స్టేడియం అందుబాటులో ఉండడమే అందుకు కారణం. అయితే, భారత్‌లో మూడో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించాలా? వద్దా? అనే నిర్ణయం లీగ్‌ ఆరంభానికి ముందు తీసుకొనే అవకాశం ఉందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. 


వేలానికి 1214 మంది

వచ్చే నెల 12, 13న బెంగళూరులో ఐపీఎల్‌ మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. లీగ్‌లో కొత్తగా చేరిన అహ్మదాబాద్‌, లఖ్‌నవూ ఫ్రాంచైజీలతో కలిపి 10 జట్లు వేలంలో పాల్గొంటాయి. మొత్తం 1214 మంది ఆటగాళ్లు (896 మంది భారతీయులు, 318 మంది విదేశీయులు) వేలానికి రిజిస్టర్‌ చేసుకున్నట్టు ఐపీఎల్‌ తెలిపింది. 33 మంది ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోడం లేదా ముందుగానే ఎంపిక చేసుకోవడం జరిగిందని పేర్కొంది. ఈ వేలంలో టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌, స్పిన్నర్‌ చాహల్‌, ఆస్ట్రేలియా స్టార్‌ వార్నర్‌ హాట్‌కేకుల్లా అమ్ముడవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. వీరితోపాటు ధవన్‌, ఇషాన్‌, శార్దూల్‌, దీపక్‌ చాహర్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌కు కూడా మంచి డిమాండ్‌ నెలకొంది. విదేశీ ఆటగాళ్లలో రబాడ (సౌతాఫ్రికా), మిచెల్‌ మార్ష్‌ (ఆస్ట్రేలియా), మార్క్‌ వుడ్‌ (ఇంగ్లండ్‌), బౌల్ట్‌ (న్యూజిలాండ్‌), కమిన్స్‌ (ఆస్ట్రేలియా) కోసం ఫ్రాంచైజీలు పోటీపడే చాన్సులున్నాయి. భుటాన్‌కు చెందిన ఓ అన్‌క్యా్‌ప్డ ఆటగాడితోపాటు 14 మంది అమెరికా ప్లేయర్లు కూడా వేలానికి రిజిస్టర్‌ చేసుకోవడం విశేషం.

Updated Date - 2022-01-23T08:37:04+05:30 IST