
ముంబై: ఐపీఎల్లో మూడో మ్యాచ్కు రంగం సిద్ధమైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఇక్కడి డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరగనున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ధోనీ చివరి నిమిషంలో తప్పుకోగా, ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు కోహ్లీ ఇది వరకే ప్రకటించాడు. దీంతో ఈసారి జట్టులో సాధారణ ఆటగాడిగా మారిపోయాడు.
ఇప్పుడు అతడిపై సారథ్య బాధ్యతలు లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. కోహ్లీ పగ్గాలు వదిలేయడంతో ఇప్పుడు ఫా డుప్లెసిస్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కోహ్లీ సారథ్యంలో ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిన ఆర్సీబీ డుప్లెసిస్ సారథ్యంలోనైనా కప్పు కొట్టుకురావాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, పంజాబ్ జట్టుకు కూడా టైటిల్ అందని ద్రాక్షగానే మారింది. పంజాబ్ ఈసారి కూడా కప్పు కొట్టడం కష్టమేనని సునీల్ గవాస్కర్ ఇప్పటికే చెప్పేశాడు. ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్ జట్టును ఎలా నడిపిస్తాడో వేచి చూడాల్సిందే.